
మూడో కూటమి సహా దేనికీ మద్దతివ్వం
ఆప్ స్పష్టీకరణ
వారణాసి: సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి వచ్చే ఫలితాలు ఏవిధంగా ఉన్నప్పటికీ తృతీయ కూటమి సహా ఏ కూటమికీ మద్దతిచ్చేది లేదని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సాయంత్రం స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే, దీనికి ముందు ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆపార్టీ సీనియర్ నేత గోపాల్ రాయ్ మాత్రం.. బీజేపీని అధికార పీఠం నుంచి నిలువరించే క్రమంలో తమ పార్టీ తృతీయ కూటమికి మద్దతిస్తుందన్నారు. అయితే, అంశాల వారీగానే ఈ మద్దతు ఉంటుందని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పోటీకి దిగినప్పటికీ ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లలో ఆప్ మంచి ఫలితాలు రాబడుతుందన్నారు. ఎన్నికల్లో 10 సీట్లు వచ్చినా 30 సీట్లొచ్చినా వ్యవస్థీకృత మార్పులు చేపట్టేదిశగా ప్రభుత్వంపై తాము ఒత్తిడి తెస్తామన్నారు. కాగా, రాయ్ వ్యాఖ్యలను కేజ్రీవాల్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఆప్ ఏ ఒక్కపార్టీకీ మద్దతివ్వబోదని, తృతీయ కూటమిగా ఏర్పడుతున్న పార్టీల్లో అవినీతి పరులే ఎక్కువగా ఉన్నారని.. అవినీతిపై పోరాడతామంటూ బరిలో నిలిచిన తాము ఏవిధంగా ఆయా నేతలకు మద్దతిస్తామని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో కూర్చునేందుకే ఆప్ ప్రాధాన్యమిస్తుందని ట్విట్టర్‌లో స్పష్టం చేశారు.
కేజ్రీవాల్‌కు ఈసీ నోటీసులు
ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. అమేథీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆదివారం ఈ నోటీసు ఇచ్చింది. మే 13 సాయంత్రంలోగా వివరణ ఇచ్చేందుకు గడువు విధించింది. ఆ లోపుగా కేజ్రీవాల్ వివరణ ఇవ్వకపోతే ఈ అంశంపై తామే నిర్ణయం తీసుకుంటామని ఈసీ స్పష్టం చేసింది. అమేథీ ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీలకు ఒక్క ఓటు వేసినా అది దేశాన్ని, దైవాన్నీ మోసగించడమే అవుతుందని కేజ్రీవాల్ చెప్పిన సంగతి తెలిసిందే.