ఫ్రంట్‌ వెనుక ఏముంది? | Will Third Front Make the Central Government in 2019? | Sakshi
Sakshi News home page

ఫ్రంట్‌ వెనుక ఏముంది?

Published Sun, Apr 1 2018 12:16 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

Will Third Front Make the Central Government in 2019? - Sakshi

సీఎం చంద్రశేఖర్‌ రావు, సీఎం మమతా బెనర్జీ

త్రికాలమ్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) తలపెట్టిన మూడవ (ఫెడరల్‌) ఫ్రంట్‌ నిర్మాణం సాధ్యమేనా? అటువంటి ఫ్రంట్‌ లోక్‌సభలో మెజారిటీ స్థానాలు గెలుచుకొని స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నదా? పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో మూడు రోజులు మకాం పెట్టి శరద్‌ పవార్‌ సహా ముఖ్యులైన ప్రతిపక్ష నాయకులందరితోనూ సమాలోచనలు జరిపారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీని కూడా కలుసుకున్నారు. సోనియాతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనీ, తరచూ మాట్లాడుకుంటూ ఉంటామనీ స్పష్టం చేశారు. 

ప్రాంతీయ పార్టీలు ఒక ఫ్రంట్‌ ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉన్నదని అంటూనే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌లో కాంగ్రెస్‌ కూడా ఉంటుందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌లతో సంబం  ధం లేకుండా మూడో ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్‌ ఆలోచనకు ఇది భిన్నమైనది. తన ప్రతిపాదనను ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నంలో కేసీఆర్‌ మొట్టమొదట సమాలోచన జరిపింది మమతా బెనర్జీతోనే. ప్రత్యేక విమానంలో కోల్‌కతా వెళ్ళి ఆమెతో సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీ వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్‌ ఉండటం అనివార్యమని చెప్పడం కేసీఆర్‌ దౌత్యానికి ప్రతికూలం. అయినప్పటికీ కేసీఆర్‌ వచ్చే వారం ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారు. 

మమత వ్యూహం
మమత చెప్పిన మతలబు ప్రకారం ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీనే ప్రధానంగా పోటీలో ఉండాలి. ఇతర ప్రతిపక్షాలు సదరు ప్రధాన పార్టీకి సహకరించాలి. వివిధ రాష్ట్రాలలో పరిస్థితులను గమనించినట్లయితే ఈ వ్యవహారం మమతా బెనర్జీ ఊహిస్తున్నంత సరళమైనది కాదని అర్థం అవుతుంది. రెండు ప్రాంతీయ పార్టీలు సమ ఉజ్జీలుగా ఉన్న రాష్ట్రాలు–తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ముఖాముఖీ తలపడే రాష్ట్రాలు–రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్‌. బీజేపీతో ఒకటి లేదా రెండు ప్రాంతీయ పార్టీలు తలపడుతున్న రాష్ట్రాలు–ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశా, ఢిల్లీ. కాంగ్రెస్‌ని ప్రధాన ప్రతిపక్షంగా టీఆర్‌ఎస్‌ పరిగణిస్తున్న రాష్ట్రం తెలంగాణ. 

మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్, గోవా, అసోం, కర్ణాటక, జమ్మూ–కశ్మీర్, పంజాబ్‌లలో బీజేపీ, కాంగ్రెస్‌లతోపాటు ఒకటి లేదా రెండు ప్రాంతీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీల ప్రమేయం లేకుండా కేవలం మూడో ఫ్రంట్‌కు చెందిన పక్షాలు మాత్రమే మెజారిటీ లోక్‌సభ స్థానాలు గెలుచుకునే పరిస్థితి లేదు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ), బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) కలిసి పోటీ చేసి ఒక పార్టీ ఓట్లు మరో పార్టీకి సవ్యంగా బదిలీ అయితే ఉత్తరప్రదేశ్‌లో సగానికి పైగా లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటాయి. బిహార్‌లో బీజేపీ, జేడీ(యు) కలిసి పోటీ చేసినా ఆర్‌జేడీ మెజారిటీ స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. 

తమిళనాడులో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా అత్యధిక స్థానాలు డీఎంకేకి లభిస్తాయి. ఏఐడీఎంకే, కమల్‌ హాసన్‌ పెట్టిన కొత్త పార్టీ, రజనీకాంత్‌ పెడతారో లేదో తెలియని పార్టీ, ఇప్పటికే ఉన్న చిన్నాచితకా పార్టీలు డీఎంకే జైత్రయాత్రని నిలువరించలేవన్నది విశ్లేషకుల అభిప్రాయం. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌కి తిరుగులేదు, తెలంగాణలో కాంగ్రెస్‌ బలం పుంజుకోకపోతే టీఆర్‌ఎస్‌ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుంది. తెలంగాణలో పోటీ ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీ నడుమే. బీజేపీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు లేదు. ప్రొఫెసర్‌ కోదండరాం పార్టీ నెలకొల్పినా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారు. టీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓట్లు చీల్చరు. ఆంధ్రప్రదేశ్‌లో బలమైన పార్టీ టీడీపీ అని మమతా బెనర్జీ మాటల సందర్భంలో అన్నారు. 

ఆమెకు క్షేత్రవాస్తవికత తెలి యదు. వచ్చే ఎన్నికలలో టీడీపీకి ఎక్కువ లోక్‌సభ స్థానాలు లభిస్తాయని టీడీపీ సమర్థకులు సైతం చెప్పలేరు. అక్కడ జాతీయ పార్టీలు రెండూ బలంగా లేవు. వైఎస్సార్‌సీపీ ప్రాబల్యం నానాటికీ పెరుగుతున్నది. అధికారంలో ఉన్న కారణంగా టీడీపీ పట్ల ప్రతికూలత ఉన్నది. జనసేన నిర్మాణ దశలోనే ఉంది. ఒడిశాలో బీజేపీ ఎంత ప్రయత్నించినా బిజూ జనతాదళ్‌పైన ఆధిక్యం సాధించలేకపోవచ్చు. అంటే ప్రాంతీయ పార్టీలు అధిక స్థానాలు గెలిచే అవకాశం ఉన్న ఈ రాష్ట్రాలలో–యూపీ (80), బిహార్‌ (40), తమిళనాడు (39), పశ్చిమబెంగాల్‌ (42), ఆంధ్రప్రదేశ్‌ (25), తెలంగాణ (17), ఒడిశా (21)– మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య 264. ఈ స్థానాలలో సగానికి పైగా ప్రాంతీయ పార్టీలకు లభించినా కాంగ్రెస్‌ లేదా బీజేపీ మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యం. 

ఇవి కాకుండా మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్‌ కాంగ్రెస్, జమ్మూకశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్, పీపుల్స్‌ డెమొక్రాటిక్‌ పార్టీ, జార్ఖండ్‌లో జార్ఖండ్‌ ముక్తి మోర్చా, కర్ణాటకలో జేడీ(ఎస్‌), ఢిల్లీలో ఆప్, పంజాబ్‌లో అకాలీదళ్, ఈశాన్య రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాలలో కొన్ని స్థానాలు ప్రాంతీయ పార్టీలకు రావచ్చు. అన్నీ కలిపితే ప్రాంతీయ పార్టీల ఫ్రంట్‌కు 150 స్థానాలు లభించడం గగనం. బీజేపీ, కాంగ్రెస్‌ నేరుగా తలబడే రాష్ట్రాలలో–మధ్యప్రదేశ్‌ (28), ఛత్తీస్‌గఢ్‌ (11), రాజస్థాన్‌ (25), గుజరాత్‌ (26),ఉత్తరాఖండ్‌ (5), హిమాచల్‌ ప్రదేశ్‌ (4)అరుణాచల్‌ప్రదేశ్‌ (2)– 75 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 

కేరళలో యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్‌లు ఉన్నాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలోని ఈ రెండు ఫ్రంట్‌లలో ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా ప్రస్తుత కూటమి నుంచి బయటికి వచ్చి మూడో ఫ్రంట్‌లో చేరదు. కేరళలో ఇప్పుడిప్పుడే ఉనికి చాటుకుంటున్న బీజేపీ ఎక్కువ లోక్‌సభ స్థానాలు ఆశించడం దురాశ. ఇటువంటి పరిస్థితులలో బీజేపీ, కాంగ్రెస్‌ ప్రమేయం లేకుండా కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కాని పని. 

మూడో ఫ్రంట్‌ వృధాప్రయాసేనా?
ఈ మాత్రం లెక్కలు కేసీఆర్‌కు తెలియవా? తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌. ఎంఐఎంతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నారు కనుక బీజేపీని వ్యతిరేకించాలి. అసలు బీజేపీ అధినాయకత్వం పురమాయిస్తేనే కేసీఆర్‌ రంగంలోకి దిగారనీ, ఎన్‌డీఏ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు మూడో ఫ్రంట్‌ పనికి వస్తుందనీ రేవంత్‌రెడ్డి వంటి కాంగ్రెస్‌ నాయకులు చేసే ఆరోపణలకు ఆధారాలు లేవు. మరి మూడో ఫ్రంట్‌ ఆలోచన దేనికోసం? తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌)ని ముఖ్యమంత్రి పీఠంపైన కూర్చోబెట్టడానికా? ఢిల్లీ దండయాత్రలో తనతోపాటు పలుకున్నవారిని కూడా తీసుకువెళ్తే కేటీఆర్‌కు అడ్డులేకుండా పోతుందనా? తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో పోరాడుతున్నాడంటే తెలంగాణ ప్రజల గుండెలు పొంగి టీఆర్‌ఎస్‌పై సమధికోత్సాహంతో ఓట్ల వాన కురిపిస్తారనే అంచనా ఫ్రంట్‌ ప్రతిపాదన వెనుక ఉన్నదా? 

పోటీతత్వం పోటెత్తినప్పుడు ఎత్తులూ, పైఎత్తులతో రాజకీయాలు రసకందాయంలో పడతాయి. ఒకే బడిలో చదివిన సహాధ్యాయులు ఇద్దరి మధ్య నువ్వా–నేనా అన్న ధోరణిలో స్పర్ధ చోటు చేసుకున్నప్పుడు రాజకీయ ఉష్ణోగ్రత పెరి గిపోతుంది. ఎవరు ఏ వ్యూహం రచించినా తమ ప్రయోజనాలే ప్రధానం. 1983–84 నుంచి 2001 వరకూ తెలుగుదేశం పార్టీలో సహచరులైన నారా చంద్రబాబునాయుడు, కేసీఆర్‌ సన్నిహితులు. 1995లో ఎన్‌టి రామారావును గద్దె దింపిన నాటకీయ సన్నివేశంలో కేసీఆర్‌ చంద్రబాబు వెంటే ఉన్నారు. 

ఆనక మంత్రి పదవి కాదని, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పదవితో సర్దుకోవాలని చెప్పడంతో కేసీఆర్‌ తిరుగుబాటు చేయవలసి వచ్చింది. ప్రజల హృదయాలలో నిద్రాణంగా ఉన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను తట్టిలేపారు. తెగించి పార్టీ స్థాపించారు. అనంతరం జరిగిన చరిత్ర అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసిన కారణంగా రాజదండం ధరించే అవకాశం చంద్రబాబుకు రెండు దశాబ్దాల కిందటే లభించింది. కేసీఆర్‌ పదమూడు సంవత్సరాలు మహోద్యమానికి సారధ్యం వహించి, తెలంగాణ రాష్ట్రం సాధించి, కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేతబట్టి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఇద్దరూ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన విధానంలో హస్తిమశకాంతరం ఉంది. 

ఎన్‌టి రామారావు 1994 ఎన్నికలలో ఘనవిజయం సాధించి సంపాదించిన అధికారాన్ని అక్రమంగా హస్తగతం చేసుకున్న చంద్రబాబునాయుడికీ, ఉద్యమ కెరటంపై ఉప్పెనలా వచ్చి కాంగ్రెస్‌ పార్టీని పూర్వపక్షం చేసి సాధికారికంగా ప్రభుత్వం నెలకొల్పిన కేసీఆర్‌కీ పోలిక లేదు. పదేళ్ళు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో నివసిస్తూ కొత్త రాజధాని నగరాన్ని నిర్మించుకొని దర్జాగా వెళ్ళవలసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని ఓటుకు నోటు కేసు అనే అస్త్రంలో విజయవాడకు పరుగులు తీయించడం ద్వారా పోటీ రాజకీయంలో చంద్రబాబుపైlకేసీఆర్‌ ఆధిక్యం చాటుకున్నారు. 

కాంగ్రెస్‌తో టీడీపీ దోస్తీ
నాలుగేళ్ళుగా తెలంగాణలో కేసీఆర్‌ను రాజకీయంగా సవాలు చేయగల పరిస్థితిలో కాంగ్రెస్‌ కానీ బీజేపీ కానీ లేవు. ఎన్నికలు సమీపిస్తున్న దశలో కాంగ్రెస్‌లో కాస్త చలనం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రికి గట్టి పోటీ ఇస్తున్నారు. పాదయాత్రలో రోజు విడిచి రోజు జరుగుతున్న బహిరంగసభలకు వేల సంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా హాజరుకావడం చంద్రబాబుకు ఆందోళన కలి గిస్తున్నది. ఎన్‌డీఏ భాగస్వామ్యాన్ని వదులుకోలేకా, ప్రత్యేకహోదా ఉద్యమంతో జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజామోదం పెరగడాన్ని చూస్తూ ఊరుకోలేక చంద్రబాబు సతమతం అవుతున్న దశలో కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ అనే నినాదంతో జాతీయ స్థాయి రాజకీయాలలో ప్రవేశిస్తున్నట్టు ప్రకటించారు. 

ప్రత్యేక విమానంలో కోల్‌కతా వెళ్ళి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమాలోచనలు జరిపారు. అంతలోనే ప్రత్యేకహోదా ఉద్యమాన్ని ఉధృతం చేసిన జగన్‌మోహన్‌రెడ్డి కార్యాచరణ ప్రకటించడం ఆరంభించారు. మోదీ ప్రభుత్వంపైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించుకున్నప్పుడు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి కేంద్ర మంత్రిమండలిలోనే ఉన్నారు. కాళ్ళ కింద నేల కదిలిపోతోందని గ్రహించిన చంద్రబాబు ఇద్దరు మంత్రులనూ ఉపసహరించుకుంటూ ఎన్‌డీఏలో కొనసాగుతామని చెప్పారు. మోదీ ప్రభుత్వాన్ని ధిక్కరించేందుకు చంద్రబాబు ఎందువల్లనో సంకోచిస్తున్నారనే అభిప్రాయం జనసామాన్యంలో బలపడుతున్న దశలో వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తానని అసెంబ్లీలో అన్నారు. తెల్లవారగానే ఆదరాబాదరాగా ఎన్‌డీఏ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించి తోట నరసింహం చేత అవిశ్వాస తీర్మానం ఇప్పించారు. పోటీ రాజకీయం ఫలితం. 

లోగడ యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా పని చేసిన అనుభవం, ప్రతిపక్షాలతో సంబంధాలు ఉన్న కారణంగా జాతీయ స్థాయిలో కేసీఆర్‌ కంటే ఎక్కువ ప్రభావవంతమైన పాత్ర పోషించే అవకాశం చంద్రబాబుకి ఉంది. తెలంగాణ వాదానికి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ప్రతిపక్ష నాయకులను కేసీఆర్‌ కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించిన ధీరుడుగా కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. పాత పరిచయాలను పునరుద్ధరించి, ప్రతిపక్ష నేతలతో చర్చలు కొనసాగించాలని కేసీఆర్‌ ప్రయత్నం. 

కాంగ్రెస్‌ లేకుండా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ సాధ్యం కాదనే స్పష్టత చంద్రబాబుకి ఉంది. అందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి ప్రాతిపదికను సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్‌ కంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఎక్కువ హాని చేసిందనే మాట పదేపదే అంటున్నది అందుకే. బీజేపీని కాంగ్రెస్‌ కంటే పెద్ద విలన్‌గా చిత్రించడంలోని పరమార్థం అదే. బీజేపీతో రెండు విడతల పొత్తు పెట్టుకున్న చంద్రబాబు కాంగ్రెస్‌తో ఇంతకాలం రహస్యంగా సాగించిన సంబంధాలను బహిర్గతం చేసి పొత్తు కుదుర్చుకుంటే అవకాశవాద రాజకీయం పరాకాష్ఠకు చేరుతుంది.

- కె. రామచంద్రమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement