‘ప్రత్యేక’ విన్నపం | kcr requests narendra modi for special status of telangana | Sakshi
Sakshi News home page

‘ప్రత్యేక’ విన్నపం

Published Sun, Sep 7 2014 12:54 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

‘ప్రత్యేక’ విన్నపం - Sakshi

‘ప్రత్యేక’ విన్నపం

‘ప్రత్యేక’ విన్నపం
 తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వండి
 సమగ్రాభివృద్ధికి సహకరించండి
 ప్రధానితో భేటీలో సీఎం కేసీఆర్ విజ్ఞప్తి


 సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సమగ్రాభివృద్ధికి కేంద్రం తరఫున అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. రాష్ర్టంలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి తోడ్పాటునందించాలని విన్నవించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం వంటి అంశాలను మోడీ దృష్టికి తెచ్చారు. తెలంగాణకు ప్రధాన సమస్యగా మారిన విద్యుత్ కొరతను తీర్చేందుకు వీలుగా 4 వేల మెగావాట్ల ఎన్‌టీపీసీ ప్లాంట్ ఏర్పాటు, బొగ్గు కేటాయింపులు సహా 20 అంశాలను ఈ సందర్భంగా ప్రధానికి కేసీఆర్ ఏకరువు పెట్టారు. వీటికి సంబంధించిన వివరాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నాడు రోజంతా బిజీబిజీగా గడిపారు. ఉదయం 11 గంటలకు పార్టీ ఎంపీలతో కలసి రేస్‌కోర్సు రోడ్డులోని ప్రధానమంత్రి అధికార నివాసానికి వెళ్లారు. దాదాపు 40 నిమిషాల పాటు నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. దేశంలోని అన్ని నగరాల మేయర్లు, ప్రపంచవ్యాప్తంగా 65 దేశాల నుంచి వచ్చే ప్రతినిధులతో అక్టోబర్ 7 నుంచి 9 వరకు హెదరాబాద్‌లో నిర్వహించనున్న ‘మెట్రోపొలిస్’ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ప్రధానిని ఈ సందర్భంగా కేసీఆర్ ఆహ్వానించారు.
 
 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కి రావాలని ప్రధానికి ఆహ్వానం పలకడం కూడా ఈ భేటీ ప్రధాన ఉద్దేశాల్లో ఒకటని... సమావేశం అనంతరం టీఆర్‌ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, బూర నర్సయ్యగౌడ్, విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాకు చెప్పారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి తెలియజేస్తామని ప్రధాని చెప్పినట్టు పేర్కొన్నారు. చాలా అంశాలపై మోడీ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీలు తెలిపారు. తెలంగాణలో స్మార్ట్ సిటీల ఏర్పాటుకు సంబంధించి రాష్ర్ట ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపించాలని కేసీఆర్‌ను ప్రధాని కోరినట్టు చెప్పారు. అలాగే ఉన్నతాధికారుల కొరత కారణంగా తెలంగాణలో పరిపాలన కుంటుపడుతున్నందున ప్రత్యూష్ సిన్హా కమిటీ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపులు త్వరగా చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. కొత్త రాష్ట్రంలో చిన్న చిన్న సమస్యలు తప్పవని, వాటిని పరిష్కరించేందుకు పెద్దన్నగా ముందుంటామని కేసీఆర్‌కు ప్రధాని భరోసా ఇచ్చినట్లు ఎంపీలు పేర్కొన్నారు. విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. తెలంగాణలో వర్షపాతం వివరాలు, కరువు పరిస్థితులను ప్రధాని అడిగి తెలుసుకున్నారని వివరించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు గవర్నర్‌కి అప్పగించే అంశం ప్రధాని వద్ద ప్రస్తావనకు వచ్చిందా అని విలేకరులు ప్రశ్నించగా.. అది ముగిసిన అధ్యాయమని ఎంపీలు వాఖ్యానించారు.


 రెండు రాష్ట్రాలు సామరస్యంగా మెలగాలన్న మోడీ
 
 ‘తెలుగు ప్రజలు ఘర్షణ పడొద్దు. సామరస్యంగా ఉండండి. తెలుగు వారు రెండు రాష్ట్రాలుగా అభివృద్ధి చెందాలి’ అని కేసీఆర్‌కు ప్రధాని మోడీ సూచించినట్లు సమాచారం. దీనికి కేసీఆర్ స్పందిస్తూ.. చాలా సమస్యలపై ఘర్షణ వాతావరణం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, గవర్నర్‌తో భేటీలో సైతం తానే చొరవ తీసుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడానని చెప్పినట్టు తెలిసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలపై ఇప్పటివరకు చిన్న దాడి కూడా జరగలేదని ప్రధానికి కేసీఆర్ వివరించారని, తమపై అనుమానాలు ఉంటే విచారణ చేసుకోవచ్చని కూడా కేసీఆర్ అన్నట్టు పార్టీ ఎంపీలు మీడియాకు పేర్కొన్నారు.
 
