Jaiprakash Narayan
-
పోలీసు కార్యాలయం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం
న్యూఢిల్లీ: పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద 45 ఏళ్ల మహిళ సోమవారం ఆత్మహత్యా యత్నం చేసింది. బాధితురాలి తన శరీరంపై సత్వరమే దగ్ధమయ్యే ఇంధనం పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో ఆమె శరీరం 50 శాతం మేర కాలిపోయింది. దీంతో క్షతగాత్రురాలిని సమీపంలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సాయంత్రం 4.15 నిమిషాల సమయంలో దక్షిణ ఢిల్లీలో చోటుచేసుకుంది. ఫిర్యాదు ఇచ్చేందుకు తన కుమార్తెతో సహా ఇక్కడికి వచ్చిందని, అంతలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని పోలీసులు చెప్పారు. క్షతగాత్రురాలు కోలుకున్న తర్వాత వాంగ్మూలం నమోదు చేస్తామన్నారు. -
మూడు ముక్కలాట
బీహార్‌లో త్రిముఖ పోరు అభివృద్ధిపై నితీశ్, మోడీపై బీజేపీ, ‘చే’యూతపై లాలూ ఆశలు ఎలక్షన్ డెస్క్: నిరంతర రాజకీయ చైతన్యానికి ఎంతగా పేరు పొందిందో, అరాచకానికీ అంతే పేరు పొందిన రాష్ట్రం బీహార్. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన జయప్రకాశ్ నారాయణ్ బీహారీలే. బీహార్‌లో నేటి తరానికి చెందిన ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్, ఎల్జేపీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్, జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ జాతీయ రాజకీయాల్లోనూ తమ ప్రభావం చూపుతున్నారు. వెనుకబడిన ‘బీమారు’ (బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్) రాష్ట్రాల్లో ఒకటైన బీహార్, 2005లో నితీశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ప్రగతిమార్గం పట్టింది. నితీశ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా 2009 లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ రాష్ట్రంలోని 40 సీట్లకు గాను 20 గెలుచుకోగలిగింది. 2004 నాటి ఎన్నికల్లో ఆ పార్టీ గెలుచుకున్నది ఆరు సీట్లే. అయితే, ప్రస్తుతం పరిస్థితి మారింది. గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో నితీశ్ ఎన్డీఏతో తెగతెంపులు చేసుకున్నారు. మోడీ ప్రచారం బీహార్‌పైనా ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో పరిస్థితి నితీశ్‌కు వ్యతిరేకంగా పరిణమించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ‘జబ్ తక్ సమోసా మే రహేగా ఆలూ... తబ్ తక్ బీహార్ మే రహేగా లాలూ’ అంటూ సగర్వంగా ప్రకటించుకున్న ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ పునర్వైభవాన్ని సాధించేందుకు విఫలయత్నాలు చేస్తున్నారు. దాణా కేసులో దోషిగా తేలిన నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఆయన పరువు మంటగలిసింది. అయితే, కాంగ్రెస్‌తో చేతులు కలిపి ‘లౌకిక’ నినాదంతో మోడీపై విమర్శలు గుప్పిస్తూ, ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్జేడీతో పొత్తు తమకూ లాభసాటిగానే ఉంటుందని కాంగ్రెస్ నాయకత్వం కూడా భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో నితీశ్ సీపీఐతో పొత్తు పెట్టుకోగా, పాశ్వాన్ ఎన్డీఏ గూటికి చేరారు. ఇప్పటికే 13 స్థానాలకు పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే, బీహార్‌లో బీజేపీనే ఎక్కువగా లాభపడేలా కనిపిస్తోంది. నితీశ్ సర్కారుపై 63శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నా, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం జేడీయూకి ఓటేయబోమని చెబుతున్నారు. మోడీ ప్రభావంతో ఆ ఓట్లన్నీ తమకే పడతాయని బీజేపీ ఆశలు పెట్టుకుంటోంది. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలుతాయనే అంచనాతో కూడా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌కు మరో ప్రత్యేకత ఉంది. దేశమంతా ఓటింగు తీరు ఒకలా ఉంటే, బీహార్‌లో మాత్రం మరోలా ఉంటుం ది. 