మోదీ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా? | If The BJP Calls Early Elections | Sakshi
Sakshi News home page

మళ్లీ ముందస్తు మాట !

Published Tue, May 15 2018 10:56 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

If The BJP Calls Early Elections - Sakshi

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించడంతో మరోసారి లోక్‌సభ ముందస్తు ఎన్నికలపై చర్చ మొదలైంది. మ్యాజిక్‌ ఫిగర్‌కు కొద్ది సీట్ల దూరంలో బీజేపీ నిలిచిపోయినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మ్యాజిక్‌ చెక్కు చెదరలేదని ఈ ఎన్నికలు రుజువు చేశాయి. మరోవైపు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాం«ధీ నైతిక స్థైర్యాన్ని ఈ ఎన్నికలు బాగా దెబ్బతీశాయనే చెప్పాలి. గుజరాత్‌ ఎన్నికల్లో మోదీని దీటుగా ఎదుర్కొని సత్తా చాటిన రాహుల్‌ గాంధీ, కర్ణాటక విషయానికొచ్చేసరికి చతికిలపడిపోయారు. మోదీలా ఒంటి చేత్తో ఎన్నికల భారాన్ని మోసే సామర్థ్యం రాహుల్‌కి లేదని తేలిపోయింది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పొత్తులే శరణ్యమని, ఇతర  పార్టీలతో చేతులు కలపకుండా లోక్‌ సభ ఎన్నికలను ఎదుర్కోవడం ఆ పార్టీకి సులభం కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేకాదు సైద్ధాంతిక విభేదాలను పక్కన పెట్టి పార్టీలు చేతులు కలిపితే బీజేపీ దూకుడుని అడ్డుకోగలరని ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తేటతెల్లమైంది. అందుకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ నేతృత్వంలో ఫ్రంట్, లేదంటే థర్డ్‌ ఫ్రంట్‌కు ఒక రూపు రేఖలు రావడానికి గడువు ఇవ్వకుండా బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళుతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు ఎన్నికలు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే యోచన బీజేపీ చేస్తుందనే చర్చ జరుగుతోంది.

ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బీజేపీకి గడ్డు పరిస్థితులు
ఈ ఏడాది నవంబర్, డిసెంబర్‌లలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలకు షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరగాలి. ఇందులో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో బీజేపీ అధికార పార్టీగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 2003 నుంచి ఆ పార్టీ అధికారంలో ఉంది. దీంతో అక్కడ బీజేపీ గెలుపు సులభంకాదనే అంటున్నారు. ఇక రాజస్థాన్‌లో కూడా బీజేపీకి పరిస్థితులు అనుకూలంగా లేవు. పైగా కర్ణాటక మాదిరి ప్రతీ ఎన్నికల్లో పాలకపక్షాన్ని ఓడించే సంస్కృతి రాజస్థాన్‌ది. ఆ మూడు రాష్ట్రాల్లో మోదీ మ్యాజిక్, అమిత్‌ షా చాణక్య వ్యూహాలు పనిచేయవనే అంచనాలు ఉన్నాయి. అందుకే ఆ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్ని నిర్వహిస్తే బీజేపీకి ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే సా«ధారణ పరిస్థితుల్లో 77 శాతం మంది ఒకే పార్టీకి ఓటు వేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి.

రాష్ట్రాలను కొల్లగొడుతున్నా తగ్గుతున్న బీజేపీ ప్రభ
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ తనకున్న ఇమేజ్‌తో ఒంటిచేత్తో  పార్టీని అత్యధిక రాష్ట్రాల్లో  విజయతీరాలకు చేర్చినప్పటికీ,  ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందిన సీట్లను, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా  పరిశీలించి చూస్తే తగ్గుతూ వస్తున్నాయి. బీజేపీ హవా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలను లోక్‌సభ స్థానాలుగా మార్చి చూసినప్పుడు, 2014 ఎన్నికలతో పోల్చిచూస్తే ఇప్పటివరకు బీజేపీ 45 లోక్‌సభ స్థానాలను కోల్పోయినట్టు ఎన్నికల విశ్లేషకుల అంచనా. అంతేకాదు బీజేపీ అధికారంలోకి వచ్చిన 15 రాష్ట్రాల్లో 2014 ఎన్నికలతో పోల్చి చూస్తే బీజేపీ ఓట్ల శాతం తగ్గిపోతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో ఆ 15 రాష్ట్రాల్లో బీజేపీకి 39 శాతం ఓట్లు వస్తే, ఆ తర్వాత అదే రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 29 శాతానికి ఆ పార్టీ  ఓటు షేరు పడిపోయింది. ఇక ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లో  ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీకి వచ్చే ఓట్ల శాతం మరింత పడిపోవచ్చునని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే వీటితో పాటు లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు బీజేపీ సై అంటుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే లోక్‌సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించడంలో సాధకబాధకాలను బీజేపీ చర్చిస్తోంది. ఈ ఏడాది చివర్లో లోక్‌సభను రద్దు చేసి తమతో కలిసొచ్చే రాష్ట్రాలతో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న చర్చ అయితే మొదలైంది.  పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు మోదీ ఇమేజ్‌ను కొంత డ్యామేజ్‌ చేసినప్పటికీ ఆయన అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా సగానికి పైగా మంది ఆయన పరిపాలనపై సంతృప్తిగా ఉన్నారని ఇటీవల సర్వేల్లో వెల్లడి కావడం  కమలనాథుల్లో హుషారు నింపింది. ఇప్పుడు కర్ణాటకలో అధికారానికి కొన్ని అడుగుల దూరంలో నిలిచిపోయినా ఈ ఫలితాలు దక్షిణాదిలోనూ సత్తా చాటగలమన్న ఆత్మవిశ్వాసాన్ని బీజేపీ శ్రేణుల్లో నింపాయి.  ఇలాంటి సమయంలోనే లోక్‌సభ ఎన్నికల్ని ముందస్తుగా నిర్వహించి  మరోసారి అధికార అందలాన్ని అందుకోవాలన్న వ్యూహంలో బీజేపీ ఉందనే అభిప్రాయం అయితే వినిపిస్తోంది.

(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement