పదకొండు జాతీయ, ప్రాంతీయ పార్టీలతో కూటమి
ఒక్కతాటిపైకి కాంగ్రెసేతర, బీజేపీయేతర పక్షాలు
కూటమిలో వామపక్షాలు, ఎస్పీ, జేడీయూ, బీజేడీ, అన్నాడీఎంకే
త్వరలో కార్యాచరణ ప్రణాళిక: శరద్ యాదవ్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జాతీయ స్థాయిలో యూపీఏ, ఎన్డీఏలకు ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటానికి చేతులు కలుపుతున్నట్టు 11 కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలు ప్రకటించాయి. ‘ప్రజానుకూల, మతవాద వ్యతిరేక, సమాఖ్య ఎజెండా’ సాధన కోసం తామంతా ఒక్కతాటిపైకి వస్తున్నట్టు బుధవారం ఢిల్లీలో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి మరీ పేర్కొన్నాయి. ప్రజా సమస్యలపై ఇకనుంచి పార్లమెంటులో సంయుక్తంగా గళమెత్తుతామంటూ కీలక ప్రకటన చేశాయి.
సమాజ్‌వాదీ, సీపీఐ, సీపీఎం, ఆరెస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, జేడీ(యూ), అన్నాడీఎంకే, అస్సాం గణపరిషత్, జార్ఖండ్ వికాస్ మోర్చా, జేడీ(ఎస్), బిజూ జనతాదళ్ పార్టీల నేతలు ఇందులో పాల్గొన్నారు. లోక్‌సభలో సంయుక్తంగా 92 స్థానాలున్న ఈ 11 జాతీయ, ప్రాంతీ పార్టీలు ఇలా ఒక్కతాటిపైకి రావడాన్ని కీలక పరిణామంగా పరిగణిస్తున్నారు. తమ లక్ష్యసాధనలో ఇది తొలి అడుగని జేడీయూ అధినేత శరద్ యాదవ్, సీపీఎం నేత సీతారాం ఏచూరి విలేకరుల సమావేశంలో ప్రకటించారు. రెండో దశలో ప్రజల జీవనోపాధి, అవినీతిపై పోరాటం, లౌకిక-ప్రజాస్వామిక పునాదులను పటిష్టపరచడం తదితర లక్ష్యాలతో సంయుక్త కార్యక్రమాలను ప్రారంభిస్తామన్నారు. తమ భావి కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
అందుకోసం త్వరలో సమావేశమవుతామని చెప్పారు. ఈశాన్య ప్రాంతాల వారి భద్రత, తమిళ జాలర్లు మొదలుకుని తుపాన్లు, తెలంగాణ దాకా అన్ని అంశాలతో కూడిన అజెండాను త్వరలో రూపొందిస్తామని ప్రకటించారు. దీన్ని మూడో ఫ్రంట్‌గా పరిగణించవచ్చా అని ప్రశ్నించగా, అలా సొంత అర్థాలు తీయొద్దని ఏచూరి బదులిచ్చారు. ప్రజా సమస్యలను పార్లమెంటు లో ప్రస్తావించడమే ప్రాథమికంగా తమ కూటమి లక్ష్యమన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఇచ్చిన పిలుపును ప్రస్తావించగా, ‘ఫలానా పార్టీతో, నాయకునితో సంప్రదింపుల్లో ఉన్నామంటూ ఎవరేం చెబుతున్నా అవన్నీ వారి మాటలు మాత్రమే. కానీ మేం మాత్రం అలా కాదు.
సమైక్యంగా మీడియా ముందుకొచ్చి మీ కళ్లముందే కూర్చున్నాం’ అని బదులిచ్చారు. విలేకరుల సమావేశంలో శరద్ యాదవ్, ఏచూరిలతో పాటు మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ (జేడీఎస్), డి.రాజా (సీపీఐ), రామ్‌గోపాల్ యాదవ్ (ఎస్పీ), వాసుదేవ్ ఆచార్య (సీపీఎం), ఎం.తంబిదురై (అన్నాడీఎంకే), కేసీ త్యాగి (జేడీయూ), జై పండా (బీజేడీ), బీరేన్ బైశ్య (ఏజీపీ), మనోహర్ తిర్కీ (ఆర్‌ఎస్‌పీ), బరుణ్ ముఖర్జీ (ఫార్వర్డ్ బ్లాక్) పాల్గొన్నారు. గతంలో పరస్పరం మోసగించుకున్న చరిత్ర ఉన్న పార్టీల కలయికతో ఏర్పడ్డ ఈ కొత్త కూటమి భవితవ్యం ఎలా ఉండవచ్చని ప్రశ్నిం చగా, చరిత్ర పునరావృతం కావాలని ఏమీ లేదు కదా అని సీపీఐ నేత గురుదాస్ దాస్ గుప్తా బదులిచ్చారు.
చర్చలకు అన్నాడీఎంకే ప్యానల్
రానున్న లోక్‌సభ ఎన్నికలకు సీట్ల సర్దుబాటు కోసం భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరిపేందుకు నలుగురు సభ్యుల ప్యానల్‌ను అన్నాడీఎంకే అధినేత్రి జె.జయలలిత ఏర్పాటు చేశారు. సీపీఐ, సీపీఎంతో పొత్తుంటుందని ఆమె ప్రకటించడం తెలిసిందే.
వ్యక్తులు కాదు... నితీశ్: 11 పార్టీల కొత్త కూటమిలో వ్యక్తులు ముఖ్యం కాదని బీహార్ సీఎం, జేడీయూ కీలక నేత నితీశ్‌కుమార్ అన్నారు. అంశాలకు, కార్యక్రమాలకే ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతామని చెప్పారు.
వృథా ప్రయాస: బీజేపీ
11 పార్టీల కూటమిని వ్యర్థ ప్రయాసగా బీజేపీ అభివర్ణించింది. ఇది లోక్‌సభ ఎన్నికలకు ముందు నిత్యం జరిగే తంతేనంటూ పెదవి విరిచింది. పెళ్లికి ముందు జరిగే తప్పనిసరి తంతు ఎలాంటిదో లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదీ అలాంటిదేనని బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ‘‘ప్రజల విశ్వాసం కోల్పోయిన వారి వృథా ప్రయత్నమిది. మూడో ఫ్రంట్ అన్నది గతించిన చరిత్రే’’ అన్నారు.
యూపీఏకు ఢోకా లేదు: కాంగ్రెస్
కొత్త కూటమి యత్నాలను కాంగ్రెస్ తేలిగ్గా కొట్టిపారేసింది. దానితో యూపీఏకు వచ్చిన ముప్పేమీ లేదని అభిప్రాయపడింది.
‘అవినీతి బిల్లుల’ను అడ్డుకుంటాం: సీపీఎం
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల్లో యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టజూస్తున్న ఆరు అవినీతి వ్యతిరేక బిల్లులు ఆమోదం పొందకుండా అడ్డుకుంటామని సీపీఎం నేత సీతారాం ఏచూరి ప్రకటించారు. అవే కాదని, ఏ బిల్లు కూడా గందరగోళం మధ్య ఆమోదం పొందకుండా ఉండేలా తమ 11 పార్టీలూ కృషి చేస్తాయని చెప్పారు. ‘లేదంటే ఈ బిల్లుల ఆమోదాన్ని పాలక కాంగ్రెస్ కూటమి తమ ఎన్నికల ప్రచారానికి ప్రారంభంగా వాడుకుంటుంది! మేమందుకు అనుమతించబోం’ అని స్పష్టం చేశారు. ‘‘నిజానికి ఆ బిల్లులను ఆమోదించాలని మేం చాలాకాలంగా కోరుతున్నాం. యూపీఏ దాన్ని పట్టించుకోకుండా, ఇప్పుడు ఎన్నికల వేళ నాటకాలాడుతోంది. వాటిపై కూలంకషంగా చర్చ జరగాలి. అందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత పాలక పక్షానిదే. కానీ తెలంగాణపై కాంగ్రె స్ ఎంపీలతో పాటు ఏకంగా మంత్రులు కూడా సభలో కార్యకలాపాలను అడ్డుకోవడాన్ని మనమంతా చూశాం’’ అన్నారు.
‘మూడు’ కోసం 11
Published Thu, Feb 6 2014 4:32 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement