వ్యవసాయ వర్సిటీ విడుదల చేసిన వరి వంగడాల్లో అత్యంత కీలకమైనది ‘ఆర్‌ఎన్‌ఆర్ 29235’ రకమే. ఇప్పటివరకు యాసంగిలో వేస్తున్న వివిధ రకాల వరి రకాల్లో నూక శాతం అధికంగా ఉంటోంది. ఇది ధాన్యం కొనుగోళ్ల విషయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి కూడా కారణమైంది. ప్రస్తుతం యాసంగిలో వేస్తున్న వరి రకాలను మిల్లింగ్ చేసినప్పుడు 40% బియ్యం, 60% నూకలు వస్తున్నాయి. అదే తాజాగా విడుదల చేసిన ‘ఆర్‌ఎన్‌ఆర్ 29235’ రకం వరి అయితే బియ్యం దాదాపు 62%, నూకలు 38% వస్తాయని.. దీనివల్ల కొనుగోళ్ల వివాదానికి ఫుల్‌స్టాప్ పడుతుందని వర్సిటీ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ జగదీశ్వర్ తెలిపారు. కొత్తగా విడుదల చేసిన అన్ని రకాల వరి వంగడాల ద్వారా అదనంగా 10% దిగుబడి వస్తుందని వివరించారు. ఇక వరి పంటకాలం ఇప్పటివరకు 135 రోజులుగా ఉండగా.. కొత్త రకాలు 125 రోజులకే కోతకు వస్తాయని వెల్లడించారు.
సాక్షి, హైదరాబాద్: తక్కువ సమయంలో దిగుబడి రావడంతోపాటు మిల్లింగ్ చేసినప్పుడు నూకలు తక్కువగా వచ్చే సరికొత్త వరి రకాన్ని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. ‘ఆర్‌ఎన్‌ఆర్ 29235’ పేరిట ఈ సరికొత్త వరి వంగడాన్ని తాజాగా విడుదల చేసింది. ఇతర రకాల వరితో పోలిస్తే దీనిద్వారా దిగుబడి కూడా పది శాతం ఎక్కువగా ఉంటుందని ప్రకటించింది. దీనితోపాటు మరో 9 రకాల వరి వంగడాలు, ఇంకో ఐదు ఇతర పంటల రకాలను వ్యవసాయ వర్సిటీ విడుదల చేసింది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, అధిక వర్షాలను తట్టుకునేలా, తక్కువ కాలంలోనే దిగుబడి వచ్చేలా ఈ వంగడాలను అభివృద్ధి చేసినట్టు తెలిపింది.
వీటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని.. వచ్చే ఏడాది వానాకాలం సీజన్ నాటికి కొత్త రకాలు రైతులకు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. వీటితో రైతులకు లాభసాటిగా ఉండటంతోపాటు వినియోగదారులకూ ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో..: ప్రస్తుతం అభివృద్ధి చేసిన కొత్త వంగడాల్లో ఎనిమిదింటిని జాతీయ స్థాయిలో, ఏడింటిని రాష్ట్రస్థాయిలో విడుదల చేశారు. ఈ ఏడాది జూన్‌లో ఢిల్లీలో జరిగిన జాతీయ వంగడాల విడుదల, నోటిఫికేషన్ కమిటీ సమావేశంలో.. వరిలో ఐదు, పశుగ్రాస సజ్జలో రెండు, నువ్వుల్లో ఒక రకానికి ఆమోదం లభించింది.
ఇక సెప్టెంబర్‌లో జరిగిన రాష్ట్రస్థాయిలో కొత్త వంగడాల విడుదల ఉప కమిటీ సమావేశంలో ఐదు వరి రకాలు, మినుము, నువ్వు పంటల్లో ఒక్కో రకం చొప్పున ఏడు నూతన రకాలను ఆమోదించారు. మొత్తంగా ఈ 15 వంగడాలను వ్యవసాయ వర్సిటీ తాజాగా విడుదల చేసింది. తెలంగాణ ఏర్పాటయ్యాక 2014 నుంచి ఇప్పటివరకు వ్యవసాయ వర్సిటీ మొత్తంగా 61 కొత్త వంగడాలను అభివృద్ధి చేసింది. ఇందులో 26 వరి రకాలు, 8 కంది రకాలు ఉన్నాయి.
