
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచన జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించారు. దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సి ఉందన్న కేసీఆర్ వాదనకు మద్దతు పలికారు. ‘హమ్ ఆప్ సే ఏక్ మత్ హై. ఆప్ కే సాత్ రహేంగే’(మేమే మీతో ఏకీభవిస్తున్నాం. మీతో కలసి ఉంటాం) అని మాటిచ్చారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా కేసీఆర్‌కు ఫోన్ చేసి మద్దతు ప్రకటించారు.
జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలన్న కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు ఎంపీలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ పార్టీల ప్రతినిధులు సీఎంకు ఫోన్ చేసి మద్దతు ప్రకటించారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సీఎం నిర్ణయాన్ని స్వాగతించారు. మూడో ఫ్రంట్ ఏర్పాటు చేస్తే కేసీఆర్‌కు మద్దతిస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. మరోవైపు ఆదివారం ఉదయాన్నే రాష్ట్రం నలుమూలల నుంచి టీఆర్‌ఎస్ నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ప్రగతి భవన్ చేరుకున్నారు.
టీఆర్‌ఎస్‌కు చెందిన ముఖ్య నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రగతిభవన్‌లో సందడి నెలకొంది. దేశ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీల పాత్ర పోషించాలంటూ వారంతా నిన దించారు. నాయకులు, పార్టీ శ్రేణులు.. ‘దేశ్ కా నేతా కేసీఆర్’అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. వివిధ ఆలయాల పండితులు, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, వివిధ మసీదుల మత గురువులు, ముస్లిం సంస్థల ప్రతినిధులు, పలు చర్చిల ఫాదర్లు, క్రైస్తవ మత పెద్దలు, సిక్కు మత గురువులు వచ్చి సీఎంను ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment