బీహార్‌లో ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే. ఆయనకిద్దరు భార్యలు. వారిద్దరిదీ చెరో పార్టీ. ఈ విడ్డూరం ఖగారియా నియోజకవర్గంలో అందరినీ ఆకర్షిస్తోంది. మాజీ ఎమ్మెల్యే రణబీర్ యాదవ్ మొదటి భార్య పూనమ్ జేడీయూ ఎమ్మెల్యే. రెండో భార్య కృష్ణకుమారి ప్రస్తుతం ఆర్జేడీ టికెట్టుపై ఖగారియా నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పూనమ్, కృష్ణకుమారి సొంత అక్కచెల్లెళ్లే. చెల్లెలితో పాటు పూనమ్ కూడా ఊరూరా తిరుగుతూ ఆమె గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు.
ఫలితంగా జేడీయూ నేతల ఆగ్రహానికి కారణమై, సస్పెన్షన్‌కు గురయ్యారు. తన అక్క జేడీయూ ఎమ్మెల్యే అయినా, ఖగారియా ప్రజల మేలుకోరి తన గెలుపు కోసం ప్రచారంలో పాల్గొంటున్నారని కృష్ణకుమారి చెబుతున్నారు. ఈ అక్కచెల్లెళ్లిద్దరి భర్త రణబీర్ 1990, 1995 అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి నెగ్గారు. ఈ ఎన్నికల్లో తన రెండో భార్యను కూడా జేడీయూ తరఫునే బరిలోకి దించాలనుకున్నారు. అయితే, ఆమెకు టికెట్టు ఇచ్చేందుకు నితీశ్ నిరాకరించడంతో, లాలూను ఆశ్రయించి ఆర్జేడీ టికెట్టు సాధించుకున్నారు.