న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆగస్టు 15న ఎర్రకోటపై నరేంద్రమోదీ చేయనున్న ప్రసంగమే ప్రధానమంత్రిగా ఆయన చివరి ప్రసంగమని, వచ్చే ఏడాది ఆయన ప్రధానిగా కొనసాగబోరని, ఇది రాసి ఇస్తానని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డెరెక్ ఒబ్రియాన్ వ్యాఖ్యానించారు. 2019లో ప్రధానిగా మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేయకుండా చూడాల్సిన సవాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల ముందు ఉందని అన్నారు.
‘ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఈ ఏడాది ఆగస్టు 15న తన చివరి ప్రసంగం చేయబోతున్నారు. ఇది సుస్పష్టమైన సంకేతం. 2019లో ఆయన ఎర్రకోట నుంచి ప్రసంగించలేరు. ఈ సవాల్‌ను తృణమూల్ కాంగ్రెస్‌తోపాటు, అన్ని ప్రతిపక్ష పార్టీలు స్వీకరించాలి’ అని డెరెక్ పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా థర్డ్ ప్రంట్ ఏర్పాటుచేస్తానంటూ ప్రకటించిన తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. థర్డ్ ఫ్రంట్ ప్రకటన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసిన మమత.. భావసారూప్యమున్న పార్టీలతో కలిసి జాతీయ కూటమిగా ఏర్పడేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో డెరెక్ ఓబ్రియాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment