
న్యూఢిల్లీ : కేంద్రంలో బీజేపీ వ్యతిరేకంగా ఏకమయ్యేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. 2019 ఎన్నికల నాటికి బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కసరత్తు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం రాత్రి ఢిల్లీకి వచ్చారు. ఈరోజు రాత్రి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద పవార్ ఏర్పాటు చేసిన విందుకు ఆమె హాజరవుతారు.
మమతా బెనర్జీ మంగళవారం మధ్యాహ్నం పార్లమెంటుకు వచ్చి పలువురు ప్రతిపక్ష నేతలతో మాట్లడతారని తృణముల్ కాంగ్రెస్ ఎంపీ ఒకరు చెప్పారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధీతో ఆమె భేటీ అయ్యే అవకాశముంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా కలవనున్నట్లు సమాచారం. కేజ్రీవాల్‌ను కలిసిన తొలి నాయకురాలు మమత బెనర్జీనే. జాతీయ రాజకీయల్లో రాణించేందుకు కేజ్రీవాల్ సలహాలు తీసుకోవాలని ఆమె భావిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లో బలమైన ఫ్రంట్ ఏర్పాటు చేయాలని మమతా బెనర్జీ కోరుకుంటున్నారు. తమ నాయకురాలు జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని తృణముల్ పార్టీ నేతలు కూడా అభిలషిస్తున్నారు.