![AP Farmers Fires on AP Govt: andhra pradesh](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/farmer-9.jpg.webp?itok=lhXYddqu)
కనీస మద్దతు ధర దక్కని పరిస్థితి
గతంలో ఎన్నడూ లేనంతగా క్షీణిస్తున్న ధరలు
అన్నదాత సుఖీభవ అమలు జాడలేదు
ఏపీ కౌలు రైతుల సంఘం ఆగ్రహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యంసహా ప్రధాన పంట ఉత్పత్తులకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కనీస మద్దతు ధరలు దక్కని దుస్థితి నెలకొందని ఏపీ కౌలు రైతుల సంఘం(ap tenant rythu sangam) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.రాధాకృష్ణ, ఎం.హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇచ్చిన ఎన్నికల హామీలను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోతోందన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం ‘ఆదాయం వచ్చే ఉద్యాన, వాణిజ్య పంటలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందంటూ’ పేర్కొనడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన ఆహార పంటలను దెబ్బతీసి, వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పాలన్న ప్రయత్నమేనని మండిపడ్డారు. శనివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో ముఖ్యాంశాలు..
⇒ ధాన్యం కనీస మద్దతు ధర 75 కేజీల బస్తాకు రూ.1,730లు ఇవ్వాల్సి ఉండగా, రాష్ట్రంలో ఒక్కరైతుకూ ఈ ధర దక్కలేదు. కేవలం రూ.1,400–1,500 మధ్య చెల్లించారు.
⇒ పత్తికి గతేడాది రూ.12వేలు ఉంటే, ఈ ఏడాది రూ.6వేలు, మిరపకు గతేడాది రూ.25వేలు ఉంటే, ఈ ఏడాది రూ.13వేలు, కందికి గతేడాది రూ.10 వేలుంటే, నేడు రూ.7వేలుకు మించి పలకడం లేదు.
⇒ అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుకు రూ.20వేల పెట్టుబడి సాయం మాటలకే పరిమితమయ్యింది.
పక్క రాష్ట్రాలను చూస్తే...
⇒ కేరళలో 16 రకాల పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు 50 శాతం కలిపి మద్దతు ధరలను నిర్ణయించడమే కాకుండా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది.
⇒ ఒరిస్సాలో ఈ ఏడాది నుంచి ధాన్యానికి ఎమ్మెస్పీకి రూ.800 బోనస్ కలిపి క్వింటాకు రూ.3,100 చొప్పున చెల్లించింది.
⇒ తెలంగాణలో కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment