ప్రత్యేక హోదా ఇవ్వండి | kcr seeks special status for telangana | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా ఇవ్వండి

Published Sun, Oct 12 2014 1:13 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ప్రత్యేక హోదా ఇవ్వండి - Sakshi

ప్రత్యేక హోదా ఇవ్వండి

సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌లో పన్నుల రూపేణా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయిందని.. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తున్నట్లుగానే తెలంగాణకు సైతం ఆర్థిక ప్రోత్సాహకాలను కేటాయించాలని కోరారు. తెలంగాణలోని ఎనిమిది జిల్లాలు ఆర్థికంగా వెనుకబడినవేనని ప్రణాళికా సంఘం సైతం తేల్చి చెప్పిందని జైట్లీకి వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి.. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఢిల్లీలో రెండు రోజులుగా పర్యటనలో ఉన్న కేసీఆర్ శనివారం మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. తొలుత అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఆర్థిక స్థితిగతులను కేసీఆర్ వివరించారు. అన్ని అంశాలను కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ సావధానంగా విన్నారని, తెలంగాణకు తగిన  న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉందని భేటీ అనంతరం టీఆర్‌ఎస్ ఎంపీలు బి.వినోద్, బాల్క సుమన్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి మీడియాకి వివరించారు.
 
 ‘తెలంగాణకు హైదరాబాద్ నగరం ఉంది కదా.. ఆంధ్రప్రదేశ్ తరహా ప్రత్యేకహోదా, పన్ను ప్రోత్సాహకాలు ఎందుక’ని జైట్లీ వేసిన ప్రశ్నకు కేసీఆర్ సవివరంగా సమాధానమిచ్చినట్టు వినోద్ తెలిపారు. ‘‘హైదరాబాద్ నగరంలో ఎక్కువ శాతం పన్నులు వసూలవుతున్నాయని ఒక అపవాదు వేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఐఓసీ, పీపీసీ, హెచ్‌పీసీ వంటి ఆయిల్ కంపెనీలు.. హైదరాబాద్‌లో కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నులు చెల్లిస్తున్నాయి. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడిగా ఉన్న సంస్థలన్నీ హైదరాబాద్‌లో పన్నులు చెల్లించేవి. ఇప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించి ఏపీలోనే పన్నులు చెల్లిస్తున్నాయి. కానీ హైదరాబాద్‌లోనే ఆదాయం ఎక్కువగా వస్తున్నట్లుగా ప్రచారం చేశారు’’ అని కేసీఆర్ వివరంగా జైట్లీకి తెలిపారని చెప్పారు. పన్నులు చెల్లించే ప్రజలు సైతం రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు 58 శాతం, తెలంగాణకు 42 శాతంగా ప్రజలు సైతం విడిపోయారని.. ఆ తరహాలోనే పన్నులు వసూలవుతాయని కూడా వివరించామన్నారు. కాబట్టి రెండు రాష్ట్రాలకూ ప్రత్యేక హోదాతో పాటు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరముందని పేర్కొన్నట్టు తెలిపారు.
 
 ఆదుకుంటామని హామీ ఇచ్చారు
 
 తాము చెప్పిన అన్ని అంశాలను జైట్లీ సావధానంగా విన్నారని, తగిన న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉందని వినోద్ పేర్కొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న సప్లిమెంటరీ బడ్జెట్‌లో తెలంగాణకు పలు మినహాయింపులు ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంటామని జైట్లీ హామీ ఇచ్చారని తెలిపారు. చమురు ధరలు తగ్గినందున కేంద్ర ప్రభుత్వానికి సబ్సిడీ మొత్తం తగ్గిందని.. అందులో కొన్ని నిధులను రాష్ట్రాలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారని వెల్లడించారు. హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నామని.. ఆర్మీకి అవసరం లేని రోజుల్లో బహిరంగ సభలు పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశామని కేంద్ర మంత్రి చెప్పారని వినోద్ తెలిపారు. ఈ నెల 19న నిర్వహించనున్న టీఆర్‌ఎస్ బహిరంగ సభకు సైతం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో అవకాశం దొరుకుతుందని హమీ ఇచ్చారన్నారు.
 
 కాంగ్రెస్, టీడీపీలే సమాధానమివ్వాలి? తట్టెడు బొగ్గు కూడా దొరకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరెంటు వస్తోంటే... లక్షల టన్నులు దొరుకుతున్న తెలంగాణలో కరెంటు కష్టాలు ఎందుకు న్నాయో కాంగ్రెస్, టీడీపీలే ప్రజలకు సమాధానం చెప్పాలని ఎంపీ వినోద్ పేర్కొన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 3 నెలల్లోనే 1,600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి సంబంధించి బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. ఇదేగాక మరో ఆరువేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయబోతున్నారని.. అలాంటి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బాబు విమర్శించడమేమిటని మండిపడ్డారు. కోటా మేరకు విద్యుత్ ఇవ్వాలని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా కూడా.. చంద్రబాబు తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయకుండా అడ్డుకున్నారని, తెలంగాణకు రావాల్సిన 500 మెగావాట్ల దిగువ సీలేరు విద్యుత్ కేంద్రాన్ని సైతం లాక్కున్నారని ఆరోపించారు.
 
 నవంబర్ నుంచి ప్లాంట్ పనులు
 
 తెలంగాణలో విద్యుత్ కొరత తీర్చడంలో భాగంగా కరీంనగర్ జిల్లా రామగుండంలో నిర్మించనున్న 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్‌కేంద్రం నిర్మాణ పనులను నవంబర్‌లో ప్రారంభించాలని ఎన్టీపీసీ నిర్ణ యం తీసుకుంది. ఎన్టీపీసీ చైర్మన్, ఎండీ అరూప్‌రాయ్ చౌదరి, ఈడీ ఐజే కపూర్ శనివారం సాయంత్రం ఢిల్లీలో కేసీఆర్‌తో భేటీ అయి.. రామగుండంలో 1,600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణంపై చర్చించారు. ఈ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని, సదుపాయాలు కల్పించేందుకు టీ సర్కార్  సిద్ధంగా ఉన్నట్టు కేసీఆర్ తెలిపారు. దీంతో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటే నవంబర్ చివరివారం లేదంటే డిసెంబర్ మొదటి వారం నుంచే పని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని అరూప్‌రాయ్ హామీ ఇచ్చారు. అదేవిధంగా సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేనందున అక్కడే స్థలం కేటాయిస్తే.. మరో 2,600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను నెలకొల్పుతామని అరూప్‌రాయ్ పేర్కొనగా... దీనికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. మొత్తంగా ప్రధాని మోడీ చేతుల మీదుగా త్వరలోనే 4 వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న విద్యుత్ ప్లాంట్లకు శంకుస్థాపన చేయిస్తామని సీఎం పేర్కొన్నారు. దక్షిణాది గ్రిడ్‌లో ఎన్టీపీసీ కోటా కింద ఉన్న విద్యుత్‌ను తెలంగాణకు సరఫరా చేయడానికి ఉన్న మార్గాలపైనా చర్చించారు. దీంతో కనీసం 250 మెగావాట్ల విద్యుత్‌ను తెలంగాణకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని అరూప్‌రాయ్ హమీ ఇచ్చారు. కాగా.. రామగుండంలో ఏర్పాటు చేయనున్న 1,600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌పై అధ్యయనం చేయడానికి ఎన్టీపీసీ ఉన్నతాధికారులు సోమ లేదా మంగళవారాల్లో రామగుండానికి రానున్నట్లు ఎంపీ వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement