
డిచ్‌పల్లి: తెలంగాణలో ఏమి చేయలేని ముఖ్యమంత్రి కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశాన్ని మారుస్తానంటే నమ్మేదెవరని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ధ్వజమెత్తారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో మంగళవారం రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణలో రైతులను పట్టించుకోనోడు.. దేశ రూపురేఖలు ఎలా మారుస్తాడని ప్రశ్నించారు. రైతులు మద్దతు ధర లేక రోడ్డెక్కుతూ, ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ముఖ్యమంత్రి ఢిల్లీలో మంతనాలు చేయడం ఏమిటని నిలదీశారు. దేశ చరిత్రలో థర్డ్ ఫ్రండ్ ఎవరి వల్ల సాధ్యం కాలేదని, కేసీఆర్‌తో కూడా ఏమీ కాదని పేర్కొన్నారు.
తెలంగాణను తెచ్చింది ఎవరో అనుభవించడానికి కాదని చెప్పారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు చూపించాల్సిన ప్రభుత్వం వారికి మొండి చేయి చూపుతోందని విమర్శించారు. మహారాష్ట్రలో వేలాది రైతులు 200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వారి హక్కులు సాధించుకొని రైతు పోరాటాలకు ఊపిరి పోశారని, తద్వారా అక్కడి ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేరని తెలిపారు. రైతుల కోసం బలమైన నిర్ణయం తీసుకోవడానికి జేఏసీ సిద్ధమవుతోందని, వారి తరఫున జూన్ నుంచి ప్రతి గ్రామాన పోరాటం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సమస్యలు తెలపడానికి పోతే ముఖ్యమంత్రి కనపడడు.. ఆయనకు చెప్పినా వినపడదని ఎద్దేవా చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడిపించాలని కోదండరాం డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment