మూడో కూటమికి డీఎంకే రెడీ
Published Sun, Oct 27 2013 4:49 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
సాక్షి, చెన్నై: యూపీఏ నుంచి బయటకు వచ్చిన డీఎంకే అధినేత కరుణానిధి కేంద్రంపై తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు. కరుణ తీరు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. డీఎంకేను పక్కన పెట్టి విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేతో కలసి రాష్ట్రంలో పయనించే విధంగా ఆయన పావులు కదుపుతున్నారు. ఇది కరుణానిధికి మింగుడు పడడం లేదు. కేంద్రానికి వ్యతిరేకంగా స్వరం పెంచడం, రాష్ట్రంలో తన నేతృత్వంలో మెగా కూటమి ఏర్పాటు చేయడం లక్ష్యంగా వ్యూహాలు రచించారు. వీటి అమలులో ఆటంకాలు ఎదురవుతుండడంతో బీజేపీపై దృష్టి సారించారు. ఏర్కాడు ఉప ఎన్నికను అస్త్రంగా చేసుకుని వారికి దగ్గరయ్యేందుకు చేసిన యత్నాలు మోడీరాకతో బెడిసి కొట్టాయని చెప్పవచ్చు. ఈ మొత్తం వ్యవహారంతో వృద్ధనేత డైలమాలో పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా మూడో కూటమికి తాను రెడీ అని చాటే ప్రయత్నాల్లో పడ్డారు.
ఆహ్వానిస్తే నిర్ణయం
లోక్‌సభకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మూడో కూటమి ఏర్పాటు ప్రయత్నాలను వామపక్షాలు ప్రారంభించాయి. ఈ నెల 30న ఢిల్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నాయి. ఈ సమావేశానికి హాజరుకావాలంటూ అన్నాడీఎంకేకు ఆహ్వానం వచ్చింది. అయితే డీఎంకేకు పిలుపు లేదు. ఈ విషయమై కరుణానిధిని మీడియా శుక్రవారం ప్రశ్నించింది. దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కూటమి రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే దేశ సౌభ్రాతృత్వానికి మూడో కూటమి ఆవిర్భవిస్తే ఆహ్వానించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. తనకు ఆహ్వానం వస్తే పార్టీలో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటానని పరోక్షంగా వామపక్షాలకు సందేశం పంపారు.
పార్టీలో చర్చ
కరుణానిధి వ్యాఖ్యలతో డీఎంకేలో చర్చ మొదలైంది. తమ నేత దారి ఎటని ప్రశ్నించుకుంటున్నారు. ఓ వైపు కాంగ్రెస్‌ను విమర్శిస్తూనే మరోవైపు తమ అవసరాలకు యూపీఏను ఉపయోగించుకుంటున్నారు. మధ్యలో ఉన్నట్లుండి బీజేపీకి మద్దతు లేఖ రాశారు. ఇంతలోనే మూడో కూటమికి రెడీ అంటూ సంకేతాలు పంపారు. ఇంతకీ కరుణ ఆలోచన ఏంటనే దానిపై నేతలు చర్చించుకుంటున్నారు. వామపక్షాలు ఏర్పాటు చేయబోతున్న మూడో కూటమికి ఎవరు నేతృత్వం వహించాలన్న విషయంలో అన్నాడీఎంకే తిరకాసు పెట్టడం తథ్యమని డీఎంకే నేత ఒకరు తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా చివరి క్షణంలో ఆ పార్టీ మూడో కూటమి నుంచి తప్పుకున్నా తప్పుకోవచ్చన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకునే తమ నేత ‘ఆహ్వానం’ పేరిట కొత్త అస్త్రాన్ని సంధించారని పేర్కొన్నారు.
Advertisement
Advertisement