కోల్‌కతా: జాతీయస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటుదిశగా ముందడుగు పడింది. జాతీయస్థాయిలో థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటుచేస్తానని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సోమవారం కోల్‌కతా వెళ్లి.. పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. జాతీయస్థాయిలో మూడో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు సాధ్యాసాధ్యాలు, జాతీయ రాజకీయాలపై దాదాపు రెండు గంటలపాటు చర్చించారు. సీఎం కేసీఆర్ వెంట టీఆర్‌ఎస్ ఎంపీలు కేకే, కవిత ఉన్నారు.
ఈ భేటీ అనంతరం మమత, కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ సానుకూల ప్రకటనలు చేశారు. థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు దిశగా శుభారంభం మొదలైందని వారు పేర్కొన్నారు. ఉమ్మడి నాయకత్వంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కానుందని సీఎం కేసీఆర్ అన్నారు. ‘ఇది శుభారంభం. రాజకీయాలు ఒక నిరంతర ప్రక్రియ. దేశాభివృద్ధి లక్ష్యంగా మేం చర్చలు జరిపాం’ అని మమత తెలిపారు. రాజకీయాలు భిన్నమైన వ్యక్తులతో కలిసి పనిచేసే పరిస్థితులు కల్పిస్తాయని, రాజకీయాలను తాను విశ్వసిస్తున్నానని మమత అన్నారు.
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘మామూలు రాజకీయ నమూనానుకు భిన్నమైన ఏజెండాను మేం ప్రతిపాదిస్తున్నాం. ఇది ప్రజల అజెండా. భారతదేశ ప్రజల కోసమే ఈ కూటమి ఏర్పడనుంది. ఇది రాజకీయ పార్టీల కూటమి కాదు. ఇది ప్రజల కూటమి. ప్రత్యామ్నాయ కూటమి రావాల్సిన అవసరముంద’న్నారు. బెంగాల్ అభివృద్ధికి మమత ఎంతో శ్రమిస్తున్నారని కేసీఆర్ అన్నారు. గతంతో పోల్చుకుంటే కోల్‌కతా రూపురేఖలు ఇప్పుడు చాలా మారిపోయాయని ఆయన ప్రశంసించారు. కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయం అవసరముందని, ఇందుకు ప్రాంతీయ పార్టీలన్ని ఏకం కావాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు
Comments
Please login to add a commentAdd a comment