భీమడోలులో తడిసి ముద్దయిన ధాన్యపు రాశి
ఏలూరు మెట్రో/ఆకివీడు: అకాల వర్షం రైతులను నిండా ముంచింది. కన్నీరుమున్నీరు చేసింది. శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వివిధ దశల్లో ఉన్న పంటలను ముంచేసింది. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 8 లక్షల హెక్టార్లలో 5.50 లక్షల మంది రైతులు ప్రస్తుత సీజన్‌లో పంటలు సాగు చేశారు. డెల్టాలో ప్రధానంగా వరి, మెట్టలో మొక్కజొన్న, పొగాకు, వివిధ ఉద్యాన పంటలు సాగయ్యాయి. కరోనా లాక్‌డౌన్ కారణంగా పంట ఉత్పత్తులు అమ్ముకోవడానికి రైతులు కష్టపడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అప్రమత్తమై జిల్లాలో 338 పైచిలుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. మద్దతు ధరకు ధాన్యం కొనాలని ఆదేశాలు జారీ చేసింది.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కూడా 77 ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. ఉద్యాన రైతులనూ ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. దీంతో రైతులు ఆనంద పడ్డారు. అయితే వారి ఆనందంపై అకాలవర్షం నీళ్లు జల్లింది. శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి కోత దశకు చేరిన వరి పంట 81.6 హెక్టార్లలో, కళ్లాల్లో ఉన్న ధాన్యం 54.5 హెక్టార్లలో, అమ్మకానికి సిద్ధమైన 135 హెక్టార్లలోని మొక్కజొన్న, విక్రయానికి సిద్ధంగా ఉన్న 19 హెక్టార్లలోని వేరుశెనగ, 4 హెక్టార్లలో పొగాకు, 10 హెక్టార్లలో అరటి తోటలు, 4 హెక్టార్లలో మామిడి దెబ్బతిన్నాయని వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
65శాతం వరి మాసూళ్లు పూర్తి
జిల్లాలో 1.67 లక్షల హెక్టార్లలో దాళ్వా వరి సాగైంది. 15 రోజులుగా మాసూళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. సుమారు 65 శాతం మాసూళ్లు పూర్తయినట్టు అంచనా. అకాల వర్షానికి పంట నష్టపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తడిచిన పంటను రక్షించుకునేందుకు, ఎండబెట్టేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వారంలో మరో తుపాను హెచ్చరిక కనిపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రైతులు త్వరగా మాసూళ్లు పూర్తి చేసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకూ 1.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నట్టు అధికారులు తెలిపారు. జిల్లాలో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం.
ఈదురుగాలుల బీభత్సం
ఈదురుగాలుల బీభత్సానికి పలు చోట్ల 47 విద్యుత్ స్తంభాలు, 4 ట్రాన్స్‌ఫార్మర్లు, చెట్లు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.
భీమడోలు మండలంలో అత్యధిక వర్షపాతం
భీమడోలు: భీమడోలు మండలంలోనే జిల్లాలోనే అత్యధికంగా 60.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భీమడోలు రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం రేకులన్నీ ఎగిరిపోయాయి. ప్లాట్‌ఫాం షెడ్డు కూలడంతో అక్కడ నిద్రపోతున్న సాధువు బాబాజీ(56) మరణించాడు.
తేమ శాతం పెరుగుతుంది
అకాల వర్షం నిండా ముంచింది. ధాన్యం తడవడంతో తేమశాతం పెరుగుతుంది. పంటను ఆరబెట్టేందుకు అదనపు వ్యయం అవుతుంది. తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొంటే రైతును ఆదుకున్నట్టవుతుంది. – పైడి దాలినాయుడు, కౌలు రైతు, పెదకాపవరం
ప్రాథమిక నివేదిక సిద్ధం
అకాల వర్షానికి నష్టపోయిన పంటలను ప్రాథమికంగా అంచనా వేశాం. పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తాం. ధాన్యం రైతులకు సూచనలు అందిస్తున్నాం. వారికి అండగా ఉంటాం.– గౌసియా బేగం, వ్యవసాయ శాఖ జేడీ
Comments
Please login to add a commentAdd a comment