సాక్షి, హైదరాబాద్ : జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిని ఏర్పాటు చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు మరోసారి ఉద్ఘాటించారు. జాతీయ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరముందని, ఆ మార్పు తెలంగాణ నుంచే మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. థర్డ్‌ఫ్రంట్ గురించి నిన్న విలేకరుల సమావేశంలో చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రగతి భవన్‌కు పెద్దసంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు దిశగా తాను ముందుకెళుతున్నానని, త్వరలోనే అందరినీ కూడగడతానని ఆయన స్పష్టం చేశారు. థర్డ్‌ఫ్రంట్‌ను అందరూ స్వాగతిస్తున్నారని, చాలామంది నేతుల తనకు ఫోన్ చేసి మాట్లాడారని తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జేఎంఎం నేత హేమంత్ సోరెన్ తనకు ఫోన్ చేసి మద్దతు పలికారని, మహారాష్ట్ర నుంచి కూడా ఫోన్లు వచ్చాయన్నారు.
ప్రజల ఆకాంక్షలు గుర్తించడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయని తెలిపారు. 70 ఏళ్లలో ఆ రెండు పార్టీలు చేసిందేమీ లేదన్నారు. 10 లక్షల కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతోందని, ప్రజల దీవెన ఉంటే జాతీయ రాజకీయాల్లోకి కూడా వస్తానని, దేశానికి అద్భుతమైన దిశాదశా చూపించి..మార్గనిర్దేశం చేస్తానని చెప్పారు. మనది పేరుకే సమాఖ్య వ్యవస్థ అని, అన్ని అధికారాలు కేంద్రం చేతిలో ఉన్నాయని ఆయన విమర్శించారు. కేంద్రం వద్ద పరిమిత అధికారాలు ఉండాలని సూచించారు. ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం, విద్యావిధానాన్ని రాష్ట్రాలకు ఎందుకు అప్పగించరు? అని ప్రశ్నించారు. రిజర్వేషన్ల అంశాన్ని రాష్టాలకు ఎందుకివ్వరని నిలదీశారు.
ఏదీ తేల్చరు? ఏది జరగదు? ఇది కేంద్రం తీరు అని విమర్శించారు. నీళ్ల పంపకాల్లో రాష్ట్రాల మధ్య గొడవ పెడుతున్నారని కేంద్రం తీరుపై మండిపడ్డారు. అన్ని ధరలు పెంచుతున్నారు కానీ పంటల మద్దతు ధరలు పెంచలేదని మండిపడ్డారు. రైతాంగం సంక్షోభంలో ఉన్నా.. మనం ఎందుకు మాట్లాడకూడదు? అని ప్రశ్నించారు. ఒకవేళ మాట్లాడితే జైలుకు పంపుతారట. పిట్ట బెదిరింపులకు కేసీఆర్ భయపడడు. నన్ను ముట్టుకుంటే భస్మం అవుతారు’ అని కేసీఆర్ కేంద్రాన్ని హెచ్చరించారు.
‘కాంగ్రెస్ మీద కోపం వచ్చి బీజేపీని గెలిపిస్తే.. రైతులు, విద్యార్థులు, కార్మికులకు ఏం ఒరగలేదు. వాళ్ల జమానాలో మాల్యా.. వీళ్ల జమానాలో నీరవ్.. బ్యాంకులను మోసం చేసి పారిపోయారు. ఒకప్పుడు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న చైనా.. ఇప్పుడు అమెరికాతో పోటీ పడుతోంది. కానీ మనం మాత్రం ఆస్థాయిలో ఎదగలేకపోతున్నాం’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment