వరి పైరు
ఖమ్మంవ్యవసాయం: రబీ(యాసంగి) సీజన్‌లో పంటల సాగుకు వ్యవసాయ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలో ఉన్న నీటి వనరుల ఆధారంగా 53,620 హెక్టార్లలో ధాన్యం, చిరు ధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, వాణిజ్య పంటలు సాగు చేసే అవకాశం ఉన్నట్లు అంచనాలు రూపొందించింది. ధాన్యపు పంటల్లో ప్రధానంగా వరి సాగు చేసే అవకాశం ఉంది. చిరు ధాన్యం పంటల్లో జొన్న, సజ్జ, మొక్కజొన్న ఉండగా.. వీటిలో ప్రధానంగా మొక్కజొన్న పంట సాగు చేసే అవకాశాలున్నాయి. ఇక పప్పు పంటల్లో పెసలు, మినుము, స్వల్పంగా కంది, ఉలవల పంటలను సాగు చేస్తారు. నూనె గింజల పంటల్లో వేరుశనగ, నువ్వులు, పొద్దు తిరుగుడు పంటలను సాగు చేస్తున్నారు.
అక్కడక్కడ వాణిజ్య పంటలుగా మిర్చి, పొగాకు తదితర పంటలను సాగు చేస్తారు. ఖరీఫ్‌లో కురిసిన వర్షాలకు జిల్లాలోని భూగర్భ జలాల ఆధారంగా రైతులు పంటలను సాగు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆగస్టులో కురిసిన వర్షాలకు జిల్లాకు ప్రధాన నీటివనరైన నాగార్జున సాగర్‌లోకి సమృద్ధిగా నీరు చేరింది. ఆ నీటిని ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు విడుదల చేశారు. దీంతో జిల్లాలో భూగర్భ జలం కూడా ఆశాజనకంగా ఉంది. బోరు బావులు, చెరువుల కింద, జలాశయాల కింద రైతులు రబీ పంటలను సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయా వనరుల ఆధారంగానే జిల్లా వ్యవసాయ శాఖ రబీ ప్రణాళికలను సిద్ధం చేసింది. అయితే సాగర్ నుంచి నీటి విడుదల జరిగితే సాగు విస్తీర్ణం మరింతగా పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది ఆలస్యంగా కురిసిన వర్షాలతో జిల్లాలో రబీ సాగు బాగా పెరిగింది. గత ఏడాది రబీ సాగు అంచనా 43,994 హెక్టార్లు కాగా.. సాగర్ నుంచి నీరు విడుదల కావడంతో 83,440 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ఈ ఏడాది కూడా వ్యవసాయ శాఖ 53,620 హెక్టార్లను అంచనా వేయగా, అంతకు మించి పంటల సాగు ఉండే అవకాశాలు ఉన్నాయి.
వరి సాగు అంచనా 31,390 హెక్టార్లు..
జిల్లాలో 31,390 హెక్టార్లలో వరి సాగు చేసే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ ప్రణాళికలో పేర్కొంది. గత ఏడాది రబీలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 23,516 హెక్టార్లు కాగా.. రెట్టింపుగా 51,130 హెక్టార్లలో పంట వేశారు. ఈ ఏడాది నీటి వనరులు మెరుగుపడడంతో సాధారణ సాగు విస్తీర్ణాన్ని పెంచారు. అయితే సాగర్ నీటి విడుదల ఉంటే మాత్రం సాధారణ సాగుకు మించి వరి పంట సాగు చేసే అవకాశాలున్నాయి.
అందుబాటులో విత్తనాలు, ఎరువులు
రబీలో సాగు చేసే వివిధ రకాల పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచే విధంగా జిల్లా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, హాకా వంటి సంస్థల నుంచి విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు పూనుకుంటోంది. వరి, వేరుశనగ, మినుము, పెసలు, పొద్దు తిరుగుడు, జనుము, మొక్కజొన్న, పిల్లి పెసర, నువ్వులు, జీలుగు, శనిగల వంటి విత్తనాలను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపట్టారు. జిల్లాలో పంటల సాగునుబట్టి డీఏపీ, యూరియా, పొటాష్, కాంప్లెక్స్, సింగల్ సూపర్ పాస్పేట్ వంటి ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 1,08,080 మెట్రిక్ టన్నుల ఎరువులను సిద్ధంగా ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఆరుతడికి ప్రాధాన్యం ఇవ్వండి..
రబీలో ఆదాయాన్నిచ్చే పంటలను సాగు చేసుకోవాలి. ఆరుతడి పంటల సాగు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. మిశ్రమ పంటలను సాగు చేయడం వల్ల ఆదాయం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో నీటి సమస్య ఉండే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మొక్కజొన్న, జొన్న పంటలను జీరో టిల్లేజ్ పద్ధతిలో సాగు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. తక్కువ కాలపరిమితి కలిగిన పంటలను సాగు చేసుకోవాలి. – ఎ.ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లా వ్యవసాయాధికారి
Comments
Please login to add a commentAdd a comment