విలపించిన మోత్కుపల్లి
రాజ్యసభ సీటు ఇస్తానని చంద్రబాబు మోసం చేశారని ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ సీటు ఆశించిన టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు బాధను దిగమింగుకోలేక బుధవారం శాసన సభ లాబీల్లో సహచర నేతల వద్ద బోరున విలపించారు. పార్టీ అధినేత చంద్రబాబు తనను మోసం చేశారని ఆరోపించారు. ‘‘నేను అడగకపోయినా, రాజ్యసభ సీటు ఇస్తానని అధినేతే వంద సార్లు హామీ ఇచ్చారు. రాజ్యసభకు వెళ్తానన్న ఆశతో నియోజకవర్గంలో తిరగకుండా హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ భవన్‌కే పరిమితమయ్యా. చివరకు చేయిచ్చారన్నా.
అభ్యర్ధుల ఎంపిక సమయంలో నాతో చర్చించనే లేదు. నేను అక్కడ ఉండగానే అభ్యర్థుల పేర్లు టీవీ ఛానళ్లలో వచ్చాయి. దళితుడిని కాబట్టే నన్ను అవమానించారు. అదే స్థితిమంతుడినైతే ఇలా చేసేవారా’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. బాధను దింగమింగుకోలేక బోరున విలపించారు. అంతటి సీనియర్ నేత తమ ముందు విలపించటంతో ఎర్రబెల్లి, రమణ, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అవాక్కయ్యారు. ఆ వెంటనే తేరుకున్న ఎర్రబెల్లి ఆయన్ని అనునయించారు. లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ్ (జేపీ), టీడీపీ నేత మండవ వెంకటేశ్వరరావు తదితరులు కూడా మోత్కుపల్లిని ఓదార్చారు.