ఎన్డీయేతో కలవం...థర్డ్ ఫ్రంట్‌లో చేరతాం | no join for nda we are join to Third Front -kcr | Sakshi
Sakshi News home page

ఎన్డీయేతో కలవం...థర్డ్ ఫ్రంట్‌లో చేరతాం

Published Mon, Apr 14 2014 1:04 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

ఎన్డీయేతో కలవం...థర్డ్ ఫ్రంట్‌లో  చేరతాం - Sakshi

ఎన్డీయేతో కలవం...థర్డ్ ఫ్రంట్‌లో చేరతాం

 కాంగ్రెస్‌కూ దూరమే కరీంనగర్ బహిరంగ సభలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
 
 టీఆర్‌ఎస్ సెక్యులర్ పార్టీ 
బీజేపీకి అధికారం కల్ల
ఎన్డీయే కూటమికి 200 సీట్లు దాటవు
ప్రాంతీయ పార్టీలదే హవా 
తెలంగాణలో చంద్రబాబుకేం పని ?.. ఇక్కడెందుకు దుకాణం?
ఉద్యమానికి అడ్డొచ్చిండు..  ఇప్పుడు తెలంగాణలో లేకుండా పోయిండు
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తా

 
 కరీంనగర్‌లో టీఆర్‌ఎస్ ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థుల తరఫున సమర శంఖం పూరించారు. సెక్యులరిజం తమ పార్టీ విధాన నిర్ణయమని ఈ సందర్భంగా ప్రకటించారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్‌ఎస్ ఎన్డీయేకు మద్దతు పలుకుతుందని కొన్ని పార్టీలు చేస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు. ‘కేంద్రంలో ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే థర్డ్ ఫ్రంట్‌లో భాగస్వామ్యమవుతామే తప్ప ఎన్డీయేలో చేరం. ఇప్పటికే నాతో మమతా బెనర్జీ, జయలలిత, నవీన్‌పట్నాయక్ వంటి చాలా మంది నేతలు మాట్లాడారు. దేశంలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వమే రావాలని వారందరూ కోరుకుంటున్నారు. పేరుకే జాతీయ పార్టీలు కానీ.. ప్రాంతీయ పార్టీల కంటే తక్కువనే ఉన్నాయి’ అని టీఆర్‌ఎస్ అధినేత వ్యాఖ్యానించారు. 

ఈసారి దేశంలో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొందరు తప్పుడు లెక్కలు చెబుతున్నారన్నారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి 200 సీట్లు దాటదని జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో దేశంలో ప్రాంతీయ పార్టీల కూటమి(కాన్ఫెడరేషన్ ఆఫ్ రీజనల్ పార్టీస్) ఒక్కటే ఉపయోగకరంగా ఉంటుందని, ఇతర పార్టీలకు అధికారం దక్కదని రాజకీయ విశ్లేషకులు, నిపుణులెందరో చెబుతూనే ఉన్నారని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రంగా ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచారు. ‘ఇక్కడి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు.. భాయీ భాయీగా మెలగాలి. అన్ని మతాల ప్రజలు సామరస్యంగా, సంతోషంగా జీవించాలన్నదే టీఆర్‌ఎస్ ఆశయం’ అని ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్ గెలిస్తేనే తమ ఆశలు నెరవేరుతాయని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారని, అందుకే పోటీలో ఉన్నామని కేసీఆర్ అన్నారు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయొద్దని తెలంగాణ సమాజమే తనను ఆదేశించిందన్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ తలరాతలను తామే రాసుకోబోతున్నారన్నారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. రేపటి తరానికి జవాబు చెప్పుకోవాల్సి వస్తుందని ఓటర్లను అప్రమత్తం చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కరీంనగర్ పేరు సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందన్నారు. ‘14 ఏళ్ల కిందట ఇదే మైదానంలో తెలంగాణ ఉద్యమ జెండా ఎగరేసి సింహగర్జన సభ నిర్వహించి బయల్దేరిన.

అప్పుడు మఘలో పుట్టి, పుబ్బలో పోతుందని చంద్రబాబు మాట్లాడిండు. ఉద్యమానికి ఎదురుంగ వచ్చినోళ్లు ఎందరో పోయిండ్రు. తెలంగాణ రాగానే చంద్రబాబే లేకుండా పోయిండు’ అని కేసీఆర్ ఎద్దేవా చేశా రు. ఆంధ్రోళ్లతో పంచాయితీ ఇంకా అయిపోలేదన్నారు. ‘చంద్రబాబుకు వెంకయ్యనాయడుతో దోస్తానా ఏంది? చంద్రబాబు ఇక్కణ్నే ఉంటా అంటున్నడు. తెలంగాణలో బాబుకేం పని. ఆంధ్రాకు పోక. ఇక్కడెందుకు దుకాణం పెట్టిండు. ఆంధ్ర పార్టీలతోని ఇక్కడేం అవసరం’ అని నిలదీశారు.
 
పొన్నాల ఎన్నటికీ కేసీఆర్ కాలేడు..

 టీఆర్‌ఎస్ మేనిఫెస్టోపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అవాకులు చెవాకులు పేలుతున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. ‘నువ్ ఎంత అరిచినా.. ఎంత ఎగిరినా.. కేసీఆర్‌వి కాలేవు. నువ్ ఒకటంటే నేను రెండంటా. కేసీఆర్ అరచేతిలో స్వర్గం చూపించిండని.. అవన్నీ చేయాలంటే రూ. 8 లక్షల కోట్లు కావాలని మాట్లాడుతుండు. మీ ప్రభుత్వంలో పావలా ప్రజలకిచ్చి బారణా మింగిండ్రు’ అని టీఆర్ ఎస్ చీఫ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్ మేనిఫెస్టోను కాపీ కొట్టారని విమర్శించారు. బలహీన వర్గాలకు, పేదలకు రూ. 3 లక్షలతో డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని, ఇందిరమ్మ ఇళ్ల రుణాలు మాఫీ చేస్తామని, రైతులకు లక్ష రూపాయల వరకు రుణం మాఫీ చేస్తామని, వృద్ధులు వితంతువులకు రూ. వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛ న్ ఇస్తామని ఆయన పునరుద్ఘాటించారు. మైనారిటీలకు 12 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూడో సంవత్సరం నుంచి 24 గంటల విద్యుత్‌ను అందిస్తామన్నారు. తెలంగాణలోని నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున నీరు అందించడానికి ప్రత్యేక రాష్ట్రంలో ప్రాజెక్టులు చేపడతామన్నారు. తెలంగాణ అమరుల కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటామని భరోసా ఇచ్చారు. ‘భర్తపోయిన బాధ గుండెల్లో ఉన్నా.. తెలంగాణ ఎప్పుడొస్తదని పోలీసు కిష్టయ్య భార్య పద్మావతి నన్ను అడిగింది. ఆమెకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’నంటూ వేదికపై కంట తడి పెట్టిన పద్మను కేసీఆర్ ఓదార్చారు.

 శ్రీధర్‌బాబు నియంత..: తెలంగాణ ప్రజల కష్టాలు ఎవరికి తెలుసో వారే అధికారంలోకి రావాలని, అందుకే టీఆర్‌ఎస్ ఎన్నికల బరిలో నిలిచిందని టీఆర్‌ఎస్ చీఫ్ అన్నారు. ‘తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మంథనిలో కొమురం భీం విగ్రహం పెడుదామని వెళితే.. మంత్రి శ్రీధర్‌బాబు అడ్డుకున్నడు. విగ్రహాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టించిండు. ఇప్పటికీ అది పోలీస్ స్టేషన్లనే ఉంది. అటువంటి నియంత.. తెలంగాణ వ్యతిరేకిపై పులి బిడ్డను పోటికి దింపినం’ అని కేసీఆర్ ఆవేశంగా చెప్పారు. జిల్లాలో టీఆర్‌ఎస్ తరఫున బరిలో నిలిచిన లోక్‌సభ అభ్యర్థులు వినోద్‌కుమార్, బాల్క సుమన్, అసెంబ్లీ అభ్యర్థులు గంగుల కమలాకర్, ఈటెల రాజేందర్, విద్యాసాగర్‌రావు, కొప్పుల ఈశ్వర్, సోమారపు సత్యనారాయణ, సతీష్‌బాబు, పుట్ట మధు, బొడిగె శోభ, చెన్నమనేని రమేశ్, డాక్టర్ సంజయ్, రసమయి బాలకిషన్, దాసరి మనోహర్‌రెడ్డిని వేదికపై పేరుపేరునా ప్రజలకు పరిచయం చేశారు.

 వేదిక ఎక్కని కవిత, కేటీఆర్

 కేసీఆర్ కుమారుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి కె.తారకరామారావు, కుమార్తె, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత కరీంనగర్ శంఖారావం వేదికకు దూరంగా జనం మధ్యలో కూర్చున్నారు. కేసీఆర్ అభ్యర్థులను పరిచయం చేస్తున్న సమయంలో సైతం వీరిని వేదికపైకి పిలవలేదు. సభ ప్రారంభం నుంచి పూర్తయ్యేంత వరకు నేతల ప్రసంగాలు వింటూ వీరిద్దరు జనంలోనే  ఉండిపోయారు.
 
 నేడు నల్లగొండకు కేసీఆర్

 సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సోమవారం నల్లగొండకు వెళ్లనున్నారు. నల్లగొండలో జరిగే సభలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. 15న నిజామాబాద్‌లో, 16న వనపర్తి, మహబూబ్‌నగర్‌లోనూ ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement