మూడు ముక్కలాట | fighting triangular in Bihar | Sakshi
Sakshi News home page

మూడు ముక్కలాట

Published Fri, Apr 18 2014 1:44 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

మూడు ముక్కలాట - Sakshi

మూడు ముక్కలాట

బీహార్‌లో త్రిముఖ పోరు  
అభివృద్ధిపై నితీశ్, మోడీపై బీజేపీ, ‘చే’యూతపై లాలూ ఆశలు

ఎలక్షన్ డెస్క్: నిరంతర రాజకీయ చైతన్యానికి ఎంతగా పేరు పొందిందో, అరాచకానికీ అంతే పేరు పొందిన రాష్ట్రం బీహార్. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన జయప్రకాశ్ నారాయణ్ బీహారీలే. బీహార్‌లో నేటి తరానికి చెందిన ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్, ఎల్జేపీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్, జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ జాతీయ రాజకీయాల్లోనూ తమ ప్రభావం చూపుతున్నారు.

వెనుకబడిన ‘బీమారు’ (బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్) రాష్ట్రాల్లో ఒకటైన బీహార్, 2005లో నితీశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ప్రగతిమార్గం పట్టింది. నితీశ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా 2009 లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ రాష్ట్రంలోని 40 సీట్లకు గాను 20 గెలుచుకోగలిగింది. 2004 నాటి ఎన్నికల్లో ఆ పార్టీ గెలుచుకున్నది ఆరు సీట్లే. అయితే, ప్రస్తుతం పరిస్థితి మారింది. గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో నితీశ్ ఎన్డీఏతో తెగతెంపులు చేసుకున్నారు.
 
మోడీ ప్రచారం బీహార్‌పైనా ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో పరిస్థితి నితీశ్‌కు వ్యతిరేకంగా పరిణమించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ‘జబ్ తక్ సమోసా మే రహేగా ఆలూ... తబ్ తక్ బీహార్ మే రహేగా లాలూ’ అంటూ సగర్వంగా ప్రకటించుకున్న ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ పునర్వైభవాన్ని సాధించేందుకు విఫలయత్నాలు చేస్తున్నారు. దాణా కేసులో దోషిగా తేలిన నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఆయన పరువు మంటగలిసింది. అయితే, కాంగ్రెస్‌తో చేతులు కలిపి ‘లౌకిక’ నినాదంతో మోడీపై విమర్శలు గుప్పిస్తూ, ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్జేడీతో పొత్తు తమకూ లాభసాటిగానే ఉంటుందని కాంగ్రెస్ నాయకత్వం కూడా భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో నితీశ్ సీపీఐతో పొత్తు పెట్టుకోగా, పాశ్వాన్ ఎన్డీఏ గూటికి చేరారు.
 
ఇప్పటికే 13 స్థానాలకు పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే, బీహార్‌లో బీజేపీనే ఎక్కువగా లాభపడేలా కనిపిస్తోంది. నితీశ్ సర్కారుపై 63శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నా, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం జేడీయూకి ఓటేయబోమని చెబుతున్నారు. మోడీ ప్రభావంతో ఆ ఓట్లన్నీ తమకే పడతాయని బీజేపీ ఆశలు పెట్టుకుంటోంది. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలుతాయనే అంచనాతో కూడా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌కు మరో ప్రత్యేకత ఉంది. దేశమంతా ఓటింగు తీరు ఒకలా ఉంటే, బీహార్‌లో మాత్రం మరోలా ఉంటుం ది. 1989 నుంచి దేశవ్యాప్తంగా మద్దతు లభించిన పార్టీకి బీహార్‌లో చుక్కెదురవుతూ వచ్చింది. ఈసారి ఆ తీరు మారి, బీహార్‌లోనూ తమకే అత్యధిక స్థానాలు లభిస్తాయని బీజేపీ ఆశిస్తోంది.
 
బీహార్ అనగానే ఇదివరకు ఠక్కున గుర్తొచ్చే పేరు లాలూప్రసాద్ యాదవ్. కానీ ఇప్పుడు ఆయన చరిష్మా కనుమరుగవుతోంది. ఒకవైపు దాణా స్కామ్‌లో దోషిగా తేలి జైలుకెళ్లడం.. మరోవైపు అభివృద్ధి ఎజెండాతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దూసుకెళ్తుండటం.. లాలూని, ఆయన పార్టీ ఆర్జేడీని కలవరపరుస్తున్నాయి.
 
బీహార్ అంటే ఇప్పుడు గుర్తొచ్చే పేరు నితీశ్ కుమార్. 2005లో సీఎంగా పగ్గాలు స్వీకరించి, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. అవినీతిపై ఉక్కుపాదం మోపారు. అవినీతిపరుల ఆస్తులను ప్రభుత్వ పాఠశాలల పరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏకు దూరమైనా సొంత ఇమేజ్‌తో ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తాననే విశ్వాసంతో ఉన్నారు.

 
హజీపూర్ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 7 సార్లు గెలుపొందిన రామ్ విలాస్ పాశ్వాన్.. 2009లో మాత్రం ఓడిపోయారు. 2000లో జేడీయూ నుంచి విడిపోయి ఎల్‌జేపీ స్థాపించారు. 2004లో 4 సీట్లలో గెలుపొందిన ఈ పార్టీ.. 2009లో ఒక్క స్థానంలోనూ గెలవలేదు. ఈసారి హజీపూర్ నుంచి పాశ్వాన్, జమూయ్ నుంచి ఆయన తనయుడు చిరాగ్ పాశ్వాన్ బరిలో ఉన్నారు.
 
 పార్టీల బలాబలాలు

 జేడీ(యూ)
 బలాలు: ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యక్తిత్వం, ఆయన పాలనలో సాధించిన అభివృద్ధి.
 కుర్మి, కోయెరీ, ఈబీసీ, మహాదళితుల ఓట్లు
 సవాళ్లు: ఈబీసీల ఓట్లు బీజేపీకి పడకుండా చూసుకోవడం.
 మోడీ ప్రభావాన్ని తగ్గించడం. ముస్లింల ఓట్లు సాధించడం.
 
 బీజేపీ
బలాలు: హిందూ ఓట్లు(మోడీ సభ సందర్భంగా పాట్నాలో బాంబు పేలుళ్ల అనంతరం హిందువులు భారీగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న వార్తల నేపథ్యంలో). ఠమోడీ ప్రభావం. బీజేపీ వ్యతిరేక ఓట్లలో చీలిక.

కొత్తగా ఎల్జేపీతో పొత్తు

 సవాళ్లు:
యువ ఓట్ల సమీకరణ.
ఈబీసీలను బీజేపీ వైపుకు ఆకర్షించడం
కాంగ్రెస్
బలం: ఆర్జేడీతో కలిసి పోటీ చేయడం
సవాలు: బలంగా లేని పార్టీ కేడర్
 
ఆర్జేడీ
బలాలు: కాంగ్రెస్‌తో పొత్తు. ఠలాలూను అన్యాయంగా బలి చేశారన్న బలహీన వర్గాల్లోని నమ్మకం.
సవాలు: లాలూ అవినీతి నేపథ్యం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement