సన్న రకం బ్లాక్ రైస్ ఇదిగో..!
- నాలుగేళ్లు శ్రమపడి అభివృద్ధి చేసిన రైతు శాస్త్రవేత్త
- మణిపూర్ బ్లాక్ రైస్‌తో బీపీటీని కలిపి రూపకల్పన
- ‘జీఎస్‌ఆర్ బ్లాక్ రైస్’గా నామకరణం
- పంట కాలం 120 రోజులు.. ఎకరాకు 25 బస్తాల దిగుబడి
- వచ్చే రబీ నాటికి రైతులకు అందుబాటులోకి విత్తనాలు
ఆయనో రెండెకరాల మాగాణికి ఆసామి. వరి సాగులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆయనకూ నిత్యకృత్యమే. సమస్య లోతుపాతులు ఎరిగిన రైతుగా వాటి పరిష్కారానికి తనదైన పద్ధతిలో కృషిచేస్తూ సరికొత్త వరి వంగడాలను సృష్టిస్తూ రైతులు, శాస్త్రవేత్తల మన్ననలు పొందుతున్నారు గొర్ల సత్యన్నారాయణ రెడ్డి.
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు ఆయన స్వగ్రామం. 1990 నుంచి వ్యవసాయం చేస్తూ పలు వరి వంగడాలను ఆయన రూపొందించారు. సరికొత్త వంగడాల రూపకల్పనకు, క్షేత్రస్థాయిలో వాటి పరిశీలనకు తన పొలాన్ని ప్రయోగశాలగా మార్చుకొన్నారాయన. ఈ కోవలో నాలుగేళ్ల పాటు శ్రమించి జీఎస్‌ఆర్ బ్లాక్ రైస్ అనే సరికొత్త వరి వంగడాన్ని ఆయన అభివృద్ధి చేశారు.
బ్లాక్ రైస్‌లో ప్రత్యేకమైన ఔషధ గుణాలు, పలు పోషకాలున్నాయి. పలు రకాల వ్యాధులను నివారించగలిగే, నయం చేయగలిగే శక్తి బ్లాక్‌రైస్ సొంతమని చెబుతుంటారు. బ్లాక్ రైస్‌లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సాగులో ఉన్న బ్లాక్‌రైస్ రకాలన్నీ ముతక రకాలే. వీటి అన్నం లావుగా ఉండటం వల్ల వినియోగదారులు తినేందుకు అంతగా ఇష్టపడటం లేదు. ప్రధానంగా ఈ సమస్యను దృష్టిలో ఉంచుకున్న సత్యన్నారాయణ రెడ్డి సన్నగా, నాజూగ్గా ఉండే జీఎస్‌ఆర్ బ్లాక్ రైస్ వంగడాన్ని రూపొందించారు.
బీపీటీ 5204 (సన్న రకం), మణిపూర్ బ్లాక్ రైస్ (దొడ్డు రకం) వంగడాలను సంకర పరిచి ఈ సన్న రకం బ్లాక్ రైస్ సూటి వంగడాన్ని ఆయన అభివృద్ధి చేశారు. సత్యన్నారాయణ రెడ్డి రూపొందించిన జీఎస్‌ఆర్ బ్లాక్‌రైస్ వంగడం సేంద్రియ పద్ధతుల్లో సాగుకు అనుకూలం. తక్కువ ఎత్తు పెరుగుతుంది. తీవ్ర గాలులను కూడా తట్టుకుంటుంది. సంప్రదాయ బ్లాక్ రైస్ వంగడాలలో ఎకరాకు 15 బస్తాల దిగుబడి మాత్రమే వస్తుంది. ఈ వంగడం ఎకరాకు 25 బస్తాల దిగుబడి వస్తుందని సత్యన్నారాయణ రెడ్డి చెపుతున్నారు.
మణిపూర్ బ్లాక్ రైస్ ధాన్యం పొట్టు, బియ్యం రెండూ నల్లగా, కొంచెం లావుగా ఉంటాయి. జీఎస్‌ఆర్ బ్లాక్‌రైస్‌లో మాత్రం ధాన్యం పొట్టు తెల్లగా ఉంటుంది. బియ్యం సన్నగా, నల్లగా ఉంటాయి. ఈ పంట కాలపరిమితి 125 రోజులు. సంప్రదాయ బ్లాక్ రైస్‌లోని ఔషధ గుణాలు, పోషకాలు ఇందులోనూ ఉంటాయని ఆయన అంటున్నారు. ప్రభుత్వ రంగ వరి శాస్త్రవేత్తలు జీఎస్‌ఆర్ బ్లాక్ రైస్ వంగడంపై అధ్యయనం చేసి, ఔషధ విలువలు, పోషకాలు తదితర వివరాలను వెల్లడిస్తే బాగుంటుంది.
– ఎం.డి. షైబుద్దీన్, సాక్షి, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా
2018 రబీకి రైతులకు ఈ విత్తనాన్ని అందిస్తా..
బ్లాక్ రైస్‌లో పలు పోషకాలుండటం వల్ల రైతులు తప్పని సరిగా తమ కుటుంబ ఆహారంలో భాగం చేసుకోవాలనేదే నా కోరిక. దీని కోసమే ఈ సన్నరకం బ్లాక్ రైస్ వంగడాన్ని అభివృద్ధి చేశాను. ప్రస్తుతం ఇది శాస్త్రవేత్తల పరిశీలనలో ఉంది. ఆసక్తి ఉన్న రైతులు వచ్చే ఖరీఫ్‌లో మా పొలానికి వచ్చి జీఎస్‌ఆర్ బ్లాక్‌రైస్ రకాన్ని పరిశీలించవచ్చు. 2018 రబీ నాటికల్లా ఈ సూటి రకాన్ని రైతులకు అందుబాటులోకి తెస్తాను.
– గొర్ల సత్యన్నారాయణ రెడ్డి (89199 32419),కందుకూరు, వేంసూరు మం., ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం