రూ. 30,571 కోట్లు ఇవ్వండి
- రాష్ట్రానికి ప్యాకేజీ ఇవ్వాలని ప్రధాని మోదీని కోరనున్న కేసీఆర్
- ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి పెంచండి
- నీతి ఆయోగ్ ఉప కమిటీ భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీకి..
- కేంద్ర మంత్రులు జైట్లీ, గడ్కారీలతోనూ భేటీకానున్న ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి విజ్ఞప్తి చేయనున్నారు. దానితోపాటు రాష్ట్రానికి రుణపరిమితి పెంచాలని, జాతీయ రహదారులు మంజూరు చేయాలని కోరనున్నారు. వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ పథకాలకు సాయం అందించాలని విజ్ఞప్తి చేయనున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల మదింపుపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ ఉప కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న ఆయన రాత్రి ఏడు గంటలకు నీతి ఆయోగ్ ఉప కమిటీ సభ్యులతో కలసి ప్రధానితో భేటీ అవుతారు.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ కన్వీనర్‌గా ఉన్న ఈ సబ్‌కమిటీలోని ముఖ్యమంత్రుల బృందంలో కేసీఆర్ కూడా ఉన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలపై అధ్యయనం చేసిన ఈ బృందం గత నాలుగు నెలల్లో పలుమార్లు సమావేశమైంది. పథకాలు, నిధుల్లో కేంద్ర రాష్ట్రాల వాటా తదితర అంశాలపై తమ సిఫారసులతో తుది నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను ప్రధానికి అందజేస్తారు. ఇదే సందర్భంగా తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని ప్రధానిని సీఎం కేసీఆర్ కోరనున్నారు. తెలంగాణ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద రూ. 30,571 కోట్లు కావాలని, ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని మూడు శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలని మరోసారి విజ్ఞప్తి చేయనున్నారు.
యాగానికి రండి
డిసెంబర్‌లో నిర్వహించ తలపెట్టిన ఆయుత మహాచండీ యాగానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ ఆహ్వానించనున్నారు. అపాయింట్‌మెంట్ లభిస్తే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలసి చండీయాగానికి ఆహ్వానించాలని నిర్ణయించారు. మెదక్ జిల్లా ఎర్రవల్లి సమీపంలో డిసెంబర్ 23 నుంచి 27వ తేదీ వరకు ఈ యాగం నిర్వహణకు సీఎం కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్నారు.
కేంద్ర మంత్రులతో భేటీలు..
సీఎం కేసీఆర్ సోమవారం రాత్రికే ఢిల్లీ చేరుకున్నారు. ఇప్పటికే ఖరారైన షెడ్యూల్ ప్రకారం అక్కడ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కేసీఆర్ కలుసుకుంటారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచాలని, మిగులు రాష్ట్రం అయినందున మరింత రుణం తెచ్చుకునేందుకు వెసులుబాటు ఇవ్వాలని ఆర్థిక మంత్రికి మరోసారి విజ్ఞప్తి చేయనున్నారు. పరిమితి పెంపుపై ఇప్పటికే ప్రధానితో పాటు ఆర్థిక మంత్రికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. నీతి ఆయోగ్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లింది.
తాజాగా దీనిపై మరోసారి గుర్తుచేయనున్నారు. ఇక తెలంగాణకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద గ్రాంట్లు అందించాలని... ప్రభుత్వం అమలు చేస్తున్న వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ పథకాలకు ఆర్థిక సాయం అందించాలని కోరనున్నారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీని సీఎం కేసీఆర్ కలుసుకుంటారు. రాష్ట్రంలో ఇప్పటికే గుర్తించిన ఆరు రహదారులకు జాతీయ హోదా, అభివృద్ధిపై చర్చిస్తారు. తెలంగాణలో మొత్తం వెయ్యి కిలోమీటర్ల జాతీయ రహదారులకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా యాదగిరిగుట్ట నుంచి వరంగల్ వరకు ఆరు లేన్ల రహదారి పనులను ప్రారంభించేందుకు గడ్కరీ రావాల్సి ఉన్నా.. వరంగల్ ఉప ఎన్నికల కోడ్ కారణంగా పర్యటన రద్దయింది. ఈ నేపథ్యంలో గడ్కరీతో కేసీఆర్ భేటీ కానున్నారు.