పోషకాలు మెండుగా ఉండే బ్లాక్‌ రైస్‌.. కిలో ధరెంతో తెలుసా.. | Kurnool: Black Rice Benefits And Price | Sakshi
Sakshi News home page

పోషకాలు మెండుగా ఉండే బ్లాక్‌ రైస్‌.. కిలో ధరెంతో తెలుసా..

Published Mon, Sep 13 2021 7:34 PM | Last Updated on Mon, Sep 13 2021 8:35 PM

Kurnool: Black Rice Benefits And Price - Sakshi

నల్ల బియ్యం.. ప్రస్తుతం ప్రజల నోళ్లలో నానుతున్న పదం. పోషకాలు అధికంగా ఉన్న ఈ బియ్యాన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. రెండేళ్ల క్రితం జిల్లాలో దీని సాగు మొదలైంది. ప్రస్తుతం నంద్యాల డివిజన్‌ పరిధిలో 75 ఎకరాల్లో పండిస్తున్నారు. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ వస్తుండడంతో రైతులు ఈ పంట సాగు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

సాక్షి, నంద్యాల: సహజంగా తెల్లగా ఉండే బియ్యం రకాలను చూసి ఉంటాం. కాని బ్లాక్‌ రైస్‌ మాత్రం నల్లగా ఉంటాయి. పూర్వ కాలంలో వీటిని కేవలం చక్రవర్తులు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే తినడానికి కేటాయించేవారని ప్రతీతి. దీంతో వీటికి చక్రవర్తుల బియ్యం అని పేరు వచ్చింది. సాధారణ వరి కంటే బ్లాక్‌ రైస్‌ దిగుబడి తక్కువగా ఉంటుంది. అయితే ధర మాత్రం ఎక్కువగానే ఉంది. సాధారణ రకం ధాన్యం ఎకరాకు 25–30 (75 కిలోల) బస్తాల దిగుబడి వస్తే బ్లాక్‌ రైస్‌ 10–15 బస్తాలు మాత్రమే వస్తుంది. సాధారణ రకం బియ్యం కిలో రూ.45–50 ఉంటే... బ్లాక్‌ రైస్‌ కిలో  రూ.170 నుంచి రూ.180కి విక్రయిస్తున్నారు.  

పురుగు మందులు అవసరం లేదు.. 
బ్లాక్‌ రైస్‌ సాగుకు పెట్టుబడి తక్కువ అవుతుంది. సాధారణ రకం వరి సాగుకు ఎకరాకు రూ.28 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి అవుతుండగా బ్లాక్‌ రైస్‌కు రూ.20 వేలు సరిపోతుంది. మామూలు వరికి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు తప్పని సరి. బ్లాక్‌రైస్‌కు గో ఆధారిత జీవామృతం, గోమూత్రం, ఆవుపేడ, సేంద్రియ ఎరువును వినియోగిస్తారు.  ఫలితంగా తెగుళ్ల బెడద ఉండదు. పురుగుల ముందును పిచికారీ చేయాల్సిన అవసరం ఉండదు. సాధారణ వరి 120 నుంచి 130 రోజుల్లో చేతికి వస్తే బ్లాక్‌ రైస్‌ 140 నుంచి 150 రోజుల సమయం పడుతుంది.  
చదవండి: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి సీఎం జగన్ లేఖ

ప్రయోజనాలివీ.. 
► ఈ బియ్యంలో యాంటి ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని కాపాడుతాయి 
► కేరళ రాష్ట్రంలో వీటిని ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు  
► ఈ బియ్యం మధుమేహం, క్యాన్సర్, గుండెజబ్బులను నియంత్రిస్తాయి 
► శరీరంలోని అవనసర కొవ్వును కరిగిస్తాయి 
► కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింకు వంటి ఖనిజ విలువలు అధికంగా ఉంటాయి 
► ఫైబర్‌ కూడా ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ నియంత్రణలో ఉంటుంది 
► అధిక రక్తపోటు సమస్య నుంచి తప్పించుకోవచ్చు  
► నల్లబియ్యంలో యాంథో సైనిన్లూ అధికంగా ఉండి కంటి వ్యాధులను నయం చేస్తాయి 

ప్రతి 100 గ్రాముల బియ్యంలో..    

బియ్యం రకం  ప్రొటీన్లు  ఐరన్‌ ఫైబర్‌
పాలిష్డ్‌ బియ్యం 6.8గ్రా  1.2గ్రా   0.6గ్రా 
బ్రౌన్‌బియ్యం 7.9గ్రా 2.2గ్రా  2.8గ్రా
 నల్ల బియ్యం 8.5గ్రా  3.5గ్రా 4.9గ్రా

  రైతులకు విత్తనాన్ని అందిస్తా 
నేను కొన్నేళ్లుగా 65 ఎకరాలకుపైగా వరి సాగు చేస్తున్నా. ఈ ఏడాది రెండు ఎకరాల్లో బ్లాక్‌ రైస్‌ వేశా. ఈ బియ్యంలో పోషకాలు అధికంగా ఉంటాయి. మా కుటుంబ సభ్యుల కోసం దీనిని సాగు చేస్తున్నా. వ్యవసాయాధికారుల సలహాలు పాటిస్తున్నాం. ఆసక్తి ఉన్న రైతులకు వచ్చే ఖరీఫ్‌లో విత్తనాన్ని అందిస్తా.  
– అనంతయ్య, రైతు, నారాయణపురం, బండిఆత్మకూరు మండలం 

తెగుళ్లు ఉండవు 
ఈ ఏడాది  కొత్తగా బ్లాక్‌రైస్‌ సాగు చేస్తున్నా. ఈ పంటకు పురుగు మందులు వాడటం లేదు. గోమూత్రం, ఆవుపేడ, ద్విదళ గింజలతో తయారు చేసిన ఎరువును వినియోగిస్తున్నా. ఈ పంటకు తెగుళ్ల ఉండవు. పెట్టుబడి తక్కువ అని వ్యవసాయాధికారులు చెప్పారు.
– నాగరాజు, రైతు, పాణ్యం 

సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం 
బ్లాక్‌ రైస్‌ సాగును ప్రభుత్వం ప్రోత్సాహిస్తోంది. మార్కెటింగ్‌కు అవసరమైన సదుపాయాలను కలి్పస్తోంది. రెండేళ్లగా ఈ పంటను నంద్యాలలో రైతులు సాగు చేస్తున్నారు. క్రిమిసంహారక మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండిస్తున్నారు. ఈ బియ్యం ఆరోగ్యానికి ఎంతో మంచివి. 
– రాజశేఖర్, ఏడీఏ, నంద్యాల 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement