‘మోడీ నిఘా’పై కమిషన్!
' 16వ తేదీ కంటే ముందే జడ్జిని నియమిస్తామన్న కేంద్రం
' మళ్లీ తెరపైకి ‘మహిళపై అక్రమ నిఘా’
' ఇది యూపీఏ దురహంకారానికి నిదర్శనమని బీజేపీ మండిపాటు
' తాము అధికారంలోకి రాగానే ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తామని స్పష్టీకరణ
సిమ్లా/న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ రెండు వారాల్లో ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు.. ‘స్నూప్‌గేట్’ ఉదంతాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. మహిళపై అక్రమ నిఘాకు సంబంధించిన ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు జ్యుడీషియల్ కమిషన్‌ను నియమిస్తామని ప్రకటించింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం ఓ మహిళపై అక్రమంగా నిఘా పెట్టిందంటూ ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో 16వ లోక్‌సభకు ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడే ఈనెల 16వ తేదీలోపే ఈ స్నూప్‌గేట్ ఉదంతంపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటుచేస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే శుక్రవారం ప్రకటించారు. ‘‘గుజరాత్‌లో ఓ మహిళపై అక్రమంగా నిఘా పెట్టిన వ్యవహారంలో విచారణ కమిషన్ నియమించాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. త్వరలోనే.. మే 16వ తేదీకి ముందుగానే ఈ కమిషన్‌కు జడ్జిని నియమిస్తాం’’ అని సిమ్లాలో విలేకరులకు తెలిపారు.
అయితే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో ఇది కోడ్ ఉల్లంఘన కిందకు రాదా అని విలేకరులు అడగ్గా.. రాదని జవాబిచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి చాలా ముందుగానే ఈ అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని షిండే వివరించారు. ‘ఓ మహిళపై గుజరాత్ సీఎం అక్రమంగా నిఘా పెట్టిన విధా నం చూసి చాలా ఆందోళనకు గురయ్యాను. ఒకవేళ ఆయన ప్రధాని అయితే ఈ దేశ మహిళల పరిస్థితి ఏమవుతుందో అని గాభరాపడ్డాను’ అని పేర్కొన్నారు. దీనిపై తీవ్రంగా స్పందిం చిన బీజేపీ.. త్వరలో అధికారం కోల్పోనున్న యూపీఏ దురంహకారానికి ఇది నిదర్శనమని దుయ్యబట్టింది.
బీజేపీ నేతలకు ఆందోళన ఎందుకు: సిబల్
స్నూప్‌గేట్ ఉదంతంపై జ్యుడీషియల్ కమిషన్ వేస్తామని ప్రకటిస్తే, బీజేపీ నేతలు ఎందుకు ఆందోళన చెందుతున్నారని కేంద్ర న్యాయ మంత్రి కపిల్ సిబల్ ప్రశ్నించారు. ఈ వ్యవహారానికి సంబంధించి మోడీ ప్రమేయంపై తమ వద్ద తగిన ఆధారాలున్నాయని, ఒకసారి కమిషన్ ఏర్పాటైతే ఆయన్ను రక్షించడం ఎవరి వల్లా కాదనే విషయం తెలియడంతోనే బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. మే 16కు ముందుగానే జడ్జిని నియమిస్తామని స్పష్టంచేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, జడ్జిని నియమించడం కోడ్‌ను ఉల్లంఘించడమే అన్న విపక్షాల వాదనను ఆయన కొట్టిపారేశారు. లోక్‌సభ ఎన్నికల కంటే చాలా ముందుగానే దర్యాప్తు కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నందున, ఇక్కడ కోడ్ ఉల్లంఘన ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. స్నూప్‌గేట్‌పై గుజరాత్ ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ ఏమి చేస్తోందని సిబల్ ప్రశ్నించారు.
అది అహంకారమే: బీజేపీ
స్నూప్‌గేట్ ఉదంతంపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న యూపీఏ నిర్ణయం.. దాని అహంకారానికి నిదర్శనమని బీజేపీ దుయ్యబట్టింది. ‘‘పది రోజుల తర్వాత గౌరవనీయులైన ఇద్దరు కేంద్ర మంత్రులు సహా మొత్తం కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోనుంది. అందుకే వారి అహంకారం ఇలా ఎంక్వైరీ కమిషన్ల రూపంలో కనిపిస్తోంది. గతంలో చాలామంది న్యాయమూర్తులు ఇందులో భాగస్వామి కావడానికి నిరాకరించారు. కాంగ్రెస్ దురుద్దేశాల ముందు న్యాయవ్యవస్థ పవిత్రత, గౌరవం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోదని భావిస్తున్నాను’’ అని బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.
దర్యాప్తునకు తాము భయపడబోమని, అయితే కమిషన్‌కు జడ్జిని నియమించే అంశంలో అధికార పార్టీ న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. స్నూప్‌గేట్‌పై యూపీఏ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని తదుపరి ప్రభుత్వం సమీక్షిస్తుందని బీజేపీ సీని యర్ నేత అరుణ్‌జైట్లీ తెలిపారు. యూపీఏ సర్కారు చివరి నిమిషంలో తీసుకున్న ఆమోదయోగ్యం కాని లేదా దురుద్దేశపూరిత నిర్ణయాలను తనకు ఉన్న అధికారాల మేరకు సమీక్షించే హక్కు కొత్త ప్రభుత్వానికి ఉంటుందని వెల్లడించారు. ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ కమిషన్‌కు జడ్జిని నియమిస్తూ కేంద్రం ప్రకటన చేస్తే, ఎన్నికల సంఘానికి ఫిర్యా దు చేస్తామని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి తెలిపారు.