1989 నుంచి దేశవ్యాప్తంగా మద్దతు లభించిన పార్టీకి బీహార్‌లో చుక్కెదురవుతూ వచ్చింది. ఈసారి ఆ తీరు మారి, బీహార్‌లోనూ తమకే అత్యధిక స్థానాలు లభిస్తాయని బీజేపీ ఆశిస్తోంది. బీహార్ అనగానే ఇదివరకు ఠక్కున గుర్తొచ్చే పేరు లాలూప్రసాద్ యాదవ్. కానీ ఇప్పుడు ఆయన చరిష్మా కనుమరుగవుతోంది. ఒకవైపు దాణా స్కామ్‌లో దోషిగా తేలి జైలుకెళ్లడం.. మరోవైపు అభివృద్ధి ఎజెండాతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దూసుకెళ్తుండటం.. లాలూని, ఆయన పార్టీ ఆర్జేడీని కలవరపరుస్తున్నాయి. బీహార్ అంటే ఇప్పుడు గుర్తొచ్చే పేరు నితీశ్ కుమార్. 2005లో సీఎంగా పగ్గాలు స్వీకరించి, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. అవినీతిపై ఉక్కుపాదం మోపారు. అవినీతిపరుల ఆస్తులను ప్రభుత్వ పాఠశాలల పరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏకు దూరమైనా సొంత ఇమేజ్‌తో ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తాననే విశ్వాసంతో ఉన్నారు. హజీపూర్ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 7 సార్లు గెలుపొందిన రామ్ విలాస్ పాశ్వాన్.. 2009లో మాత్రం ఓడిపోయారు. 2000లో జేడీయూ నుంచి విడిపోయి ఎల్జేపీ స్థాపించారు. 2004లో 4 సీట్లలో గెలుపొందిన ఈ పార్టీ.. 2009లో ఒక్క స్థానంలోనూ గెలవలేదు. ఈసారి హజీపూర్ నుంచి పాశ్వాన్, జమూయ్ నుంచి ఆయన తనయుడు చిరాగ్ పాశ్వాన్ బరిలో ఉన్నారు. పార్టీల బలాబలాలు జేడీ(యూ) బలాలు: ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యక్తిత్వం, ఆయన పాలనలో సాధించిన అభివృద్ధి. కుర్మి, కోయెరీ, ఈబీసీ, మహాదళితుల ఓట్లు సవాళ్లు: ఈబీసీల ఓట్లు బీజేపీకి పడకుండా చూసుకోవడం. మోడీ ప్రభావాన్ని తగ్గించడం. ముస్లింల ఓట్లు సాధించడం. బీజేపీ బలాలు: హిందూ ఓట్లు(మోడీ సభ సందర్భంగా పాట్నాలో బాంబు పేలుళ్ల అనంతరం హిందువులు భారీగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న వార్తల నేపథ్యంలో). ఠమోడీ ప్రభావం. బీజేపీ వ్యతిరేక ఓట్లలో చీలిక. కొత్తగా ఎల్జేపీతో పొత్తు సవాళ్లు: యువ ఓట్ల సమీకరణ. ఈబీసీలను బీజేపీ వైపుకు ఆకర్షించడం కాంగ్రెస్ బలం: ఆర్జేడీతో కలిసి పోటీ చేయడం సవాలు: బలంగా లేని పార్టీ కేడర్ ఆర్జేడీ బలాలు: కాంగ్రెస్‌తో పొత్తు. ఠలాలూను అన్యాయంగా బలి చేశారన్న బలహీన వర్గాల్లోని నమ్మకం. సవాలు: లాలూ అవినీతి నేపథ్యం -
బాబ్బాబు.. జర కలుపుకోరా!
* టీడీపీ, బీజేపీల పొత్తుకోసం లోక్‌సత్తా తహతహ * ఒక లోక్‌సభ, 8 అసెంబ్లీ సీట్లివ్వాలని కోరిక సాక్షి, హైదరాబాద్: ‘ఆటగాళ్లు మారితే ప్రయోజనం ఉండదు. ఆట నియమం మారాలి’ అంటూ కొత్త నినాదంతో, సరికొత్త రాజకీయాలకు తెరలెత్తిన మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ(జేపీ) నేతృత్వంలోని లోక్‌సత్తా పార్టీ ఇప్పుడు మిగతా పార్టీల మాదిరిగానే పాత రాజకీయాలనే ఒంటబట్టించుకుంది!. సిద్ధాంతాలు ఎలా ఉన్నప్పటికీ, ప్రస్తుత ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే బరిలోకి దిగాలని లోక్‌సత్తా అధినాయకత్వం స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత జేపీ తాజాగా సీట్ల వేటలో పడ్డారు. బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు కుదిరితే తమకూ కొంత చోటివ్వాలంటూ ఈ రెండు పార్టీల నేతలతో ఆయన సంప్రదింపులు మొదలు పెట్టారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో కలిపి ఒక లోక్‌సభ, 8 అసెంబ్లీ సీట్లిస్తే చాలంటున్నారు. ఒక వేళ ఆయా పార్టీలు లోక్‌సత్తాతో పొత్తుకు పచ్చజెండా ఊపినట్టయితే, అసెంబ్లీ స్థానాల్లో తాము కోరుకుంటున్న వాటిలో సగం అంటే నాలుగిచ్చినా చాలని సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో జేపీ గురువారం ఇరు పార్టీల నేతలతో మంతనాలు జరిపినట్టు సమాచారం. 2009 ఎన్నికల్లో లోక్‌సత్తా పార్టీ అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ బరిలోదిగి 1.76 శాతం ఓట్లతో ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే లోక్‌సభకు 33 స్థానాల్లో పోటీ చేసి సీట్లు గెలవకపోయినా ఒక శాతం ఓట్లు సాధించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తమకు సీట్లు కేటాయించాలని బీజేపీ, టీడీపీలను అడుగుతోంది. అయితే తొలుత బీజేపీ, టీడీపీల మధ్య సీట్ల సర్దుబాటు అయ్యాక చూద్దామని చెప్పినట్టు తెలిసింది. బీజే పీకి ప్రత్యేక నివేదిక! పొత్తు కోసం బీజేపీని ఒప్పించే క్రమంలో ప్రత్యేకంగా రూపొందించిన నివేదికను బీజేపీ జాతీయనేత ప్రకాష్ జవదేకర్‌కు లోక్‌సత్తా అందజేసినట్టు తెలిసింది. లోక్‌సత్తాను కలుపుకోవడం వల్ల ఇరు ప్రాంతాల్లోనూ టీడీపీతో పాటు బీజేపీకి కలిగే లాభాన్ని ప్రస్తావించినట్టు పార్టీ వర్గాల సమాచారం. నగర, పట్టణ ప్రాంతాల్లో లోక్‌సత్తాకు క్యాడర్ ఉందని, ముఖ్యంగా విద్యార్థులు, యువకుల్లో పార్టీ పట్ల అభిమానం ఉందని ప్రస్తావించారు. కనుక తమ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి యువతలో ఉన్న క్రేజ్ మరింత రెట్టింపవుతుందని వివరించినట్టు తెలిసింది. -
విలపించిన మోత్కుపల్లి
రాజ్యసభ సీటు ఇస్తానని చంద్రబాబు మోసం చేశారని ఆరోపణ సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ సీటు ఆశించిన టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు బాధను దిగమింగుకోలేక బుధవారం శాసన సభ లాబీల్లో సహచర నేతల వద్ద బోరున విలపించారు. పార్టీ అధినేత చంద్రబాబు తనను మోసం చేశారని ఆరోపించారు. ‘‘నేను అడగకపోయినా, రాజ్యసభ సీటు ఇస్తానని అధినేతే వంద సార్లు హామీ ఇచ్చారు. రాజ్యసభకు వెళ్తానన్న ఆశతో నియోజకవర్గంలో తిరగకుండా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కే పరిమితమయ్యా. చివరకు చేయిచ్చారన్నా. అభ్యర్ధుల ఎంపిక సమయంలో నాతో చర్చించనే లేదు. నేను అక్కడ ఉండగానే అభ్యర్థుల పేర్లు టీవీ ఛానళ్లలో వచ్చాయి. దళితుడిని కాబట్టే నన్ను అవమానించారు. అదే స్థితిమంతుడినైతే ఇలా చేసేవారా’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. బాధను దింగమింగుకోలేక బోరున విలపించారు. అంతటి సీనియర్ నేత తమ ముందు విలపించటంతో ఎర్రబెల్లి, రమణ, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అవాక్కయ్యారు. ఆ వెంటనే తేరుకున్న ఎర్రబెల్లి ఆయన్ని అనునయించారు. లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ్ (జేపీ), టీడీపీ నేత మండవ వెంకటేశ్వరరావు తదితరులు కూడా మోత్కుపల్లిని ఓదార్చారు. -
విభజనపై సమాచారం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సంబంధించి తెలుగుదేశం ఎమ్మెల్యేలు, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్‌ను అడిగి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆ వివరాలను శుక్రవారం అసెంబ్లీ, మండలిలో సభ్యులకు పంపిణీ చేయనున్నారు. జిల్లాల వారీగా ఏ జిల్లా ట్రెజరీ నుంచి ఎంత ఆదాయం వస్తోంది? ఏ జిల్లా ట్రెజరీ నుంచి ఎంత వ్యయం చేస్తున్నారు? ఉద్యోగులు, పెన్షనర్ల సంఖ్యతో పాటు గత మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆదాయ, వ్యయాల సమాచారాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. బిల్లులోని షెడ్యూల్స్‌లో పేర్కొనని సమాచారాన్ని కూడా శాఖల వారీగా రెడీ చేసింది. గురువారం రాత్రి పొద్దుపోయే వరకు సచివాలయంలోని బి బ్లాక్‌లో ఫొటోకాపీ(జిరాక్స్)లను తీశారు. మండలి, శాసనసభల్లోని అందరు సభ్యులకు అందజేయడానికి వీలుగా 400 ప్రతులను తయారు చేశారు. ఈ సమాచారం ఆధారంగా సీమాంధ్ర టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు విభజన బిల్లుకు సవరణలను ప్రతిపాదించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.