
మూడో కూటమితో దేశం పాతాళానికి: మోడీ
కోల్కతా: మూడో కూటమి దేశాన్ని పాతాళానికి తీసుకెళ్తుందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. కోల్కతాలో బుధవారం నిర్వహించిన నరేంద్రమోడీ జనచేతన బహిరంగ సభకు జనం భారీగా హజరయ్యారు. ఈ సభలో మోడీ మాట్లాడుతూ.. గాలి ఎటువైపు వీస్తుందో మూడో కూటమి గమనించాలని అన్నారు. 2014 ఎన్నికల్లో రాజకీయ పండితులు ఊహించని ఫలితాలను చూస్తామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
60 ఏళ్ల కాంగ్రెస్ పాలనను ప్రజలు ఇక చాలనుకుంటున్నారని మోడీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో సీనియర్ అయిన ప్రణబ్ ముఖర్జీనీ కాకుండా మన్మోహన్ సింగ్ను ఎందుకు ప్రధానిని చేసిందని నిలదీశారు. ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉండాలన్నది స్వామి వివేకానందుడి కలని పేర్కొన్నారు. గుజరాత్, బెంగాల్ మధ్య అవినాభావ సంబంధం ఉందంటూ వారి అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేశారు. గుజరాత్‌లో జౌళి పరిశ్రమ అభివృద్ధిలో రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరుడి పాత్ర మరువలేమని మోడీ చెప్పారు. రవీంద్రుడు చాలా కాలం గుజరాత్‌లోనే ఉన్నారని గుర్తు చేశారు. బెంగాల్ ప్రజలు బీజేపీకి ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. పశ్చిమబెంగాల్ ప్రజలు ఎంతో చైతన్యవంతులని ప్రశంసించారు.