గుజరాత్ కీలక రాజకీయ పరిణామం!
కొత్త రాజకీయ ఫ్రంట్‌ను ప్రకటించిన సీనియర్ నేత వాఘేలా
కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా కూటమి!
అహ్మదాబాద్: మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. గత జూలై నెలలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత శంకర్‌సిన్హ్ వాఘేలా కొత్త 'రాజకీయ ఫ్రంట్'ను మంగళవారం ప్రకటించారు. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా మూడో రాజకీయ ప్రత్యామ్నాయంగా తన ఫ్రంట్ పనిచేస్తుందని ఆయన తెలిపారు.
'ఇది రాజకీయ పార్టీ కాదు. యూపీఏ, ఎన్డీయే తరహాలో రాజకీయ కూటమి. ఇది బీజేపీ 'బీ' టీం కాదు. ఇందులో ఎలాంటి మ్యాచ్ ఫీక్సింగ్ లేదు. కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం లేదు. అధికార బీజేపీ ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా అజెండాతో ఎన్నికల్లోకి వెళుతాం' అని వాఘేలా స్పష్టం చేశారు.
'జన్ వికల్ప్' పేరిట గుజరాత్‌లో 'ప్రజా ప్రత్యామ్నాయాన్ని' అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 182 స్థానాల్లోనూ తమ కూటమి పోటీ చేస్తుందని వెల్లడించారు. మహిళల సమస్యలు, జీఎస్టీ, నిరుద్యోగిత తదితర 20 అంశాల ఆధారంగా ఎన్నికల్లోకి వెళుతామని చెప్పారు.