నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: పది రోజులుగా ఎండల తీవ్రత పెరగడంతో వరి పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి. దీనికి తోడు ట్రాన్స్‌కో అధికారులు ఇష్టారీతిన కోతలు విధిస్తున్నారు. ఏ సమ యంలో కరెంటు వస్తుందో తెలియక రైతులు అయోమయం చెందుతున్నారు. వ్యవసాయానికి ఏడు గంటల ఉచిత కరెంటు అందించాల్సి ఉండగా ట్రాన్స్‌కో అధికారులు అధికారికంగా ఐదు గంటలుగా నిర్ణయించి కోతలు విధించారు. ఈ ఐదు గంటలు కూడా కరెంటు సరఫరా చేయడం లేదు. అనధికారికంగా కోతలు విధిస్తూ వ్యవసా యానికి మూడు గంటలే కరెంటు ఇస్తున్నారు.
ట్రాన్స్‌కో ప్రకటించిన ప్రకారమే జిల్లాలో నాలుగు గ్రూపులుగా విభజించి ఐదు గంటల పాటు కరెంటు అందించాల్సి ఉంది. మొదటి గ్రూపులో తెల్లవారు జాము 4.15 గంటల నుంచి ఉదయం 9.15 గంటల వరకు, రెండవ గ్రూపులో ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 2.15 గంటల వరకు, మూడవ గ్రూపులో మధ్యాహ్నం 2.15 గంటల నుంచి సాయంత్రం 7.15 గంటల వరకు , 4వ గ్రూపులో రాత్రి 9.15 గంటల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 2.15 గంటల వరకు జిల్లాలోని వివిధ ప్రాం తాల్లో కరెంటును సరఫరా చేయాల్సి ఉంది.ఐదు గంటల చొప్పున అందించాల్సిన కరెంటులో రెండు గంటల కోతను అధికారులు విధిస్తున్నారు. జిల్లాలో ఈ రబీ సీజన్ లో 1.25 లక్షల హెక్టార్లలో వరి పంట సాగవుతోంది. ప్రస్తుతం వరి కొన్ని ప్రాంతాల్లో పొట్టదశలో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో 20 రోజుల్లో చేతికొచ్చే విధంగా ఉంది.
పొట్టదశలో ఉన్న వరికి నీరు చాలా అవసరం కాగా, ఈ సమయంలో కరెంటు కోతల ప్రభావం తీవ్రంగా పడుతోంది. కష్టించి నాట్లు వేసిన రైతులు చేతికొచ్చే సమయంలో వరి పంట ఎండిపోవడంతో బేజారవుతున్నారు. సిరికొండ మండలంలో కొండపూర్ గ్రామానికి చెందిన రైతు మొగిలి సాయిలు నాలుగు రోజుల క్రితం తీవ్ర వేదనతో వరి పంటకు నిప్పుపెట్టుకున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోయి కరెంటు సక్రమంగా సరఫరా కాకపోవడంతో కళ్లముందే పంట ఎండిపోవడం చూడలేక రైతు ఈ చ ర్యకు పాల్పడ్డాడు. కరెంటు కోతలను నిరసిస్తూ కామారెడ్డి మండలం గర్గుల్‌లో రైతులు ప్రధాన రహదారిపై ధర్నా చేశారు.
వ్యవసాయ రంగానికి ఏడు గంటల పాటు సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో క్రాఫ్ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరించారు. పిట్లం మండలంలోని చిల్లర్గి సబ్‌స్టేషన్‌ను ఆ గ్రామ రైతులు ముట్టడించారు. ఎడాపెడా కరెంటు కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం భీంగల్ మండలంలో రైతులు కరెం టు సరఫరా కోసం ఆందోళన చేశారు. ఇదిలా ఉండగా జిల్లాలో కరెంటు కోతల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని ట్రాన్స్‌కో వర్గాలు పేర్కొంటున్నాయి. నీటి కాలువలు లేని కామారెడ్డి, ఎల్లారెడ్డి, భీంగల్ తదితర ప్రాంతాల్లో కరెంటు కోతలు పంటకు మరింత దుర్గతి పట్టించవచ్చని అంటున్నారు.
పంటలను నష్టపోనీయం
వ్యవసాయ రంగానికి కరెంటు సరఫరాలో కొద్ది పాటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నాలుగు రోజుల క్రితం వేయి మెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. త ర్వాత పునరుద్ధరించాం. వరి పంటలను నష్టపోనీయకుండా కరెంటు సరఫరా చేస్తాం. జిల్లాలో వరి పంటలు ఎండిపోతున్నట్లు నా దృష్టికి తీసుకువస్తే అక్కడ కరెంటు సరఫరాను పరిశీలించి సరఫరా చేయిస్తాం. వీలైనంత వరకు ఐదు గంటల పాటు ఖచ్చితంగా కరెంటు సరఫరా చేస్తాం.
పంటెండిపాయే
Published Tue, Apr 1 2014 2:31 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement