సిరులు కురిపిస్తున్న నల్లబియ్యం
గువాహటి: బియ్యం ఏ రంగులో ఉంటాయి ? అదేం ప్రశ్న.. తెల్లగా ఉంటాయంటారా. అయితే మీ అభిప్రాయం మార్చుకోవాల్సిందే. అస్సాంలోని గోల్‌పరా రాష్ట్రంలో రైతులు నలుపురంగు బియ్యాన్ని సాగు చేస్తూ అధిక దిగుబడి పొందుతున్నారు. సుమారు రెండు వందల మంది రైతులు ఈ పంటను పండిస్తున్నారు.
అమ్‌గురిపరా గ్రామానికి చెందిన యువ రైతు ఉపేంద్ర కృషి ఫలితమే నల్లబియ్యం సాగు. స్థానిక కృషి విజ్ఞాన్ కేంద్ర (కేవీకే) సంస్థ సహకారంతో ఉపేంద్ర 2011లో నలుపు రంగు బియ్యం పంటని సాగు చేయడం ప్రారంభించాడు. ‘2011లో కేవీకే సంస్థకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఉత్తమ్ కుమార్ బారువా నాకు నలుపు రంగు బియ్యం విత్తనాలను అందించారు. నాకున్న కొంత స్థలంలో ఈ విత్తనాలను సాగు చేశాను. మంచి ఫలితం వచ్చింది’ అని ఈ రైతు అన్నారు.
నల్లబియ్యం ఇక్కడి రైతుల జీవితాలను మార్చేసింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో బియ్యం రూ.100 పలుకుతోంది. బ్లాక్ రైస్‌లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్వీట్స్ తయారీల్లో కూడా నల్లబియ్యాన్ని ఉపయోగిస్తున్నారని ఉపేంద్ర వివరించారు.