 రాష్ర్టపతి, కేంద్ర మంత్రులతోనూ చర్చలు
 
 అనంతరం కేసీఆర్ పార్టీ ఎంపీల బృందంతో కలసి రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులను ఆయనకు వివరించారు. దాదాపు అరగంటకుపైగా పలు అంశాలపై చర్చించారు. మెట్రోపొలిస్ సదస్సుకు రాష్ర్టపతిని కూడా ఆహ్వానించారు. ఇందుకు ప్రణబ్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్‌తో శ్రమశక్తి భవన్‌లో సమావేశమయ్యారు. ముందుగా కేసీఆర్, పీయూష్ గోయల్  పది నిమిషాల పాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. అనంతరం పార్టీ ఎంపీలతో కలసి చర్చలు జరిపారు.
 
 తెలంగాణలో విద్యుత్ కొరత, థర్మల్ ప్లాంట్ల ఏర్పాటు తదితర అంశాలను ప్రస్తావించారు. ఆ తర్వాత సమాచార్ భవన్‌లో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వీలైనంత త్వరగా వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేయాలని కేసీఆర్ కోరారు. దీంతో ఒకే భవనంలో రెండు హైకోర్టుల ఏర్పాటుకు అవసరమైన వసతులున్నాయా అని న్యాయ మంత్రి ఆరా తీసినట్టు తెలిసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన న్యాయమూర్తుల నియామక బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ను రవిశంకర్ ప్రసాద్ కోరారు. కాగా, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోనూ సమావేశం కావాల్సి ఉన్నా, ఆయన అందుబాటులో లేకపోవడంతో కేసీఆర్ కలవలేకపోయారు. ఆదివారం మరి కొందరు కేంద్ర మంత్రులను కలసి శాఖల వారీగా పలు ప్రతిపాదనలను సమర్పించనున్నారు. కేసీఆర్‌తోపాటు పార్టీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, కె కేశవరావు, వినోద్, బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్ శర్మ, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు రామచంద్రుడు, వేణుగోపాలచారి తదితరులు ఉన్నారు.

 

ప్రధాని దృష్టికి తెచ్చిన ప్రధానాంశాలు
 
 తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా
 సెక్షన్ 94(1) కింద తెలంగాణకు పన్ను ప్రోత్సాహకాలు
 కేంద్రం వద్ద ఉన్న దాదాపు రూ.6వేల కోట్ల కాంపా(సీఏఎంపీఏ) నిధుల విడుదల
 4 వేల మెగావాట్ల ఎన్‌టీపీసీ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, దానికి బొగ్గు కేటాయింపు
 రాష్ట్రానికి అదనంగా 500 మెగావాట్ల విద్యుత్ కేటాయింపు
 రాష్ర్టంలో వెయ్యి మెగావాట్ల సోలార్ పార్క్ ఏర్పాటు
 రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టు ఏర్పాటు
 తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు
 నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ)ని హైదరాబాద్‌లోనే కొనసాగించాలి
 ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు
 హైదరాబాద్-నాగ్‌పూర్, వరంగల్- హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు
 ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్ ఏర్పాటు
 మెదక్ జిల్లా జహీరాబాద్‌లో జాతీయ పెట్టుబడులు, తయారీ జోన్ ఏర్పాటు
 ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించడం
 తెలంగాణలో స్మార్ట్ సిటీల ఏర్పాటు
 రాష్ర్టంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడం. కాజీపేట్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు
 రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి తాగునీరు అందేలా వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు నిధుల కేటాయింపు
 రాష్ర్టంలో నాలుగు కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం. ఉత్తర తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి
 
 సమగ్ర సర్వేపై ప్రధాని ఆరా
 
 ప్రధానితో భేటీలో సమగ్ర సర్వే అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం. ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాలు సక్రమంగా లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రమంతటా సమగ్ర సర్వే నిర్వహించినట్టు మోడీకి కేసీఆర్ వివరించారు. రాష్ర్టంలోని కుటుంబాల సంఖ్యకన్నా రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నాయని సర్వేలో తేలినట్లు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాలు అసలైన లబ్ధిదారులకు అందేలా సమగ్ర సర్వే ఉపయోగపడుతుందని సీఎం వివరించారు. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి సర్వే చేయిస్తే మంచిదని కేసీఆర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి ప్రధాని స్పందిస్తూ.. సమగ్ర సర్వేకి సంబంధించి ఓ నివేదికను పంపిస్తే, దానిపై దృష్టిపెడతామని అన్నట్టు ఈ భేటీలో పాల్గొన్న టీఆర్‌ఎస్ ఎంపీలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement