పార్లమెంటు తీరు ఇంతేనా?! | NDA starts looking like the UPA as Congress does | Sakshi
Sakshi News home page

పార్లమెంటు తీరు ఇంతేనా?!

Published Thu, Dec 17 2015 11:27 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

పార్లమెంటు తీరు ఇంతేనా?! - Sakshi

పార్లమెంటు తీరు ఇంతేనా?!

పార్లమెంటును సజావుగా నడపడంలో యూపీఏ ప్రభుత్వం తరహాలోనే ఎన్డీయే సర్కారు కూడా విఫలమవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో సరుకులు, సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లుతో సహా ఎన్నో ముఖ్యమైనవి ఉన్నాయి. జీఎస్‌టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉండగా...చెక్ బౌన్స్ కేసులకు సంబంధించిన సవరణ బిల్లు, ఆర్బిట్రేషన్ చట్టాన్ని సవరిస్తూ జారీచేసిన ఆర్డినెన్స్ స్థానంలో పెట్టే బిల్లు సహా మొత్తంగా 67 బిల్లులు ఉభయసభల ముందుకూ రావాల్సి ఉంది. మరోపక్క రైతుల ఆత్మహత్యలు, అధిక ధరలు, ప్రకృతి విపత్తులవంటి ఎన్నో ముఖ్యాంశాలపై చర్చించాల్సి ఉంది.

ఈ తరుణంలో హఠాత్తుగా ఊడిపడిన ‘నేషనల్ హెరాల్డ్’ వివాదం పార్లమెంటును ముందుకు కదలనివ్వలేదు. ఇప్పుడు ఢిల్లీ సీఎం ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంపై సీబీఐ చేసిన దాడి ఉభయ సభల్లో కల్లోలాన్ని సృష్టించింది. దానికి కొనసాగింపుగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై ఆప్ చేసిన ఆరోపణలు, అందుకు కాంగ్రెస్ వత్తాసునివ్వడం మరికొంత సమయాన్ని మింగేశాయి. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరు తెస్తూ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుని పెను సంక్షోభాన్ని తీసుకొచ్చారు. ఈ నెల 23తో సమావేశాల గడువు ముగిబోతున్నది. సెలవుల్ని మినహాయిస్తే పార్లమెంటు సాగేది మరో నాలుగు రోజులు మాత్రమే. పాలక పక్షం పరిణతితో వ్యవహరిస్తే వీటిలో చాలా వివాదాలు నివారించదగ్గవే. ‘నేషనల్ హెరాల్డ్’ కేసు విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును ఎవరూ అంగీకరించలేదు. న్యాయస్థానంలో ఉన్న వివాదాన్ని అనవసరంగా పార్లమెంటుకు ఈడ్చుకొచ్చిందన్న అభిప్రాయమే సాధారణ పౌరుల్లో వ్యక్తమైంది.

 ఢిల్లీలో సీబీఐ నిర్వహించిన దాడి మాటల యుద్ధానికి దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీని పట్టుకుని పిరికిపంద, ఉన్మాది అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. సీబీఐ దాడి లక్ష్యం రాజేంద్ర కుమార్ కాదనీ, ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఫైలు కోసమే ఇలా చేశారని ఆయన ఆరోపించారు. ఇందులో నిజానిజాల మాటెలా ఉన్నా సీబీఐ వ్యవహరించిన తీరు మాత్రం సరిగా లేదనే చెప్పాలి. అవసరమనుకున్నచోట సోదాలు నిర్వహించేందుకు కేసును దర్యాప్తు చేసే అధికారికి సర్వాధికారాలున్నాయి. అందుకు ప్రభుత్వ ముందస్తు అనుమతిగానీ, ఆఖరికి తన ఉన్నతాధికారి అనుమతిగానీ అవసరం లేదు. అవినీతి కేసుల్లో మెరుపుదాడులే ఫలితాన్నిస్తాయి తప్ప ముందుగా చెప్పి వెళ్తే ఉపయోగం ఉండదని కేంద్రం చెప్పిందీ నిజమే కావొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక సీనియర్ అధికారిపై ఉన్న ఆరోపణల విషయంలో దర్యాప్తు చేస్తున్నప్పుడు కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉండాల్సిన సంబంధాల సంగతిని మర్చిపోకూడదు. మూడో అంతస్తులో ఉన్న రాజేంద్రకుమార్ కార్యాలయాన్ని మాత్రమే సోదా చేశామని సీబీఐ సంజాయిషీ ఇస్తోంది. కానీ దానికి చేర్చి ఉన్న తన కార్యాలయంలో కూడా సోదాలు చేశారని కేజ్రీవాల్ అంటున్నారు. మూడో అంతస్తు మొత్తాన్ని సీల్ చేసి, సీఎం ఆఫీసుకు దారితీసే మార్గాన్ని కూడా అడ్డుకుని సోదాలు నిర్వహించకపోయి ఉంటే ఇలాంటి ఆరోపణలకు తావుండేది కాదు. పైగా ఢిల్లీ ప్రభుత్వానికీ, కేంద్రానికీ మధ్య ఇప్పటికే ఎన్నో అంశాల్లో తగాదాలొచ్చాయి.

ఈ చరిత్రంతా అక్కడే కొలువుదీరిన సీబీఐకి తెలియదనుకోలేం. కనుక దాడులు చేయడానికి కొద్ది సమయం ముందైనా కేజ్రీవాల్‌కు వర్తమానం ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. పోనీ తనదేమైనా ఘన చరిత్ర అయివుంటే...ముందూ మునుపూ తటస్థంగా, నిక్కచ్చిగా వ్యవహరించిన నేపథ్యం ఉంటే వేరు. యూపీఏ పాలనాకాలమంతా విపక్షాలన్నీ దాన్ని ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అనే పిలిచేవి. సాక్షాత్తూ సుప్రీంకోర్టే అనేక సందర్భాల్లో సీబీఐ డెరైక్టర్లుగా ఉన్నవారికి అక్షింతలేసింది. ఇలా ఎన్నిమార్లు మందలించినా దారికి రాకపోవడంతో చివరకు సహనం నశించి ‘పంజరంలో చిలుక’తో కూడా పోలిక తెచ్చింది. ఇప్పుడు ఆ పాత్రలోనే ప్రస్తుత దాడి నిర్వహించిందని విపక్షాలు ఆరోపిస్తుంటే సీబీఐ సమాధానం చెప్పుకోగలదా? మధ్యప్రదేశ్ వ్యాపం కేసు మొదలుకొని వివిధ కేసుల విషయంలో ఇంత చురుగ్గా ఎందుకు కదలడం లేదంటే ఏం చెబుతుంది? సీబీఐకి విశ్వసనీయత అనేది ఉంటే ప్రస్తుత దాడి ఇంత వివాదాస్పదం అయ్యేది కాదు.

సీబీఐ దాడి తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై ఆప్ నేతలు పార్లమెంటు వెలుపలా, లోపలా విరుచుకుపడుతున్నారు. డీడీసీఏ వ్యవహారంలో ఆయన అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. తమ ప్రభుత్వం నియమించిన కమిటీ ఆ సంగతిని నిగ్గు తేల్చిందంటున్నారు. మరి ఇన్ని నెలలుగా ఆయనపై ఢిల్లీ ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ దాఖలెందుకు చేయలేదో, కనీసం ఆ స్కాంను ఎందుకు బయటపెట్టలేదో ఆప్ నేతలు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు చేస్తున్న హడావుడిని చూస్తే స్వల్పకాలంలోనే ఆప్ కూడా ఒక సాధారణ రాజకీయ పక్షంగా మారిపోయిందని అర్ధమవుతుంది. ఢిల్లీ ప్రభుత్వం విషయంలో వ్యవహరించిన తీరుపైనే పార్లమెంటు రెండు రోజుల సమయం హరించుకుపోతే అరుణాచల్ ప్రదేశ్‌లో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం దీనికి తోడైంది.

పార్లమెంటు సాగుతుండగా ఇలాంటి వివాదాలన్నీ తెచ్చుకోవడం క్షేమం కాదని ఎన్‌డీఏ పెద్దలకు అర్ధమైనట్టు లేదు. పార్లమెంటు సమావేశాలకు ముందు సోనియా, మన్మోహన్‌లను ప్రధాని తన ఇంటికి ఆహ్వానించి చర్చించినప్పుడు ఈ సమావేశాలు సజావుగా సాగుతాయన్న అభిప్రాయం అందరిలోనూ కలిగింది. తీరా ఒకదాని వెనకొక వివాదం వచ్చి పడి సమావేశాలను చాపచుట్టేసే సూచనలు కనిపిస్తున్నాయి. పార్లమెంటు సమావేశాలు తీరు ఇలాగే సాగితే జనం ఎదుర్కొంటున్న సమస్యలు చర్చకొచ్చేది ఎప్పుడు? పరిష్కారం లభించేదెప్పుడు? అన్ని పార్టీలూ ఆలోచించాలి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement