జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న కోదండరాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేసేదాకా ప్రజలు పోరాడాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ, సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన అంతమై భారత్‌లో హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన రోజని చెప్పారు. ఆనాడు మన రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమం జరిగిందన్నారు.
ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న నేటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామిక, రాజ్యాంగబద్ధమైన పాలన కోసం చాలా దూరం ప్రయాణించాల్సి ఉందన్నారు. పోరాటాల తెలంగాణలో కుటుంబం పాలన సాగుతోందన్నారు. ఈ కుటుంబ నియంతృత్వ, ఫ్యూడల్ పాలన ముగింపు కోసం అందరూ ఒక్కటై ఉద్యమించాల్సిన అవసరముందని చెప్పారు. రాజకీయాల్లో మార్పు కోసమే ప్రయత్నిస్తున్నామన్నారు. తెలం గాణ జనసమితికి ఉద్యమ ఆకాంక్షలు ప్రధానమని తెలిపారు. అట్టడుగు వర్గాల వారందరికీ అభివృద్ధి ఫలాలు అందే దాకా పోరాటం సాగుతుందని కోదండరాం అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు అంబటి శ్రీనివాస్, వెంకటరెడ్డి, యోగీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment