సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశం కేవలం రెండు పార్టీల (కాంగ్రెస్, బీజేపీ) రాజకీయ వ్యవస్థగా ఉండకూడదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు విఫలమయ్యాయని విమర్శించారు. థర్డ్ ఫ్రంట్, ఎన్డీఏ కూటమిపై కేటీఆర్ మీడియాతో శనివారం మాట్లాడారు. మాది థర్డ్ ఫ్రంట్ కాదు.. ఫస్ట్ ఫ్రంట్. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నుంచి చాలా పార్టీలు బయటికెళ్తున్నాయని గుర్తు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, శివసేన వెళ్లిపోయిన తర్వాత కేవలం బలహీన అకాలీదళ్ మాత్రమే ఎన్డీఏలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తోందన్నారు. ఇప్పటికైనా ఎన్డీఏ ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు పూర్తి మెజార్టీ సాధించే పరిస్థితి కనిపించడం లేదన్నారు. భారతదేశం కేవలం రెండు పార్టీల వ్యవస్థ కాదని.. రెండు పార్టీల మధ్య పోరాటంగా ఉండకూడదని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు మరింత బలోపేతం కావాలని కేటీఆర్ ఆక్షాంక్షించారు. కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని నేపథ్యంలో ఏర్పడే కూటమిని థర్డ్ ఫ్రంట్ అని ఎందుకంటారు.. ఫస్ట్ ఫ్రంట్ అని అనొచ్చు కదా సూచించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయని విమర్శించారు. కేంద్రం నుంచి తెలంగాణకు అదనంగా ఒక్క రూపాయి కూడా రాలేదని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment