
సాక్షి, అమరావతి : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వత్యిరేకంగా జాతీయ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్ ప్రకటనపై ఏపీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటన వెనుక ప్రధాని నరేంద్రమోదీ ఉండి ఉండవచ్చునేమోనని ఆయన సందేహం. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ చేస్తూ ఆయన ఈ అనుమానం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ ప్రకటనల వెనుక మోదీ ఉన్నారేమో అనిపిస్తోంది. కేసీఆర్ మాటల అలానే ఉన్నాయి’ అని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం కోసమే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రకటన చేశారని అచ్చెన్నాయుడు విశ్లేషించారు. త్వరలో జరగనున్న కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం దేశ రాజకీయాలపై ఉంటుందన్నారు. కర్ణాటకలో 200 శాతం సిద్ధరామయ్య గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అందరి చూపు ప్రస్తుతం కేంద్రంపైన ఉందని, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు.