మూడో కూటమికి ముందడుగు ! | Third Front traces at anti-communalism meet | Sakshi
Sakshi News home page

మూడో కూటమికి ముందడుగు !

Published Thu, Oct 31 2013 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM

Third Front traces at anti-communalism meet

ఫాసిజానికి వ్యతిరేకంగా లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు ఏకమవ్వాలి
   ‘మతతత్వ వ్యతిరేక’ సదస్సులో కీలక ప్రాంతీయ పార్టీల పిలుపు

 

న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో మూడో కూటమిని ఏర్పాటు చేసే దిశగా.. వామపక్షాలతో కలిసి బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలు తొలి అడుగువేశాయి. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం పేరుతో లెఫ్ట్ పార్టీలతో పాటు జనతాదళ్ (యునెటైడ్), సమాజ్‌వాదీ పార్టీ, అన్నా డీఎంకే, బిజూ జనతాదళ్, జనతాదళ్ (సెక్యులర్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, అసోం గణ పరిషత్, జార్ఖండ్ వికాస్‌మోర్చా తదితర ప్రాంతీయ పార్టీలు సదస్సుకు హాజరయ్యాయి. వామపక్ష పార్టీలు బుధవారం ఢిల్లీలో నిర్వహించిన ‘మతతత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఐక్యత’ సదస్సులో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఎస్‌పీ అధినేత ములాయంసింగ్‌యాదవ్, మాజీ ప్రధాని దేవెగౌడలతో సహా 14 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.
 
  తమిళనాడు సీఎం జయలలిత, ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌లు.. మతతత్వంపై పోరాటంలో లౌకికశక్తులకు మద్దతు ప్రకటిస్తూ సందేశాలు పంపించారు. ఈ సదస్సుకు తెలుగుదేశం పార్టీని ఆహ్వానించినప్పటికీ.. ఆ పార్టీ స్పందించలేదు. తృణమూల్ కాంగ్రెస్, బీఎస్‌పీలు కూడా హాజరుకాలేదు. పశ్చిమబెంగాల్‌లో తన ప్రత్యర్థులైన వామపక్షాలు నిర్వహించిన సదస్సు కావటం వల్ల తృణమూల్, యూపీలో తన ప్రత్యర్థి అయిన ఎస్‌పీ సదస్సుకు హాజరుకావటం వల్ల బీఎస్‌పీ దూరంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ సదస్సులో మాట్లాడిన ఆయా నేతలు మూడో కూటమి ప్రయత్నాలు అనే వాదనను తోసిపుచ్చినప్పటికీ.. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు కానీ, ఎన్నికల తర్వాత కానీ బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ఉమ్మడి వేదికను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
 
 బీజేపీ ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ సీఎం నరేంద్రమోడీని ముందుకు తెచ్చిన క్రమంలో ఆ పార్టీతో 17 ఏళ్ల స్నేహ బంధాన్ని ఇటీవలే తెగదెంపులు చేసుకున్న నితీశ్‌కుమార్.. మూడో కూటమి అంశాన్ని తాజా సదస్సులో స్వయంగా లేవనెత్తారు. ‘కొత్త కూటమిని ఏర్పాటు చేస్తున్నారా? అని మమ్మల్ని అడుగుతున్నారు. ఈ రోజువరకూ అయితే అదేం లేదు. కానీ.. మనం ఆలోచించాల్సి ఉంది. మతతత్వానికి, ఉగ్రవాదానికి, ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తులు ఐక్యం కావాల్సిన అవసరముంది’ అని ఆయన పేర్కొన్నారు.
 
 మతతత్వ శక్తులు దేశంలో మతం పేరుతో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని నితీశ్ పరోక్షంగా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలపై ధ్వజమెత్తారు. యూపీఏ సర్కారులో భాగస్వామిగా ఉన్న ఎన్‌సీపీ ప్రతినిధిగా సదస్సుకు హాజరైన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రఫుల్‌పటేల్.. ఇది సంకీర్ణ రాజకీయాల శకమని.. ఇతర పార్టీలతో కలిసి పనిచేయటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాల్సిన అవసరముందని పేర్కొన్నారు. సీపీఎం సీనియర్ నాయకుడు సీతారాం ఏచూరి క్రికెట్ పరిభాషలో మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం మూడో కూటమి ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు ఇచ్చారు. ‘మూడో కూటమి అనేదేమీ లేదు కానీ ఇది భారత రాజకీయాల్లో ‘దూస్రా’. మీకు క్రికెట్ తెలిస్తే.. అందులో ‘దూస్రా’ అనే పద్ధతిలో బౌలింగ్ ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. ‘ఇది ఆరంభం... రాబోయే రోజుల్లో మీరు ఇంకా చాలా చూస్తారు’ అని ఎస్‌పీ నేత రామ్‌గోపాల్‌యాదవ్ పేర్కొన్నారు.
 
 లౌకిక జాతీయవాదులే ఉంటారు...
 హిందుత్వ సంస్థలు మతపరమైన అంశాలను లేవనెత్తుతున్నాయని.. తత్ఫలితంగా దేశంలో మత ఘర్షణలు తలెత్తుతున్నాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్ పేర్కొన్నారు. తాను హిందూ జాతీయవాదినన్న నరేంద్రమోడీ ప్రకటనను పరోక్షంగా ఖండిస్తూ.. దేశంలో కేవలం లౌకిక జాతీయవాది ఉండటానికి మాత్రమే అవకాశం ఉందని.. మరి దేనినీ తాము అంగీకరించబోమని స్పష్టంచేశారు. ఉత్తరప్రదేశ్‌లో తన పార్టీ ఒక్కటే 1980 నుంచీ మతతత్వంపై పోరాడుతోందని, అందులో వామపక్షాలు మద్దతిస్తున్నాయని ములాయం పేర్కొన్నారు. లౌకిక శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. మైనారిటీలను రక్షించటానికి తామంతా ఏకం కావాల్సిన అవసరముందని మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ పేర్కొన్నారు. తాము విడివిడిగా ఉన్నప్పటికీ మతతత్వంపై ఉమ్మడిగా పోరడతామని జేడీ(యూ) నేత శరద్‌యాదవ్ చెప్పారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్, ఎన్‌సీపీ నేత డి.పి.త్రిపాఠి, అన్నాడీఎంకే నేత తంబిదురై, సీపీఐ నేత ఎ.బి.బర్ధన్ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
 
 నితీశ్.. కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారు: బీజేపీ
 మూడో కూటమి అనేది ఊహాజనితమేనని బీజేపీ వ్యాఖ్యానించింది. వామపక్షాల సదస్సుకు హాజరైన నితీశ్‌కుమార్ వాస్తవానికి కాంగ్రెస్‌కు దగ్గరగా జరుగుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత రవిశంకర్‌ప్రసాద్ పేర్కొన్నారు. మూడో కూటమి అనేది చరిత్రని, దానికి ఇప్పుడు ఉనికి లేదన్నారు.
 
 బీజేపీని విమర్శించే పార్టీలు చాలాఉన్నాయి: కాంగ్రెస్
 వామపక్షాల సదస్సులో చాలా పార్టీలు మతత్వానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తంచేయటం ద్వారా.. బీజేపీని, నరేంద్రమోడీని విమర్శించే పార్టీ కాంగ్రెస్ ఒక్కటే కాదని ప్రజలకు తెలుస్తుందని కాంగ్రెస్ అధికారప్రతినిధి రాజ్‌బబ్బర్ పేర్కొన్నారు. ఆ సదస్సుకు యూపీఏ భాగస్వామ్యపక్షమైన ఎన్‌సీపీ హాజరుకావటాన్ని ఆయన తేలికగా కొట్టివేశారు. సదస్సులో మూడో కూటమి అనే మాట ఎవరూ మాట్లాడలేదని ఒక ప్రశ్నకు బబ్బర్ బదులిచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మూడో కూటమి ఏర్పాటు చేయాలని వామపక్షాలు చేస్తున్న యత్నాలను తృణమూల్ ఎద్దేవా చేసింది. సీపీఎం ఎక్కడుంటే అక్కడ మొత్తం నాశనం చేస్తుందని దుయ్యబట్టింది.
 
 ‘ఏవైపో టీడీపీనే తేల్చుకోవాలి’
 
 సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులన్నింటినీ కూడగట్టడానికి, ఏకతాటిపైకి తీసుకురావడానికి తమ వంతు కృషి సాగిస్తామని సీపీఎం సీనియర్ నాయకుడు సీతారాం ఏచూరి పేర్కొన్నారు. గతంలో మూడో కూటమిలో పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మతతత్వం, లౌకికవాదంలో ఏవైపు ఉండాలో తేల్చుకోవాలని సూచించారు. మతతత్వ వ్యతిరేక సదస్సులో పాల్గొన్న తర్వాత ఏచూరి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత సదస్సుకు టీడీపీ గైర్హాజరు కావడంపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. సదస్సులో పాల్గొనాల్సిందిగా టీడీపీని తాము మొదట్లోనే కోరామని, అయితే పార్టీలో చర్చించుకుని తమ స్పందన తెలియజేస్తామన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఏ సంగతీ చెప్పలేదన్నారు. మతతత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఐక్యత పేరుతో సదస్సు నిర్వహించింది ‘కాంగ్రెస్ బి’ టీం వారని బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు విమర్శించారు.
 కాంగ్రెస్ పార్టీ మతాలపేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement