ఎర్రకోటకు దారిది! | Prime minister post to be declared by Uttar pradesh | Sakshi
Sakshi News home page

ఎర్రకోటకు దారిది!

Published Wed, Apr 2 2014 1:19 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

ఎర్రకోటకు దారిది! - Sakshi

ఎర్రకోటకు దారిది!

‘ప్రధాని’ని నిర్ణయించేది యూపీనే...
ఎన్నికల బరిలో హేమాహేమీలు

 
ఎలక్షన్ సెల్: భారతదేశ రాజకీయాలకు గుండెకాయ ఉత్తరప్రదేశ్. ఢిల్లీ పీఠం దక్కాలంటే ముందు ఈ రాష్ర్టంపై పట్టు సాధించాల్సిందే! 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో అత్యధిక స్థానాలు సాధించగలిగితే కేంద్రంలో అధికార పీఠం చేరువవుతుంది. కాంగ్రెస్ అనధికార ప్రధాని అభ్యర్థి రాహుల్‌గాంధీ(అమేథీ), బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ (వారణాసి) ఇక్కడ్నుంచే బరిలో దిగడంతో యూపీ దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వీరితోపాటు సోనియాగాంధీ(రాయ్ బరేలీ), కేజ్రీవాల్ (వారణాసి), బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్(లక్నో) వంటి ఉద్దండులు కూడా ఈ రాష్ర్టం నుంచే పోటీలో ఉన్నారు. రాష్ర్టంలో బీజేపీ జోరుమీద ఉండగా.. ఆర్‌ఎల్డీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ ఎన్నికల గోదాలోకి దూకింది.
 
 బీజేపీ
 రాష్ర్టంలో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీల ప్రధాన ప్రత్యర్థి బీజేపీనే! మోడీ మ్యాజిక్‌తో ఈసారి 1998 నాటి కన్నా ఎక్కువ స్థానాల్లో గెలుస్తామన్న విశ్వాసంతో బీజేపీ ఉంది. 1998 నాటికి ఉత్తరాఖండ్ ఏర్పడలేదు కనుక అప్పుడు యూపీలోని మొత్తం లోక్‌సభ స్థానాలు 85. వాటిలో బీజేపీ 58 స్థానాల్లో గెలుపొందింది.
 
 అయితే, అంతర్గత కలహాలే బీజేపీకి అవరోధంగా నిలుస్తున్నాయి. ‘మా శత్రువు బయటెక్కడో లేడు.. మాలోనే ఉన్నాడ’ంటూ బీజేపీ సీనియర్ నేత ఒకరు ఇటీవల వాపోయారు. టికెట్ల కేటాయింపు సందర్భంగా నేతల మధ్య విభేదాలు స్పష్టంగా బహిర్గతమయ్యాయి. జాతీయ స్థాయి సీనియర్ నేతలు కొందరు మోడీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటం పార్టీని దెబ్బతీస్తుందన్న వాదన పార్టీలో వినిపిస్తోంది.
 
 సంప్రదాయంగా బీజేపీకి మద్దతిస్తూ వచ్చిన బ్రాహ్మణులు.. ఈ ఎన్నికల్లో తమ వర్గం వారికి తక్కువ సంఖ్యలో టికెట్లు ఇవ్వడంపై గుర్రుగా ఉన్నారు. రాజ్‌నాథ్‌సింగ్ వల్ల రాజ్‌పుత్‌లకు అత్యధిక ప్రాతినిధ్యం ఇచ్చారని వారు ఆరోపిస్తున్నారు. బీజేపీకి తక్కువ సీట్లు వస్తే, ప్రధానిగా అందరికీ ఆమోదయోగ్యుడైన అభ్యర్థిగా తనకు అవకాశం లభిస్తుందన్న దూరాలోచనలో రాజ్‌నాథ్‌సింగ్ ఉన్నారని, అందువల్లే పార్టీ తరఫున ముస్లింలకు క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధపడ్డారని వారు వాదిస్తున్నారు. తూర్పు యూపీలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో 20 శాతానికి పైగా బ్రాహ్మణులున్నారు.

2004తో పోలిస్తే 2009 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల ఓట్ల శాతంలో మార్పు ఇదీ..
యూపీఏ ప్రభుత్వంపై వ్యతిరేకత, ఆ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు, రాష్ట్రంలోని ఎస్పీ ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత, ముజఫర్‌నగర్ అల్లర్లు.. బీజేపీకి సానుకూలాంశాలు.
 వీటన్నింటికన్నా మోడీ ప్రభావం, మోడీ అభివృద్ధి ఎజెండా, ఆయనకు గల హిందూ మత రక్షకుడన్న ఇమేజ్.. ఇవే యూపీలో బీజేపీకి ఓట్లను రాల్చే మంత్రాలు.
 
 ఎస్పీ.. బీఎస్పీ
 ఈ పోల్ రేస్‌లో 2వ స్థానం కోసం పోటీపడుతున్న పార్టీలు ఎస్పీ, బీఎస్పీ. ఈ రెండింటిలోనూ రాష్ర్టంలో పాలకపక్షం ఎస్పీ కన్నా బీఎస్పీ ముందంజలో ఉంది.
 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సమాజ్‌వాదీ పార్టీ.. పాలనా వైఫల్యంతో ప్రజా మద్దతు భారీగా కోల్పోయింది.
 అఖిలేశ్ యాదవ్ పాలనలో అధికార కేంద్రాల సంఖ్య పెరిగింది. ములాయంసింగ్ యాదవ్, శివ్‌పాల్ యాదవ్, రామ్‌గోపాల్ యాదవ్, ఆజంఖాన్ ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకుంటున్నారు.
 ముజఫర్‌నగర్ అల్లర్లతో ముస్లింలు కూడా ఎస్పీకి దూరమయ్యారు. మొత్తానికి యాదవ్‌ల ఓటుబ్యాంకుపైనే ఎస్పీ ఆశలు పెట్టుకుంది.
 2012 అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి తేరుకోని బీఎస్పీ.. ఈ ఎన్నికల కోసం పకడ్బందీగానే సిద్ధమవుతోంది. దళిత, ముస్లిం ఓట్లే లక్ష్యంగా పావులు కదుపుతోంది.
 ముజఫర్‌నగర్ అల్లర్ల నేపథ్యంలో యూపీ ముస్లింలు.. బీజేపీని ఎదుర్కోగల సరైన ప్రత్యర్థి బీఎస్పీనేనని నమ్ముతున్నారని మాయావతి విశ్వసిస్తున్నారు.
 యాదవ్, ముస్లిం, దళిత వర్గాల్లో.. ఏ రెండు వర్గాలు ఎస్పీ, బీఎస్పీల్లో ఏ పార్టీకి మద్దతిస్తాయో ఆ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచే పరిస్థితి కనిపిస్తోంది.
 
 కాంగ్రెస్
 రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతినేది కాంగ్రెస్ పార్టీనే అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. యూపీఏ హయాంలోని కుంభకోణాలు కాంగ్రెస్‌పై తీవ్ర ప్రభావం చూపించనున్నాయి. కాంగ్రెస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. కాంగ్రెస్ కన్నా దానితో పొత్తు పెట్టుకున్న అజిత్‌సింగ్ పార్టీ ఆరెల్డీకే ఎక్కువ స్థానాలొచ్చే పరిస్థితి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
 రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలు పోటీలో ఉన్న అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాలను మినహాయిస్తే.. మిగతా స్థానాల్లో గెలుపు కోసం కాంగ్రెస్ చెమటోడ్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రాహుల్‌గాంధీపై అభిమానం ఉన్నా, అది ఓట్లుగా రూపాంతరం చెందడం ప్రశ్నార్థకమే అని భావిస్తున్నారు.
 గత ఎన్నికల్లో 22 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఈ సారి పట్టుమని పది సీట్లయినా గెలుచుకోలేదని పరిశీలకుల అంచనా. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న పార్టీ అధిష్టానం సినీ గ్లామర్, క్రీడలను నమ్ముకుంటోంది. అందుకే నగ్మా, రాజ్‌బబ్బర్, రవికిషన్ లాంటి సినీ తారలను, మహ్మద్ కైఫ్‌లాంటి క్రికెటర్లను ఎన్నికల బరిలోకి దింపింది.
 కాంగ్రెస్‌తో పోలిస్తే.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న ఆరెల్డీ ప్రజాభిమానం పొందడంలో  ముందంజలో ఉంది. బీజేపీకి తరలిపోతున్న తమ జాట్ ఓటుబ్యాంకును ఆరెల్డీ అధినేత అజిత్ సింగ్... జాట్లకు రిజర్వేషన్లు అంటూ తిరిగి తనవైపు తిప్పుకున్నారు.
 పశ్చిమ యూపీలో పట్టున్న నేత రాకేశ్ తికాయత్‌ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆ ప్రాంతంలో ఆరెల్డీ ప్రాబల్యం పెరిగింది. 8 స్థానాల్లో ఆరెల్డీ పోటీలో ఉంది.  మొత్తంమీద ఈ పోల్ రేస్‌లో కాంగ్రెస్ చివరిస్థానంలో ఉంది.
 
  ఉత్తరప్రదేశ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement