బాబ్బాబు.. జర కలుపుకోరా!
* టీడీపీ, బీజేపీల పొత్తుకోసం లోక్‌సత్తా తహతహ
* ఒక లోక్‌సభ, 8 అసెంబ్లీ సీట్లివ్వాలని కోరిక
సాక్షి, హైదరాబాద్: ‘ఆటగాళ్లు మారితే ప్రయోజనం ఉండదు. ఆట నియమం మారాలి’ అంటూ కొత్త నినాదంతో, సరికొత్త రాజకీయాలకు తెరలెత్తిన మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ(జేపీ) నేతృత్వంలోని లోక్‌సత్తా పార్టీ ఇప్పుడు మిగతా పార్టీల మాదిరిగానే పాత రాజకీయాలనే ఒంటబట్టించుకుంది!. సిద్ధాంతాలు ఎలా ఉన్నప్పటికీ, ప్రస్తుత ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే బరిలోకి దిగాలని లోక్‌సత్తా అధినాయకత్వం స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత జేపీ తాజాగా సీట్ల వేటలో పడ్డారు. బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు కుదిరితే తమకూ కొంత చోటివ్వాలంటూ ఈ రెండు పార్టీల నేతలతో ఆయన సంప్రదింపులు మొదలు పెట్టారు.
తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో కలిపి ఒక లోక్‌సభ, 8 అసెంబ్లీ సీట్లిస్తే చాలంటున్నారు. ఒక వేళ ఆయా పార్టీలు లోక్‌సత్తాతో పొత్తుకు పచ్చజెండా ఊపినట్టయితే, అసెంబ్లీ స్థానాల్లో తాము కోరుకుంటున్న వాటిలో సగం అంటే నాలుగిచ్చినా చాలని సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో జేపీ గురువారం ఇరు పార్టీల నేతలతో మంతనాలు జరిపినట్టు సమాచారం. 2009 ఎన్నికల్లో లోక్‌సత్తా పార్టీ అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ బరిలోదిగి 1.76 శాతం ఓట్లతో ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే లోక్‌సభకు 33 స్థానాల్లో పోటీ చేసి సీట్లు గెలవకపోయినా ఒక శాతం ఓట్లు సాధించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తమకు సీట్లు కేటాయించాలని బీజేపీ, టీడీపీలను అడుగుతోంది. అయితే తొలుత బీజేపీ, టీడీపీల మధ్య సీట్ల సర్దుబాటు అయ్యాక చూద్దామని చెప్పినట్టు తెలిసింది.
బీజే పీకి ప్రత్యేక నివేదిక!
పొత్తు కోసం బీజేపీని ఒప్పించే క్రమంలో ప్రత్యేకంగా రూపొందించిన నివేదికను బీజేపీ జాతీయనేత ప్రకాష్ జవదేకర్‌కు లోక్‌సత్తా అందజేసినట్టు తెలిసింది. లోక్‌సత్తాను కలుపుకోవడం వల్ల ఇరు ప్రాంతాల్లోనూ టీడీపీతో పాటు బీజేపీకి కలిగే లాభాన్ని ప్రస్తావించినట్టు పార్టీ వర్గాల సమాచారం. నగర, పట్టణ ప్రాంతాల్లో లోక్‌సత్తాకు క్యాడర్ ఉందని, ముఖ్యంగా విద్యార్థులు, యువకుల్లో పార్టీ పట్ల అభిమానం ఉందని ప్రస్తావించారు. కనుక తమ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి యువతలో ఉన్న క్రేజ్ మరింత రెట్టింపవుతుందని వివరించినట్టు తెలిసింది.