రైతుల ప్రయోజనమే లక్ష్యంగా: ఇన్‌చార్జి వీసీ రఘునందన్‌రావు
రైతులకు మేలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం వ్యవసాయ శాఖ అనేక చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ కార్యదర్శి, వర్సిటీ ఇన్‌చార్జి వీసీ రఘునందన్‌రావు, రిజి్రస్టార్ ఎస్.సుధీర్ కుమార్, రీసెర్చ్ డైరెక్టర్ జగదీశ్వర్ తెలిపారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. పత్తిలో నూతన రకాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అధిక సాంద్రత పత్తిపై ప్రయోగాలు జరుగుతున్నాయని.. దానిని 8,500 ఎకరాల్లో సాగు చేస్తున్నామని వివరించారు. కొత్త వంగడాల అభివృద్ధికి గతంలో 8–10 ఏళ్ల సమయం పట్టేదని, స్పీడ్ బ్రీడింగ్ బయో టెక్నాలజీ వినియోగంతో ఐదేళ్లలో ప్రయోగం పూర్తవుతోందని తెలిపారు. ఇక జన్యుమారి్పడి వంగడాలపైనా వర్సిటీ దృష్టి సారించినట్టు తెలిపారు. ఇప్పటికే మొక్కజొన్న, వరిలో ఈ తరహా పరిశోధనలు చేపట్టామని.. పత్తికి సంబంధించి కేంద్రం అనుమతి కోరామని వెల్లడించారు.
జాతీయ స్థాయిలో విడుదలైన రకాలివీ..
1) వరి–1 (ఆర్‌ఎన్‌ఆర్ 11718): కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో పండించేందుకు సిఫార్సు చేశారు. ఖరీఫ్‌కు అనుకూలం. పంట కాలం 135 నుంచి 140 రోజులు. హెక్టారుకు 7 వేల నుంచి 8 వేల కిలోలు దిగుబడి వస్తుంది. చవుడు నేలల్లోనూ వేసుకోవచ్చు.
2) తెలంగాణ రైస్ 5 (ఆర్‌ఎన్‌ఆర్ 28362): ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో నీటి వసతి గల ప్రాంతాలకు సిఫార్సు చేశారు. వానాకాలానికి అనుకూలం. పంట కాలం 130–135 రోజులు. దిగుబడి హెక్టారుకు 7,000–7,500 కిలోలు
3) తెలంగాణ రైస్ 6 (కేఎన్‌ఎం 7048): ఒడిశా, పశి్చమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల కోసం సిఫార్సు చేశారు. వానాకాలం అనుకూలం. పంట కాలం 115–120 రోజులే. దిగుబడి హెక్టారుకు 8000–8500 కిలోలు. ఇది దొడ్డురకం.
4) తెలంగాణ రైస్ 7 (కేఎన్‌ఎం 6965): ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలకు సిఫార్సు చేశారు. వానాకాలం పంట. 115–120 రోజుల్లో చేతికి వస్తుంది. దిగుబడి హెక్టారుకు 7500–8500 కిలోలు. ఇది పొడవు సన్నగింజ రకం.
5) తెలంగాణ రైస్ 8 (డబ్లు్యజీఎల్ 1487): వానాకాలం పంట. 125–130 రోజుల్లో.. హెక్టారుకు 5,600–6,000 కిలోల దిగుబడి వస్తుంది. మధ్యస్థ, సన్నరకం ఇది. ఫాస్పరాస్ తక్కువగా ఉన్న నేలలకు అనుకూలం.
6) నువ్వులు– తెలంగాణ తిల్–1 (జేసీఎస్ 3202): తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు సిఫార్సు చేశారు. పంటకాలం 91–95 రోజులే. హెక్టారుకు 820–980 కిలోలు దిగుబడి వస్తుంది.
7) తెలంగాణ పశుగ్రాసపు సజ్జ–1 (టీఎస్‌ఎఫ్‌బీ 17–7): తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్టాలకు వానాకాలం సీజన్‌కు సిఫార్సు చేశారు. పంటకాలం (5౦శాతం పూతదశ) 56–68 రోజులు.
8) తెలంగాణ పలుకోతల సజ్జ–1 (టీఎస్‌ఎఫ్‌బీ 18–1): పంటకాలం (5౦శాతం పూత దశ ) 56–68 రోజులు.
రాష్ట్రస్థాయిలో విడుదలైన రకాలివీ..
1) రాజేంద్రనగర్ వరి–3 (ఆర్‌ఎన్‌ఆర్ 15459): రాష్ట్రంలో నీటి వసతి గల ప్రాంతాలకు సిఫార్సు చేశారు. వానాకాలంలో 135– 140 రోజుల పంట. దిగుబడి హెక్టారుకు 4,000– 4,500 కిలోలు వస్తుంది. సువాసన గల అతి చిన్న గింజ రకం ఇది. సాంప్రదాయ చిట్టిముత్యాల రకం వరితో పోలి్చతే చేనుపై పంట పడిపోయే అవకాశం తక్కువ.
2) రాజేంద్రనగర్ వరి–4 (ఆర్‌ఎన్‌ఆర్ 21278): రాష్ట్రంలో నీటి వసతి గల ప్రాంతాలకు సిఫార్సు చేశారు. వానాకాలం, యాసంగి సీజన్లలో వేయవచ్చు. వానాకాలంలో 115–120 రోజుల స్వల్పకాలిక రకం. దిగుబడి హెక్టారుకు 6,500 కిలోలు వస్తుంది. అగ్గితెగులును మధ్యస్థంగా తట్టుకుంటుంది. పొట్టి గింజ రకం, చేనుపై పంట పడిపోదు.
3) రాజేంద్రనగర్ వరి–5 (ఆర్‌ఎన్‌ఆర్ 29235): రాష్ట్రంలో నీటి వసతి గల ప్రాంతాల్లో రెండు సీజన్లలో పండించొచ్చు. వానాకాలంలో 120–125 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. దిగుబడి హెక్టారుకు 7,500 కిలోలు. పొడవు, సన్నగింజ రకం. పొడవు గింజ రకాల్లో అధిక దిగుబడి ఇచ్చే రకం ఇదే. చేను పొట్టిగా ఉండి పడిపోదు. యాసంగిలో ఈ రకం ధాన్యం మిల్లింగ్ చేస్తే నూకలు తక్కువగా వస్తాయి.
4) జగిత్యాల వరి–2 (జేజీఎల్ 28545): రాష్ట్రంలోని నీటి వసతి గల ప్రాంతాలకు సిఫార్సు చేశారు. వానాకాలంలో 135 రోజుల్లో పంట చేతికి వస్తుంది. హెక్టారుకు 7,500 కిలోలు దిగుబడి ఇస్తుంది.
5) జగిత్యాల వరి–3 (జేజీఎల్ 27356): రాష్ట్రంలోని నీటి వసతిగల ప్రాంతాలకు సిఫార్సు చేశారు. వానాకాలానికి అనుకూలం. పంట కాలం 130–135 రోజులు. దిగుబడి హెక్టారుకు 7000 కిలోలు వస్తుంది. ఇది అతి సన్నగింజ రకం ఇది.
6) మధిర మినుము–1 (ఎంబీజీ 1070): తెలంగాణ రాష్ట్రం అంతటా పండించడానికి అనుకూలం. వానాకాలం, యాసంగి, ఎండాకాలంలలోనూ పండించవచ్చు. పంటకాలం 75–80 రోజులు. హెక్టారుకు దిగుబడి 1,400–1,500 కిలోలు వస్తుంది. మధ్యస్థ దొడ్డు నలుపు గింజ రకం ఇది.
7) జగిత్యాల తిల్ –1 నువ్వులు (జేసీఎస్ 1020): పంటకాలం 85–95 రోజులు. దిగుబడి హెక్టారుకు 1,050–1,100 కిలోలు వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment