లక్ష్యానికి మించి.. | Telangana sets record in Yasangi paddy procurement | Sakshi
Sakshi News home page

లక్ష్యానికి మించి..

Jun 6 2025 4:52 AM | Updated on Jun 6 2025 4:52 AM

Telangana sets record in Yasangi paddy procurement

రికార్డు స్థాయిలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు 

70.13 లక్షల టన్నులకుగాను 71.39 లక్షల టన్నుల ధాన్యం సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం 

ఇంకా కొనుగోలు కేంద్రాల్లో లక్షకుపైగా టన్నుల ధాన్యం 

కొనుగోలు చేసిన ధాన్యంలో 22.20 లక్షల టన్నుల మేర సన్నాలు

12.08 లక్షల మంది రైతుల నుంచి రూ. 16,547 కోట్ల విలువైన ధాన్యం సేకరణ 

ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ. 14,740 కోట్లు జమ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసింది. పంట దిగుబడి పెరిగిన నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్ష్యానికి మించి పౌరసరఫరాల సంస్థ ధాన్యం కొన్నది. పెరిగిన వరి పంట విస్తీర్ణం నేపథ్యంలో యాసంగిలో 70.13 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా గురువారం నాటికి ఏకంగా 71.39 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు.

మరో 3–4 కొనుగోలు కేంద్రాల్లో లక్షకుపైగా మెట్రిక్‌ టన్నుల ధాన్యం కాంటా కావడానికి సిద్ధంగా ఉంది. ఈ లెక్కన కొనుగోళ్ల ప్రక్రియ ముగిసేలోగా మరో 2 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు వచ్చే అవకాశం ఉందని పౌరసరఫరాల సంస్థ తెలిపింది. గతేడాది యాసంగి సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్‌లో సుమారు 25 లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా ధాన్యాన్ని అధికంగా సేకరించే అవకాశం ఉంది.  

సన్నధాన్యం 22.20 ఎల్‌ఎంటీ 
రాష్ట్రంలో ఇప్పటివరకు కొనుగోలు చేసిన 71.39 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యంలో సన్నరకం ధాన్యం 22.20 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే. సన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 చొప్పున ప్రోత్సాహక బోనస్‌ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో గత వానాకాలం సీజన్‌ నుంచే సన్నాల సాగు పెరిగింది. ఎన్నడూ లేనివిధంగా యాసంగిలో భారీ ఎత్తున సన్నాల సాగు జరిగింది.

అయితే నిజామాబాద్, నల్లగొండ, కామారెడ్డి, సూర్యాపేట, పెద్దపల్లి, సిద్దిపేట, జగిత్యాల తదితర జిల్లాల్లో పండించిన సన్నాలను ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చే బోనస్‌ ధరను కూడా ఇచ్చి పెద్ద ఎత్తున కొనడంతో పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు సన్న వడ్లు రాలేదు. కనీసం 30 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు సన్న ధాన్యం సేకరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయగా ఈ సీజన్‌ పూర్తయ్యేలోగా 23 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంది. 

12.08 లక్షల రైతుల నుంచి.. 
రాష్ట్రంలో కొనుగోలు చేసిన 71.39 లక్షల ధాన్యాన్ని 12.09 రైతుల నుంచి సేకరించారు. ఇందులో దొడ్డు రకం ధాన్యం 49.20 మెట్రిక్‌ టన్నులను 8.42 లక్షల మంది రైతుల నుంచి సేకరించారు. 22.20 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న రకం ధాన్యాన్ని 3.66 లక్షల మంది రైతుల నుంచి కొన్నారు. ఈ మొత్తం ధాన్యం విలువ రూ. 16,547 కోట్లుకాగా, ఇప్పటివరకు రూ. 14,740 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. మరో 1,807 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది.  

నిజామాబాద్‌ ఫస్ట్‌.. ఆదిలాబాద్‌ లాస్ట్‌ 
యాసంగి ధాన్యం సేకరణలో ఎప్పటిలాగే నిజామాబాద్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి రూ. 1,870 కోట్ల విలువైన 8.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ సేకరించింది. 5.96 లక్షల మెట్రిక్‌ టన్నులతో రెండో స్థానంలో నల్లగొండ జిల్లా నిలవగా 4.61 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యంతో జగిత్యాల మూడో స్థానంలో ఉంది. అతితక్కువగా ఆదిలాబాద్‌ జిల్లాలో 144 మంది రైతుల నుంచి 645 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. సాగునీరు లేకపోవడంతోపాటు కూరగాయలు, ఇతర ఉద్యానవన పంటల సాగు ఆదిలాబాద్‌లో ఎక్కువ వల్ల వరి పండించే రైతులు తక్కువ. 
 

Advertisement
 
Advertisement
Advertisement