
మూడో కూటమంతా గందరగోళమే
టీడీపీ మేధోమథన సదస్సుల్లో చంద్రబాబు
పజలు మోడీవైపు ఆకర్షితులవుతున్నారు
టీడీపీ నేతలు మోడీని అనుకరించాలి
‘జై సమైక్యాంధ్ర’ నినాదాలు చేసిన నన్నపనేని
హరికృష్ణకు అందని ఆహ్వానం, గైర్హాజరు
కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా జాతీయస్థాయిలో ఏర్పాటు చేయాలనుకుంటున్న తృతీయ కూటమి గందరగోళంలో ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. మూడో కూటమి భాగస్వామ్యపక్షాల్లో పలు అంశాలపై స్పష్టత లేదని, వారు చివరివరకూ కలిసి ఉంటారనే నమ్మకం కూడా లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని టీడీపీ నేతలు అనుకరించాలని ఉద్బోధించారు. ఎన్‌టీఆర్ భవన్‌లో శుక్రవారం ఆయన సీమాంధ్ర పరిధిలోని పార్లమెంటరీ నియోజకవర్గాల నేతల మేధోమథన సదస్సులో పలుమార్లు ప్రసంగిం చారు. విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గరివి రెడ్డి రామానాయుడు మాట్లాడుతూ... ఇటీవలి కాలం లో పార్టీపరంగా ఎదుటిపక్షం వారిపై విమర్శలు ఎక్కువయ్యాయని, వాటిని తగ్గించి మనం చేసిన పనులు చెప్పుకుంటూపోతే సరిపోతుందని సూటిగా చెప్పారు. దానిపై చంద్రబాబు స్పందిస్తూ జాతీయ రాజకీయాలతోపాటు పలు అంశాలపై మాట్లాడారు.
దేశవ్యాప్తంగా ప్రజలు మోడీ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. గతంలో తెలంగాణకు అనుకూలంగా ఉన్న బీజేపీ ఇపుడు సమన్యాయం చేశాక విభజన విషయం లో ముందుకెళ్లాలని చెప్పటం మంచి పరిణామమన్నారు. 2008లో తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి ఇచ్చిన లేఖలోనే తాము సమన్యాయం అంశాన్ని ప్రస్తావించామని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాజీనామా చేసిన ఎంపీ హరికృష్ణను సదస్సుకు ఆహ్వానించలేదని సమాచారం. దీంతో ఆయన సదస్సుకు హాజరు కాలేదు. సినీ నటుడు ఏవీఎస్ మృతికి హరికృష్ణ సంతాపం ప్రకటించారు.
సదస్సుల్లో ‘జై సమైక్యాంధ్ర’ నినాదాలు
సీమాంధ్ర ప్రాంత మేధోమథన సదస్సుల్లో ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ‘జై సమైక్యాంధ్ర’ నినాదాలు చేశారు. సమావేశ మందిరంలోకి వచ్చిన వెంటనే ఆమె ‘జై సమైక్యాంధ్ర’ అంటూ అందర్నీ పలకరించారు. ఇకనుంచి పార్టీ నేతలు ఎవరు కనిపించినా ఇలానే పలకరించుకోవాలని సూచించారు. కొద్దిసేపటికి సమావేశమందిరంలోకి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రవేశించగానే అందరూ ‘జై సమైక్యాంధ్ర’ అని నినదించారు. అయితే చంద్రబాబు ఎలాంటి స్పందన వ్యక్తం చేయకుండా తన సీటులో ఆశీనులయ్యారు.