సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న కూటమిని థర్డ్ ఫ్రంట్ అనాల్సిన అవసరం లేదని, దాన్నే ఫస్ట్ ఫ్రంట్ అనొచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను అందించలేని కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబించేలా మరో కూటమి రావాల్సిన అవసరం ఉందని గుర్తించి ఆ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా చర్చకు శ్రీకారం చుట్టారన్నారు. ముందుముందు ఈ ఫ్రంట్ ఎలా ఏర్పాటవుతుందన్నది వేచిచూడాల్సి ఉందని, దీనిపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శనివారం ఢిల్లీలో ప్రారంభమైన 51వ స్కోచ్ సమ్మిట్‌లో పాల్గొన్న అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ప్రజాకాంక్షలు నెరవేర్చడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలం...
వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లు పూర్తి మెజారిటీ సాధించే పరిస్థితులు లేని నేపథ్యంలో బలమైన ప్రాంతీయ పార్టీలు తమ హవా కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. దేశానికి స్వాత్రంత్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు ఎన్నో అవకాశాలు ఇచ్చారని, అయితే ఆ రెండు పార్టీలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.
దేశంలో ఒకవైపు విద్యుత్ మిగులు ఉందని చెబుతూనే మరోవైపు ఎన్నో గ్రామాలకు విద్యుత్ సదుపాయం లేదన్నారు. దేశవ్యాప్తంగా వివిధ నదుల్లో 75 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నా వ్యవసాయానికి నీరందే పరిస్థితి లేదన్నారు. బహుముఖ పార్టీ వ్యవస్థ ఉన్న భారత్‌లో కేవలం రెండు పార్టీల మధ్యే ఎన్నికలను పోటీగా భావించడం సరికాదన్నారు. గత 70 ఏళ్లలో కాంగ్రెస్, బీజేపీలు కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రాలపై చేసిన పెత్తనంపై విస్తృత చర్చ జరగాలన్నారు.
కేంద్రం గత నాలుగేళ్లలో తెలంగాణకు ఇచ్చిన రూ. 81 వేల కోట్లు కూడా కేంద్ర వాటా కింద ఇచ్చినదేనని, ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదన్నారు. కనీసం విభజన చట్టంలోని హామీలను సైతం కేంద్రం అమలు చేయలేకపోయిందని విమర్శించారు. దీనిపై ప్రధాని, కేంద్ర మంత్రులను ఎన్నిసార్లు కలసి విన్నవించినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం పురోగతి సాధిస్తుందన్న విషయాన్ని పట్టించుకోకుండా కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
ఎన్డీయేలో మిగిలేది బీజేపీయే...
ఎన్డీయే కూటమి నుంచి మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా బయటకు వెళ్లిపోతున్న నేపథ్యంలో ఆ కూటమిలో చివరకు మిగిలేది ఒక్క బీజేపీయేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రాలపై పెత్తనం చెలాయించాలని చూస్తున్న కేంద్రం వైఖరికి నిరసనగా ఎన్డీయే నుంచి ఇప్పటికే శివసేన వైదొలగిందని, హామీలు అమలు చేయలేదని టీడీపీ కూడా కేంద్ర మంత్రులను ఉపసంహరించుకుందన్నారు. ఇక ఎన్డీయేలో ఏమాత్రం ప్రభావం చూపలేని అకాలిదళ్ లాంటి పార్టీలు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రత్యామ్నాయ కూటమి అవసరం ఎంతైన ఉందని గ్రహించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో ముందుకు సాగుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
మూడు ‘ఐ’లు... అభివృద్ధి మంత్రాలు..
రాష్ట్రాల పటిష్టతపై ఆధారపడ్డ దేశాభివృద్ధికి మూడు ‘ఐ’లు ఎంతో ప్రాధాన్యం కలిగి ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. స్కోచ్ 51వ సమ్మిట్‌లో ఆయన ప్రసంగిస్తూ.. ఇన్‌క్లూజివ్ గ్రోత్ (సమ్మిళిత వృద్ధి), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ (మౌలిక సదుపాయాల అభివృద్ధి), ఇన్నోవేషన్ (సృజనాత్మక ఆవిష్కరణ) అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇదే మంత్రాన్ని అనుసరించి అన్ని రంగాల్లో వృద్ధి సాధిస్తోందన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, రైతులకు వ్యవసాయ పెట్టుబడి, ఉచితంగా చేప పిల్లల పంపిణీ, మెరుగైన పారిశ్రామిక విధానంతో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతుల మంజూరులో పారదర్శకత, డబుల్ బెడ్రూం ఇళ్ల వంటి వినూత్న పథకాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ చేరేలా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాలన అందిస్తున్నారని కేటీఆర్ చెప్పారు.
సాఫ్రిన్ ఏరోస్పేస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ
స్కోచ్ సమ్మిట్‌లో భాగంగా భారత్, ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన భాగస్వామ్య ఒప్పందాల సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. విమానాల్లో ఎలక్ట్రికల్ పరికరాలు తయారీ చేసే సాఫ్రిన్ ఏరోస్పేస్ సంస్థతో ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.
కేంద్ర మంత్రులు సురేశ్ ప్రభు, ఆర్.కె. సింగ్, మంత్రి కేటీఆర్ సమక్షంలో సాఫ్రిన్ సంస్థ సీఈవో, ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సాఫ్రిన్ సంస్థ ఇక నుంచి హైదరాబాద్ వేదికగా తన ఉత్పత్తులను ప్రారంభించనుంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని పారిశ్రామిక ప్రాంతంలో సాఫ్రిన్ సంస్థ పరిశ్రమ ఏర్పాటు చేయనుందని మంత్రి కేటీఆర్ మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment