కుంభవృష్టి | Heavy Rains In Kovvur West Godavari | Sakshi
Sakshi News home page

కుంభవృష్టి

Published Mon, Aug 20 2018 10:44 AM | Last Updated on Mon, Aug 20 2018 10:44 AM

Heavy Rains In Kovvur West Godavari - Sakshi

పాలకొల్లు.. నీటిఘొల్లు: జలమయమైన పాలకొల్లు బస్టాండ్‌

పశ్చిమగోదావరి, కొవ్వూరు: అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపిలేని వర్షం.. శనివారం రాత్రి నుంచి కుంభవృష్టితో జిల్లా అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడాలేకుండా జలమయమయ్యాయి. ఫలితంగా జనజీవనం స్తంభించింది. ఏజెన్సీలో కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. మారుమూల గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. గోదారమ్మ శాంతించినా రాకపోకలు పునరుద్ధరణ కాలేదు. గోదావరి లంక గ్రామాలతోపాటు, మెట్ట, డెల్టాలో పంట చేలు ముంపునకు గురయ్యాయి. గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో జిల్లాలో 27.8 మిల్లీమీటర్లు సరాసరి వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో అన్ని పాఠశాలలకు  కలెక్టర్‌ కాటమనేని భాస్కర్‌ సోమవారం  సెలవు ప్రకటించారు. డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని, జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశాన్ని, మండల కేంద్రాల్లో జరిగే మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేశారు. జిల్లా కేంద్రంలో మాత్రం మీకోసం కార్యక్రమం యథాతథంగాజరుగుతుందని కలెక్టర్‌ భాస్కర్‌ ప్రకటించారు.

తగ్గిన గోదారి వరద
శనివారం కంటే గోదారి వరద కాస్త తగ్గుముఖం పట్టింది. కొన్ని ప్రాంతాల్లో పంటలు ముంపు నుంచి తేరుకుంటున్నాయి. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఇంకా మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈనెల 17వ తేదీ ఉదయం 11.30 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే రెండు రోజులు గడిచినా ఇంకా హెచ్చరిక ఉప సంహరణ కాలేదు. ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు నీటి మట్టం 12.30 అడుగులుగా నమోదైంది. ఆనకట్ట నుంచి 10,69,606 క్యూసెక్కుల వరదనీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. ఎగువ ప్రాంతంలోనూ నీటిమట్టాలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. దీంతో కొవ్వూరు గోష్పాదక్షేత్రం వరద ముంపు నుంచి బయట పడింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వత మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆచంట మండలంలో లంకగ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. పోలవరం మండలం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 19 గ్రామాలకు ఇంకా రాకపోకలు పునరుద్ధరణ కాలేదు.  కడెమ్మ స్లూయిజ్‌ వద్ద రోడ్డు బయటపడింది. కొత్తూరు, కొండ్రుకోట కాజ్‌వేలపై ఇంకా వరద నీరు ప్రవహిస్తోంది. ఆర్డీఓ కె.మోహన్‌కుమార్‌ టూరిజం బోటులో ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి అక్కడి  పరిస్థితిని స్ధానికులను అడిగి తెలుసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి రాకపోకలు పునరుద్ధణయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

వర్షంతో భారీ నష్టం
వర్షం భారీ నష్టాన్ని మిగిల్చింది. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. జీలుగుమిల్లి మండలం మద్య బరింకలపాడులో ఓ ఇంటిపై పిడుగుపడింది. ఇంట్లో విద్యుత్‌బోర్డు ధ్వంసం అయ్యింది. గిరిజన మహిళకు ప్రమాదం తృటిలో తప్పింది. జల్లేరు వాగులో జీలుగుమిల్లి మండలం దర్భ గూడెం గ్రామానికి చెందిన వ్యక్తి గల్లంతయ్యాడు. నరసాపురంలో గోదావరి వరద పొటెత్తడంతో గట్టు సమీపంలో ఉన్న నలభై ఇళ్లు నీట మునిగాయి. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో గరిష్టంగా లింగపాలెంలో 61.4, భీమడోలు 53.4, ఏలూరు లో 51.4, పోడూరులో 54.0 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.

ఉప్పొంగుతున్న కొండవాగులు
కొండవాగులు పొంగి ప్రవహిస్తుండడంతో బుట్టాయగూడెం మండలంలో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. జల్లేరు, బయనేరు, బంగారు పాపమ్మ కాలువ, గుబ్బలమంగమ్మ వాగు, అంకన్నగూడెం పెదవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కుక్కునూరు మండలంలో బంజరుగూడెం చెరువు నీరు బుర్గంపాడు–కుక్కునూరు రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గుండేటి వాగు ఉధృతి కారణంగా 30 నుంచి నలభై గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు సైతం 15 నుంచి ఇరవై కిలోమీటర్లు చుట్టు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. జీలుగుమిల్లి మండలంలో అశ్వారావుపేట వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

జలశయాలకు భారీగా వరదనీరు
కొంగువారి గూడెం ఎర్రకాలువ జలశయం గరిష్ట నీటిమట్టం 82 మీటర్ల నీటిమట్టానికి చేరుకుంది. దీంతో  వరదనీటిని ఆదివారం దిగువకు విడిచిపెట్టారు. దీంతో నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకొస్తోంది.  ప్రస్తుతం గంటకి 19వేల క్యూసెక్కుల వరదనీరు జలశయానికి చేరుతోంది. తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు తమ్మిలేరు జలాశయానికి భారీగా వరదనీరొచ్చి చేరుతోంది గంటకు 6,100 క్యూసెక్కుల నీరు జలశయంలోకి చేరుతోంది. జలాశయం నీటిమట్టం 345 అడుగులకు చేరింది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రా కాలువ ద్వారా జలాశయంలోకి భారీగా వరదనీరు వస్తోంది. సోమవారం గేట్లు ఎత్తే అవకాశాలున్నాయని నీటిపారుదల శాఖ డీఈ అప్పారావు చెబుతున్నారు. ఎర్రంపల్లి కాలువ బంక్‌ వద్ద జలాశయం కట్టకు గండి పడడంతో   పూడ్పించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. జల్లేరు జలశయంలోకి భారీగా వరద నీరొచ్చి చేరుతోంది. దీంతో సాయంత్రం 9వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. బుట్టాయగూడెం, సీతప్పగూడెం, పాలకుంట, దొరమామిడి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

ముంపులోనేఐదువేల ఎకరాల్లో పంటలు:
పెరవలి మండలంలో సుమారు 3 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వరద ముంపులోనే ఉన్నాయి.  నరసాపురం మండలంలో సుమారు 1,500 ఎకరాలు మునిగాయి. జల్లేరు జలాశయం నుంచి వరద నీరు దిగువకు విడిచిపెట్టడంతో సుమారు వంద ఎకరాలు ముంపు బారిన పడ్డాయి. గోదావరి నదీతీరంలో పోలవరం, తాళ్లపూడి, నిడదవోలు, యలమంచిలి, ఆచంట మండలాల్లో  సుమారు మూడు వందల ఎకరాల లంకభూములు ముంపు బారిన పడ్డాయి.  

అటవీప్రాంతంలో చిక్కుకున్న 150 మంది
కొండవాగు పొంగడంతో గుబ్బల మంగమ్మ గుడి వద్ద అటవీప్రాంతంలో 150 మంది చిక్కుకుపోయారు. సోమవారం ఉదయం ప్రత్యేక హెలీకాప్టర్‌లో వీరిని బయటకు తీసుకొస్తామని కలెక్టర్‌ భాస్కర్‌ చెప్పారు. ఈ ఘటనతో పాటు వర్షాలపై ముఖ్యమంత్రి కలెక్టర్‌ను ఆరా తీశారు. సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.   జంగారెడ్డి గూడెం మండలం జల్లేరు బ్రిడ్జివద్ద రోడ్డు తెగిపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి.

లంక గ్రామాలకు రాకపోకలు బంద్‌
ఆచంట మండలంలో లంకగ్రామాలకు ఇంకా రాకపోకలు పునరుద్ధరణ కాలేదు.  అయోధ్యలంకలో ఆచంట వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కన్వీనర్‌ చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఒక్కో కుటుంబానికి పదికిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు.  

జిల్లాలో 27.8 మి.మీటర్లు సరాసరి వర్షపాతం
కొవ్వూరు: అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. లింగపాలెంలో గరిష్టంగా 61.4 మిల్లీమీటర్లు, భీమడోలులో 53.2, ఏలూరులో 51.4, పోడూరు 54.0 మి.మీటర్లు చొప్పున వర్షం కురిసింది. గత ఇరవై నాలుగు గంటల్లో 27.8 మి.మీటర్లు సరాసరి వర్షపాతం నమోదైంది. జీలుగుమిల్లిలో 30.6, బుట్టాయగూడెంలో37.4, పోలవరంలో 5.8, తాళ్లపూడిలో 14.8, గోపాలపురంలో 2.6, కొయ్యలగూడెంలో 16.0, జంగారెడ్డిగూడెంలో 17.6, టి.నరసాపురంలో 28.6, చింతలపూడిలో 25.4, కామవరపు కోటలో 37.8, ద్వారకాతిరుమలలో 33.8, నల్లజర్లలో 10.2, దేవరపల్లిలో 8.2, చాగల్లులో 3.8, కొవ్వూరులో 3.4, నిడదవోలులో 14.6, తాడేపల్లిగూడెంలో 30.0, ఉంగుటూరులో 31.2, భీమడోలులో 53.2, పెదవేగిలో 42.6, పెదపాడులో 17.6, దెందులూరులో 46.2, నిడమర్రులో 25.4, గణపవరంలో 26.8, పెంటపాడులో 28.8, తణుకులో 11.4, ఉండ్రాజవరంలో 2.8, పెరవలిలో 9.2, ఇరగవరంలో 12.8, అత్తిలిలో 46.2, ఉండిలో 43.0, ఆకివీడులో 45.4, కాళ్లలో 48.6, భీమవరంలో 38.6,పాలకోడేరులో 28.2, వీరవాసరంలో 25.0, పెనుమంట్రలో 46.0, పెనుగొండలో 10.6,ఆచంటలో 40.2, పోడూరులో 54.0, పాలకోల్లులో 26.4, యలమంచిలిలో 23.4, నరసాపురంలో 28.2, మొగల్తూరులో 33.4, కుక్కునూరులో 38.0, వేలేరుపాడులో 18.2 మి.మీటర్ల చొప్పున వర్షం కురిసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement