
మూడో కూటమి కోసం ముమ్మరంగా!
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో.. మూడో ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఎన్నికల తరువాత కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదన్న అంచనాల నేపథ్యంలో.. గతంలో యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాల్లో మిత్రపక్షాలుగా వ్యవహరించిన పలు ప్రాంతీయ పార్టీలు తృతీయ కూటమిగా కేంద్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా సంప్రదింపులు ఊపందుకున్నాయి. వాటిలో వామపక్షాలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. అందులో భాగంగానే పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న ఈ నెల 5న దాదాపు 11 పార్టీల నాయకులు సమావేశం కానున్నారని జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ వెల్లడించారు.
అందులో సమాజ్‌వాదీ పార్టీ, జేడీయూ, జేడీఎస్, ఏఐఏడీఎంకే, బీజేడీ, ఏజీపీ, జేవీఎం సహా పలు పార్టీలు పాల్గొంటాయన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ కన్నా తమ కూటమి పెద్దదన్న విషయం ప్రజలకు తెలిసేలా సరికొత్త ప్రతిపక్షంలా రానున్న పార్లమెంటు సమావేశాల్లో వ్యవహరిస్తామని శరద్‌యాదవ్ ఇప్పటికే ప్రకటించారు. అలాగే, ‘జనతా పరివార్’లో భాగమైన పలు పార్టీలు ఈ ఆదివారం భేటీ కానున్నాయి.
అందులో నవీన్ పట్నాయక్, దేవేగౌడ, ఓం ప్రకాశ్ చౌతాలా, ములాయం సింగ్ యాదవ్‌లు పాల్గొననున్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించాలనుకుంటున్న వామపక్షాలు కూడా పలు ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చుకుంటూ ముందుకువెళ్తున్నాయి. సీపీఐ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్‌తో శరద్‌యాదవ్ ఇప్పటికే సమావేశం కాగా, సీపీఎం సీతారాం యేచూరితో త్వరలో భేటీ కానున్నారు. జయలలిత పార్టీ ఏఐఏడీఎంకేతో ఇప్పటికే పొత్తు పెట్టుకున్న సీపీఐ.. మరిన్ని ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు చర్చలు కొనసాగిస్తోంది. ఎన్నికల తరువాత ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయపార్టీలదే కీలక పాత్ర అని సీపీఎం నేత బృందాకారత్ అన్నారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలుచుకుని ఈసారి కేంద్రంలో చక్రం తిప్పాలని ఎస్పీ చీఫ్ ములాయంసింగ్ ఆశిస్తున్నారు. ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు మెజారిటీ సాధించలేవని, థర్డ్‌ఫ్రంట్‌దే ఈసారి విజయమని, అందులో ఎస్పీనే అతిపెద్ద పార్టీ అవుతుందని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు.