సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అయితే అనుకోకుండా అదృష్టం కొద్ది కె.చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారని, ఈ విషయాన్ని కేసీఆర్ మర్చిపోవద్దని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. అనుకోని పరిస్థితుల్లో కేసీఆర్ యాక్సిడెంటల్ సీఎం అయ్యారని, ఆయన అబద్దాలను నమ్మి తెలంగాణ ప్రజలు ఓట్లు వేశారన్నారు. మాయమాటలు చెప్పి అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీర్ మరోసారి తన అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని పొన్నాల సోమవారమిక్కడ విమర్శించారు. అయితే ఈసారి కేసీఆర్ మాటలను వినడానికి ప్రజలు సిద్ధంగా లేరనే విషయం తేలుసుకుంటే మంచిదని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందని కేసీఆర్ అంటున్నారని, ఈ రోజు ఆయన తెలంగాణ సీఎం అయ్యారంటే అది కాంగ్రెస్ చలవతోనే అని, ఆ విషయం మర్చిపోయి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు.
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయాత్నాల గురించి పొన్నాల మాట్లాడుతూ ‘అబద్దాలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. అది చాలదన్నట్లు ఇప్పుడు దేశం మీద పడ్డారు. కేసీఆర్ బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోదీకి కోవర్టు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. కానీ ఆయన ఫెడరల్ ఫ్రంట్‌కు ఆదిలోనే పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. నిన్న డీఎంకే నేత స్టాలిన్ ఫెడరల్ ఫ్రంట్ సాధ్యం కాదని కేసీఆర్ మొహం మీదనే కాదని తేల్చేశారు. కాంగ్రసేతర ప్రత్యామ్నాయం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని తేల్చి చెప్పిన స్టాలిన్, కావేరి సమస్య పై బీజేపీ ప్రభుత్వం తాత్సారం చేస్తుండగా జేడీఎస్‌కు ( బీజేపీ , జేడీఎస్‌ల అవగాహన నేపధ్యంలో ) మద్దతు పలుకుతున్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ విషయంలో మా మద్దతు ఎలా ఆశిస్తారు అని ప్రశ్నించారు. దీనిక కేసీఆర్ ఏం బదులిస్తారు’ అన్నారు.
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి కేసీఆర్ ...మమత బెనర్జీని కలిస్తే కాంగ్రెస్ లేకుండా బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయాలు ఎలా సాధ్యం అన్నారు. కేసీఆర్ హేమంత్ సొరేన్ ను కలిసిన మరుసటి రోజే ఆయన సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఇక నవీన్ పట్నాయక్ అయితే, ‘కేసీఆర్‌నును నేను ఆహ్వానించలేదు ఆయన వస్తా అంటే రమ్మన్నాను. రాజకీయాలు ఏమి లేవు’ అని కొట్టి పారేశారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి మరో అడుగు ముందుకేసి ‘కేసీఆర్ మూడో ఫ్రంట్ మూసి లాంటిది, కంపు కొడుతుంది’ అని మరింత ఘాటుగానే విమర్శించారు అని పొన్నాల ఈ సందర్భంగా గుర్తు చేశారు. మూడో ఫ్రంట్‌ను అడ్డం పెట్టుకొని తన పార్టీలోని అంతర్గత రాజకీయాలను అధిగమించాలని కేసీర్ అడుగులు వేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment