సంపాదకీయం: ఎన్నికల్లో ప్రజల ఆమోదాన్ని పొందదల్చుకున్న పార్టీకైనా, కూటమికైనా విశ్వసనీయత ముఖ్యం. అది నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుందని, ఆటుపోట్లెన్ని ఎదురైనా అందుకోసం నిలకడగా పోరాడుతుందని నమ్మకం కుదిరినప్పుడే విశ్వసనీయత లభిస్తుంది. కానీ, తృతీయ ఫ్రంట్ ప్రజల్లో అలాంటి విశ్వసనీయతను కల్పించలేకపోతున్నది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రెండు ప్రధాన కూటములు యూపీఏ, ఎన్డీఏలను ఎదుర్కొంటామని ప్రకటించిన తృతీయ ఫ్రంట్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. అదింకా పూర్తి స్వరూపాన్ని సంతరించుకోకుండానే బీటలువారిన సూచనలు కనబడుతున్నాయి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఆదరాబాదరగా ఒకచోట చేరడం, అటుతర్వాత కొన్నాళ్లకే ఆ శిబిరం మాయంకావడం రివాజైంది. కానీ, ఈసారి అందుకు భిన్నంగా ఎన్నికలకు ముందే, పుట్టిన రెండువారాలకే కనుమరుగయ్యే స్థితి ఏర్పడింది. తృతీయ ఫ్రంట్ ఆవిర్భావాన్ని ప్రకటించిన సమావేశానికి డుమ్మా కొట్టిన ఏజీపీ, బీజేడీల్లో ఒక పార్టీ బీజేపీతో పొత్తు కోసం తహతహలాడితే మరొకటి అలాంటి అవకాశానికి తలుపులు తెరిచివుంచింది.
ఆ రెండూ బీజేపీతో భవిష్యత్తులో కలిసినడుస్తాయా, లేదా అన్నది వేరే విషయం. కానీ, తృతీయ ఫ్రంట్‌వైపు మాత్రం వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. ఇక ఫ్రంట్‌లో ముఖ్య భాగస్వామిగా ఉండగలదనుకున్న అన్నా డీఎంకే హఠాత్తుగా దారి మార్చుకుంది. వామపక్షాలతో సీట్ల సర్దుబాటు లేదని ప్రకటించింది. సమాజ్‌వాదీ పార్టీ చివరి వరకూ నిలబడుతుందన్న విశ్వాసం ఎవరికీ లేదు. ఇప్పటికే, రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో ఉంచబోమని ప్రకటించి కాంగ్రెస్‌పై ఆ పార్టీ తన భక్తిభావాన్ని చాటుకుంది. ఇక వామపక్షాల్లో ఒకటైన రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ(ఆర్‌ఎస్‌పీ) కేరళలో ఒక లోక్‌సభ స్థానం విషయంలో వచ్చిన పేచీతో కాంగ్రెస్‌తో జతకట్టాలని నిర్ణయించింది.
ఈ పరిణామాలన్నీ తృతీయ ఫ్రంట్ పునాదులు ఎంత బలహీనంగా ఉన్నాయో చెప్పకనే చెబుతున్నాయి. తృతీయ ఫ్రంట్ పుట్టకముందే ఎన్నో శాపనార్థాలకు గురైంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అది ‘చవకబారు ఫ్రంట్’ అని ఎద్దేవా చేశారు. అందులో కమ్యూనిస్టులు కలిశారు గనుక...తనకు వారితో వివాదం ఉన్నది గనుక తృణమూల్ అధినేత మమతా బెనర్జీ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే, దురదృష్టమేమంటే దృఢమైన అభిప్రాయాలను ప్రకటించగలిగే పార్టీలను సమీకరించలేక వామపక్షాలు ఈ తరహా శాపనార్థాలను నిజం చేస్తున్నాయి. 11 పార్టీలు ఒక వేదికపైకి రావడం, తమది తృతీయ ఫ్రంట్ కాదని...తామే ప్రథమ ఫ్రంట్ అని చెప్పడం ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయితే కావొచ్చుగానీ, అందుకు అవసరమైన కార్యాచరణ బొత్తిగా కొరవడిందని మాత్రం ఈ పరిణామాలన్నీ తెలియజెబుతున్నాయి.
తృతీయ ఫ్రంట్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురవడానికి అందులో ప్రధాని పదవిపై మోజున్నవారు లెక్కకు మించి ఉండటమే కారణమన్నది బహిరంగ రహస్యం. పైగా, గతంలోవలే రాష్ట్రాల్లో ఏదో ఒక పార్టీ ఆధిపత్యమే ఉండే అవకాశాలు ఇప్పుడు లేవు. పశ్చిమబెంగాల్ ఒకప్పుడు వామపక్షాలకు కంచుకోట. ఇప్పుడక్కడ మమతా బెనర్జీ బలపడ్డారు. కనుక వామపక్షాల పలుకుబడి జాతీయస్థాయిలో ఇదివరకు ఉన్నట్టే ఇప్పుడూ ఉండటం సాధ్యంకాదు.
వామపక్షాలతో కలిసి నడుస్తామని ప్రకటించిన ఎస్పీ, జేడీ(యూ)లు ఆ పార్టీలతో సీట్ల సర్దుబాటు విష యంలో ఉత్సాహం చూపకపోవడం ఇందుకు ఉదాహరణ. బీహార్‌లో సీపీఐకి రెండు లోక్‌సభ స్థానాలివ్వడానికి సిద్ధపడిన జేడీ(యూ)... సీపీఎం అడిగిన ఒక స్థానం ఉజియార్‌పూర్ ఇవ్వడానికి ససేమిరా అంటు న్నది. బెంగళూరులో ఫ్రంట్ తలపెట్టిన భారీ ర్యాలీ ఏ కారణంవల్లనో వాయిదాపడింది. తృతీయ ఫ్రంట్ కాక, తమ ఫెడరల్ ఫ్రంట్ మాత్రమే భవిష్యత్తు రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుందని మమతా బెనర్జీ లోగడే చెప్పారు. అందుకోసమనే ప్రధాని పదవికి జయలలిత అన్నివిధాలా అర్హురాలని ప్రకటించి ఆమెను తృతీయ ఫ్రంట్‌నుంచి బయటకు సుకురాగలిగారు.
అయితే, తృతీయ ఫ్రంట్ ఆవిర్భావానికి ఇలా అవాంతరాలు ఎదురవుతున్నంత మాత్రాన అసలు జాతీయ స్థాయిలో మరో కూటమికి అవకాశం లేదని చెప్పలేం. ప్రధాన జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు రెండూ పలు రాష్ట్రాల్లో బలహీనపడ్డాయి. ఆ మేరకు కొత్త శక్తులు పుంజుకున్నాయి. ఒదిశాలో బీజేడీ, మన రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ బలంగా ఉంటే, ఢిల్లీ వంటిచోట ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భ వించింది. హర్యానాలో ఐఎన్‌ఎల్‌డీ, హర్యానా జనహిత్ కాంగ్రెస్... కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ...పంజాబ్‌లో అకాలీదళ్... మహా రాష్ట్రలో శివసేన, ఎంఎన్‌ఎస్,ఎన్సీపీ...యూపీలో ఎస్పీ, బీఎస్పీ...అస్సాంలో ఏజీపీ, ఏయూడీఎఫ్, బీపీఎఫ్ వంటివి ఆదరిస్తేనే జాతీయ పార్టీలకు అంతో ఇంతో మనుగడ ఉంటుంది.
భిన్న పరి స్థితుల్లో, విభిన్నమైన ప్రయోజనాలకోసం, ప్రాంతీయ ఆకాంక్షల కోసం ఆవిర్భవించిన పార్టీలను ఉపేక్షించి, వాటి డిమాండ్లను కాదని జాతీయ పార్టీలు రెండూ అధికారాన్ని అందుకోవడం సాధ్యంకాదు. కనుక జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ బలహీనంగా ఉన్నట్టు కనిపిస్తున్నా రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. రెండు కూటములకూ వెలుపల ఉండే పార్టీలు చాలాచోట్ల విజయం సాధించడమే కాదు...జాతీయ స్థాయిలో అవి కీలకపాత్ర పోషించే అవకాశాలున్నాయి. కనుక ప్రతిసారీ ఎన్నికల అనం తరం ముగిసిపోయే తృతీయ ఫ్రంట్ కథ ఇప్పుడు ఎన్నికలకు ముందే పూర్తయినట్టు కనబడుతున్నా యూపీఏ, ఎన్డీఏలు ఏమరు పాటుగా ఉండటం సాధ్యంకాదు.