సాక్షి, అమరావతి బ్యూరో: నల్ల బియ్యం.. కొన్నాళ్లుగా జనం నోళ్లలో నానుతున్న పదం! రెండేళ్ల నుంచి కృష్ణా జిల్లాలోనూ ఈ బ్లాక్ రైస్ సాగు మొదలైంది. కేవలం అర ఎకరంతో మొదలైన ఈ పంట ఇప్పుడు 20 ఎకరాలకు పైగా చేరుకుంది. వచ్చే సీజనుకు 30 ఎకరాలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రకృతి సేద్యం ద్వారా ఈ బ్లాక్ రైస్‌ను పండిస్తున్నారు. జిల్లాలో గూడూరు మండలం పీజీలంక, తుమ్మలపాలెం, బంటుమిల్లి మండలం తుమ్మిడి, ఆగిరిపల్లి మండలం వడ్లమాను, కలిదిండి మండలం కోరుకొల్లు తదితర ప్రాంతాల్లో బ్లాక్ రైస్‌ను సాగు చేస్తున్నారు. వీటిలో కర్పుకవని, బర్మా బ్లాక్, కాలాభట్ రకాలను పండిస్తున్నారు.
దిగుబడి తక్కువ.. ధర ఎక్కువ
ధాన్యంలో ఇతర రకాలకంటే బ్లాక్ రైస్ దిగుబడి తక్కువగా ఉంటుంది. అయితే ధర మాత్రం ఎక్కువగానే ఉంటుంది. సాధారణ రకం ధాన్యం ఎకరానికి 25–30 (75 కిలోలు) బస్తాల దిగుబడి వస్తే బ్లాక్ రైస్ 10–15 మాత్రమే వస్తుంది. సాధారణ రకం ధాన్యం కిలో రూ.18 ఉంటే బ్లాక్ రైస్ రకం ధాన్యం రూ.100 వరకు ఉంది. వీటిని పండించిన రైతులు నల్ల బియ్యం కిలో రూ.170–180కి విక్రయిస్తుండగా మార్కెట్లో రూ.300–350 వరకు ధర పలుకుతోంది. అయితే బ్లాక్ రైస్ పొడవుగా ఎదగడం వల్ల గాలులకు నేల పడిపోతుంది. దీని సాగుకు రైతులు ఒకింత వెనకడుగు వేయడానికి ఇదో కారణమవుతోంది.
పెట్టుబడీ తక్కువే..
మరోవైపు బ్లాక్ రైస్‌కు పెట్టుబడి కూడా తక్కువే అవుతుంది. సాధారణ రకం వరికి ఎకరానికి రూ.28–30 వేల వరకు పెట్టుబడి అవసరం కాగా బ్లాక్ రైస్‌కు రూ.20 వేలు సరిపోతుంది. మామూలు వరికి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు తప్పనిసరి. కానీ బ్లాక్ రైస్‌కు గోఆధారిత జీవామృతం, గోమూత్రం, ఆవుపేడ, ద్విదళ గింజలతో తయారు చేసిన ఎరువును వినియోగిస్తారు. అందువల్ల తెగుళ్లకు ఆస్కారం ఉండదు. పురుగుమందులను పిచికారీ చేయాల్సిన అవసరం రాదు. కోస్తా జిల్లాల్లో ఖరీఫ్ సీజన్‌లో సాగుకు అనుకూలంగా ఉంటుంది. చౌడు నేలలు తప్ప మాగాణి నేలల్లో ఈ పంటకు వీలవుతుంది. సాధారణ వరి 120–130 రోజుల్లో పంట చేతికి వస్తే బ్లాక్ రైస్‌కు 140–150 సమయం పడుతుంది.
నల్ల బియ్యంతో ప్రయోజనాలివీ..
► ఈ బియ్యంలో ఉండే ఆంకోసైనిన్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి రోగ నిరోధక ఎంజైములను క్రియాశీలకం చేస్తుంది.
► మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులను నియంత్రిస్తుంది.
► శరీరంలో అనవసర కొవ్వును కరిగిస్తుంది.
► విటమిన్–బి, ఇ, నియాసిన్, కాల్షియం, మెగ్నిషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజ విలువలు అధికంగా ఉంటాయి.
► ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కణాలను శుభ్రపరుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment