సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గతంలో ఎన్నడూలేని రీతిలో కాస్త ఆలస్యంగా అయినా వర్షాలు విస్తారంగా కురిశాయి. దీంతో నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, కడెం సహా మధ్యతరహా ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. దీనికి తోడు 12వేల చెరువులు వందకు వంద శాతం నిండాయి. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత ఏడాది ఖరీఫ్‌లో 40.41 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరణ జరగ్గా, ఈ ఏడాది అంతకు మించి మరో 15లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా సేకరించాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది. మొత్తంగా 55లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు వీలుగా 2,544 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ధాన్యం సేకరణ విధానంపై జిల్లాల వారీగా వ్యవసాయ శాఖతో సమన్వయం చేస్తూ సమావేశాలు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగానే కొన్ని జిల్లాల్లో అంచనాకు మించి ధాన్యం దిగుబడులు రావచ్చనే అంశం తెరపైకి వచ్చింది.
ముఖ్యంగా సాగునీటి లభ్యత పుష్కలంగా ఉన్న ఖమ్మం జిల్లాలో గత ఏడాది 1.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగ్గా, ప్రస్తుతం అక్కడ సాగైన వరి విస్తీర్ణాన్నిబట్టి 2.50 లక్షల మెట్రిక్ టన్నులు రావొచ్చని అంచనా వేశారు. ఇదే రీతిన జగిత్యాలలో గత ఏడాది 3.3 లక్షలు కొనుగోళ్లు చేయగా, ఈ ఏడాది 6.80 లక్షల టన్నులు, నల్లగొండలో గత ఏడాది 2.20 లక్షలు కొనుగోళ్లు జరగ్గా ఈ ఏడాది 4.6 లక్షలు, సిద్దిపేటలో 70వేల టన్నులు చేయగా, ఈ ఏడాది 1.80 లక్షల మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేయాల్సి ఉంటుందని లెక్కించారు. వీటితో పాటే సూర్యాపేట, మంచిర్యాల, వనపర్తి జిల్లాల్లోనూ అంచనాకు మించి ధాన్యం కొనుగోళ్లు చేయాల్సి ఉంటుందని తేల్చారు.
మొత్తంగా తొలి అంచనాకన్నా 10లక్షల మెట్రిక్ టన్నుల మేర అధికంగా ధాన్యం కొనుగోళ్లు చేయాల్సి ఉంటుందని లెక్కగట్టారు. దీనికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాల సంఖ్యను 2,544 నుంచి 3,297 కేంద్రాలకు పెంచాలని నిర్ణయించారు. మొత్తంగా ఈ ధాన్యం కొనుగోళ్లకు రూ.18వేల కోట్ల మేర వెచ్చించనున్నారు. ఇక ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు తెరిచినప్పటికీ వర్షాల కారణంగా ధాన్యం ఇంకా కేంద్రాలకు రావడం లేదు. దీపావళి తర్వాత నుంచి పెద్దఎత్తున ధాన్యం రానున్న దృష్ట్యా, కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లాయి. దీపావళి తర్వాత ముమ్మరంగా ధాన్యం సేకరణ ఆరంభం కానుంది.
రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో అంచనాలకు మించి ధాన్యం మార్కెట్లను ముంచెత్తనుంది. విస్తారంగా కురిసిన వర్షాలు, సాగునీటి ప్రాజెక్టుల కింద పెరిగిన సాగు, చెరువుల కింద పూర్తి స్థాయిలో సాగైన పంటల కారణంగా తొలుత అంచనా వేసిన యాభై అయిదు లక్షల మెట్రిక్ టన్నులకు మించి మరో పది లక్షల మేర ధాన్యం అదనంగా సేకరించాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ తాజాగా అంచనా వేసింది. దానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఏడెనిమిది జిల్లాల నుంచి గత ఏడాది కన్నా రెట్టింపు ధాన్యం రావచ్చన్న అంచనాలతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.
స్టోరేజీపైనా ముందస్తు జాగ్రత్తలు..
పెరుగుతున్న ధాన్యం కొనుగోళ్లకు అనుగుణంగా బియ్యం నిల్వలకు అవసరమైన గోదాములను సిద్ధంచేసే అంశంపై పౌర సరఫరాల శాఖ కసరత్తులు ముమ్మరం చేసింది. ధాన్యాన్ని మరపట్టించి బియ్యంగా మార్చిన అనంతరం వాటి నిల్వలకు ఇబ్బంది లేకుండా ఎఫ్‌సీఐతో చర్చించింది. గత ఏడాది రబీకి సంబంధించిన 11 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ నుంచి తీసుకునేందుకు ఎఫ్‌సీఐ సుముఖత తెలిపింది. ముఖ్యంగా స్టోరేజీ సమస్య అధికంగా ఉన్న కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, కొత్తగూడెంలలో స్టోరేజీ సమస్యను అధిగమించే చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment