karnataka elections 2018
-
ఒక్క ఓటుతో విజయం !
బొమ్మనహళ్లి : ఇద్దరికి సరిసమానంగా ఓట్లు వచ్చాయి... అయితే పోస్టల్ బ్యాలెట్ ఓటు ఒకరిని విజేతగా నిలిపింది. వివరాలు... ఉడిపి జిల్లా సాలిగ్రామ పట్టణ పంచాయతీ 4వ వార్డుకు బీజేపీ తరఫున కరుణాకర్, కాంగ్రెస్ తరఫున పునీత్ పూజరి బరిలో ఉన్నారు. సోమవారం జరిగిన కౌంటింగ్‌లో ఇద్దరికి సరిసమానంగా 245 ఓట్లు వచ్చాయి. అధికారులు మూడు పర్యాయాలు ఓట్లను లెక్కించినా తేడా రాలేదు. ఇంతలో ఈ వార్డుకు ఒక పోస్టల్ బ్యాలెట్ ఓటు ఉన్నట్లు గుర్తించిన అధికారి, పోస్టల్ బ్యాలెట్‌ను తీయగా అది కూడా పునీత్‌కే ఓటు వేశారు. దీంతో పునీత్‌ను విజేతగా ప్రకటించారు. ఒక్క ఓటుతో పరాజయమైన బీజేపీ అభ్యర్థి కరుణాకర్‌లో నిరాశ నెలకొంది. ఒక్క ఓటుతో విజయం సాధించిన పునీత్‌ను పలువురు అభినందించారు. -
బెంగళూరుపై కాంగ్రెస్ పట్టు; యడ్డీ అప్సెట్!
సాక్షి, బెంగళూరు: దశాబ్దకాలం తర్వాత భారత ఐటీ రాజధాని బెంగళూరు నగరంపై కాంగ్రెస్ పార్టీ తిరిగి గట్టి పట్టు సాధించినట్లైంది. బుధవారం వెల్లడైన ఫలితాల్లో జయనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్య రెడ్డి గెలుపొందడంతో సిటీలో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 16కు పెరిగింది. బెంగళూరు నగర పరిధిలో మొత్తం 28 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, బీజేపీ 11 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది.. అందునా ఐదు చోట్ల బొటాబొటి మెజారిటీతో గట్టెక్కింది. బీజేపీకి ఓటు బ్యాంకు అధికంగా ఉండే నగర, పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి తారుమారు అవుతున్నదనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని, 2019లో బెంగళూరులోని అన్ని లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 70 శాతం మంది మిడిల్ క్లాసే! : దక్షిణ బెంగళూరులోని జయనగర్ నియోజకవర్గంలో 70 శాతం మంది మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారున్నారు. అంతకుముందు కాంగ్రెస్‌కు కంచుకోటలా ఉన్న జయనగర్ స్థానంలో 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి కూడా అయిన విజయ్‌కుమార్ అకస్మిక మరణంతో ఇక్కడ మే 12న జరగాల్సిన ఎన్నిక జూన్ 11కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. గడిచిన పదేళ్లుగా జయగనర్‌లో బీజేపీదే ఆధిక్యం. గతంలో ఇక్కడి నుంచి నాలుగుసార్లు గెలుపొంది, డీలిమిటేషన్ తర్వాత వేరే స్థానానికి వెళ్లిపోయిన కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్. రామలింగారెడ్డి.. ఈ దఫా జయనగర్ నుంచి తన కూతురు సౌమ్య రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. ఇప్పటికే జేడీయూ-కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన దరిమిలా మిత్రపక్షాలకు చెందిన పెద్ద నాయకులెవరూ ప్రచారానికి రాలేదు. దీంతో రామలింగారెడ్డే అంతా తానై వ్యవహరించారు. బీజేపీ అభ్యర్థి బీఎన్ ప్రహ్లాద్(దివంగత విజయ్‌కుమార్ సోదరుడు)పై కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్య రెడ్డి 2,889 ఓట్ల వెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్‌కు 54,457 ఓట్లు నమోదవ్వగా.. బీజేపీకి 51,568 ఓట్లు వచ్చాయి. యడ్యూరప్ప కస్సుబుస్సు: జయనగర్‌లో పార్టీ ఓటమిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప తీవ్రఅసహనానికి గురయ్యారు. మీడియాతో మాట్లాడకుండా ముఖంచాటేశారు. జయనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి అనంతకుమార్ వల్లే పార్టీ ఓడిపోయిందని యడ్డీ తన అనుచరులతో అన్నట్లు సమాచారం. ప్రచార బాధ్యతలు తీసకున్న అనంతకుమార్.. స్థానిక నాయకత్వాన్ని పట్టించుకోకుండా ఇష్టారీతిగా వ్యవహరించారని, ఎగువ మధ్యతరగతి ఓట్లు అధికంగా ఉన్న జయనగర్‌లో బీజేపీ సునాయాసంగా గెలుస్తుందని భావించినా, చేదు ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చిందని యడ్డీ కస్సుబుస్సులాడినట్లు తెలిసింది. -
జాతీయ పార్టీల హవాను దెబ్బతీసిన ఎన్నికలు
ప్రతిపక్షాలకు సంబంధించి సమానులలో ప్రథముడిగా నిలబడాలని ఆశించిన రాహుల్ గాంధీని కర్ణాటక ఎన్నికలు సమానులలో ఒకడిగా దిగజార్చివేశాయి. అలాగే, మోదీ ప్రతిష్ట కూడా మసకబారింది. సంక్లిష్ట సందర్భాల్లో ఎన్నికలు ఊహించని వారికే అధికారాన్ని అప్పగిస్తుంటాయి. పూర్వకాలంలో వధువు స్వయంవరంలో అనేకమందిని చూసి తన కాబోయే వరుడిని ఆశ్చర్యకరమైన రీతిలో ఎంపిక చేసుకునేది. ప్రస్తుతం భారత రాజకీయాల్లో అనేకమంది వరులు కనిపిస్తున్నప్పటికీ అనేక దిగ్భ్రాంతికరమైన ఘటనలు జరుగు తున్నాయి. ఈ పరిస్థితి రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీల ఆశలకు, ఆకాంక్షలకు చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ఊహించనివారికి ప్రతిఫలం లభించే అవకాశం ఉంది మరి! దాదాపు 2,500 సంవత్సరాల క్రితం చైనా మేటి సైనికాధిపతి సన్ జు, విజయం సాధించలేని యుద్ధాల్లోకి దిగడంపై హెచ్చరించాడు. యుద్ధ ఫలితాలను ముందుగానే అంచనా వేయడం కాదు కాబట్టి, స్వీయ నష్టాలు ఎక్కువగా ఉండే యుద్ధాల్లోకి మంచి అవకాశాలు ఉంటే తప్ప దిగకూడదని పేర్కొన్నాడు. ఇటీవలి కర్ణాటక ఎన్నికల ఫలితాలు అనేక పార్టీలను పరీక్షకు పెట్టాయి. నిస్సందేహంగా, కర్ణాటక ఎన్నికల్లో అత్యంత అదృష్టవంతులైన నేతలు ఎవరంటే, 225 మంది ఎమ్మెల్యేలలో 37 మంది ఎమ్మెల్యేలను మాత్రమే కలిగిన దేవెగౌడ కుటుం బమే అని చెప్పాలి. ఈ కుటుంబంలోని ప్రతి సభ్యుడూ అటు రాజ కీయనేతగానూ, ఇటు పారిశ్రామికవేత్తగానూ ఉంటున్నారు. వీళ్లంతా ఇప్పుడు మేటి లాభం పొందారు. 86 ఏళ్ల వయసులో ఉన్న దేవెగౌడకు తన కుమారుడిని ముఖ్యమంత్రిగా చూసుకునే అదృష్టం దక్కింది. ఆయన బద్ధశత్రువు సిద్ధరామయ్య పూర్తిగా దెబ్బతినిపోయారు. కర్ణాటక శాసనసభలోని మొత్తం 226 సీట్లలో దేవెగౌడ పార్టీ 175 స్థానాల్లో ధరావతు కోల్పోయినా, గెలిచిన 37 స్థానాలతోనే మహద్భాగ్యాన్ని దక్కించుకోవడం విశేషం. దేవెగౌడ ఎంత అదృష్టవంతుడంటే కర్ణాటక ఎన్నికల ఫలితాలు రాకముందే కాంగ్రెస్ పార్టీ ఆయన్ని కలిసి మద్దతు ప్రకటించింది. బీజేపీ పూనుకోకముందే కాంగ్రెస్ శరవేగంగా పావులు కదిపి బేషరతుగా జేడీఎస్‌కి మద్దతు తెలిపింది. ఇతర రాజకీయనేతలు ఈ ఎన్నికల్లో ప్రయోజనం పొంది ఉండవచ్చు లేక నష్టపోయి ఉండవచ్చు. కానీ రాహుల్ గాంధీ ఉదంతం మరింత ఆసక్తికరంగా ఉంది. కర్ణాటక ఎన్నికలు జాతీయ స్థాయిలో తన ప్రతిష్టను పెంచుతాయని దేశంలోనే తనను అగ్రనేతగా నిలుపుతాయని రాహుల్ భావించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, తనకే పూర్తిగా ప్రతిష్ట చేకూరుతుందని భావించిన రాహుల్ పూర్తి ప్రచారంలో మునిగిపోయారు. ఇంతవరకు కాంగ్రెస్ అధ్యక్షులెవరూ రోడ్ షోల్లో ఎన్నడూ పాల్గొన్నది లేదు. ఎన్నికల ప్రచారంలో రోడ్ షోలకు అత్యల్ప స్థాయి ఉంది. బహిరంగ సభలు అత్యున్నత స్థాయి ప్రచారంగా అంచనా వేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ మేధావులు, మీడియా సలహాదార్లు, వివిధ ఎన్నికల వ్యూహ సంస్థలు కలిసి ఈ తరహా డిజైన్ని రూపొందించారు. దీంతో అతి విశ్వాసానికి పోయిన రాహుల్ బెంగళూరులో జరిగిన ఒక ఎన్నికల సభలో 2019లో తానే ప్రధాని పదవికి అభ్యర్థినని ప్రకటించేశారు. బీజేపీని ఓడించే కీర్తిని పూర్తిగా తానే తీసుకోవాలని రాహుల్ ఆశించారు. అందుకే మీడియాలో బీజేపీపై పరుష వాక్యాలతో దాడికి దిగారు. ఈ దాడులు నిజానికి ప్రతిదాడికి తావిచ్చాయి. విజయం సాధిస్తే ఇలాంటి దాడులను పెద్దగా లెక్కించరు. కాని అనుద్దేశపూర్వక పర్యవసానాల సూత్రం అన్ని వేళలా పనిచేస్తుంటుంది. కర్ణాటకలో అలాంటి పర్యవసానం దేవెగౌడ పక్షాన నిలిచింది. విజయఫలాలు దక్కని రాహుల్ తన ప్రతిష్టను కోల్పోయారు. ఓడిపోవడం అంటే సమస్తమూ కోల్పోయినట్లేనా అని పాఠకులు నన్ను ప్రశ్నించవచ్చు. కానీ విజయం దక్కుతుం దని పూర్తిగా ఆశించినప్పటికీ పరాజయం పొందిన క్షణాల్లో ఆ ఓటమి చాలా విలువైనది. మే 15న, కుమారస్వామి కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు డజనుకుపైగా ప్రతిపక్ష నేతలు వేదికపై దర్శనమిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుపొంది, ప్రభుత్వాన్ని ఏర్పర్చి ఉంటే ఈ నేతల్లో ఏ ఒక్కరూ వేదికపై కనిపించేవారే కాదు. బీజేపీయేతర పార్టీల నేతలు ఆ వేదికపై పూర్తి ఆధిక్యత ప్రదర్శించారంటేనే కర్ణాటకలో సంపూర్ణ విజయాన్ని ఆశించిన కాంగ్రెస్ తన వైభవాన్ని, స్థాయిని కోల్పోయినట్లేనని అర్థం. మరీ ముఖ్యంగా కర్ణాటకను కోల్పోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు సాధించిపెట్టే విజేతగా రాహుల్ గాంధీ ప్రతిష్ట మసకబారినట్లేనని చెప్పాలి. ప్రతిపక్షంలోని సమానుల్లో ప్రథముడిగా రాహుల్‌కు ఒక సానుకూల స్థానం ఉండేది. కర్ణాటకలో ఓటమి తీరుతో రాహుల్ సమానులలో ఒకడిగా దిగజారిపోయారు. ఆ ఎన్నికల ఫలితాల తర్వాత దేవెగౌడ, ఆయన కుటుంబం తప్ప దేశంలోని ఏ రాజకీయనేతా రాహుల్ గాంధీని అభినందించలేదు. రాహుల్ విశ్వప్రయత్నం చేసి కూడా సులువైన ఎన్నికల్లో కూడా గెలుపు సాధించలేకపోయారని అందరికీ అర్థమైపోయింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయాన్ని అంగీకరిం చాక రాహుల్ తన ప్రాంతీయ ప్రత్యర్థికి మద్దతివ్వాలని నిర్ణయించారు. మోదీకి వ్యతిరేకంగా అతిశయ ప్రకటనలు చేసిన రాహుల్ మే 15 తర్వాత కాస్త తగ్గిపోయారు. బీజేపీని తానే సొంతంగా ఓడించగలనని ప్రగల్భాలు పలికిన దశ నుంచి ప్రాంతీయ ప్రత్యర్థితో కలిసి పనిచేయవలసిన స్థితికి రాహుల్ దిగిపోయారు. ఎన్నికల వేళ దేవెగౌడ కుటుంబాన్ని తూర్పారబట్టిన రాహుల్ సమయం కలిసిరాక తగ్గిపోయారు కానీ అవకాశం దొరికితే ప్రతిపక్ష ప్రత్యర్థుల అంతు చూడకుండా ఉండరని అందరికీ అర్థమైంది. సంపూర్ణ విజయం తప్పదనుకున్న కర్ణాటకలో పరాజయం తర్వాత రాహుల్ ఎన్నికల్లో విజయాలు సాధించలేరని, బలహీనమైన నేతల సలహాలను పాటిస్తున్న అతడి వ్యూహాలు, ఎత్తుగడలు విఫలమవుతున్నాయన్న వాస్తవాన్ని బహిర్గతపర్చాయి. రాహుల్ గాంధీకి లాగే నరేంద్ర మోదీ ప్రతిష్ట కూడా స్పష్టంగానే వెనుకపట్టు పట్టింది. 2018 నాటి మోదీ 2014 నాటి మోదీ కాదు. అనేక అంశాల్లో ప్రజలు ఆయనను ఇష్టపడ్డారు కానీ పేలవమైన ఆర్థిక నిర్వహణతో తన ప్రతిష్టను తానే దెబ్బతీసుకుంటున్నారు. మోదీ ఎవరి మాటలనూ పట్టించుకునే పరిస్థితిలో లేరని అర్థమైపోయింది. మోదీని, రాహుల్ గాంధీని ఎవరూ దిద్దుబాటు చేయలేరు. రాజును అతడి ఆశ్రితులు ఎన్నటికీ సరిదిద్దలేరు. గందరగోళ సందర్భాల్లో ఎన్నికలు సాధారణంగా ఊహించని వారికే అధికారాన్ని అప్పగిస్తుంటాయి. పూర్వకాలంలో వధువు స్వయంవరంలో అనేకమందిని చూసి తన కాబోయే వరుడిని ఆశ్చర్యకరమైన రీతిలో ఎంపిక చేసుకునేది. ప్రస్తుతం భారత రాజకీయాల్లో అనేకమంది వరులు కనిపిస్తున్నప్పటికీ అనేక దిగ్భ్రాంతికరమైన ఘటనలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి రాహుల్, మోదీల ఆశలకు, ఆకాం క్షలకు చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ఊహించనివారికి ప్రతిఫలం లభించే అవకాశం ఉంది మరి! పెంటపాటి పుల్లారావు , వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ఈ–మెయిల్ : drppullarao@yahoo.co.in -
రూ.11 పెరిగిన పెట్రోల్ ధర
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు వినియోగదారులకు భారీ ఎత్తున్న జేబులకు చిల్లు పెడుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసనలు వెల్లువెత్తుతున్న ఇంకా ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వరుసగా 12వ రోజు ఆయిల్ ధరలు పైకి ఎగిశాయి. నేడు పెట్రోల్, డీజిల్ ధరలు 32 పైసలు, 18 పైసల చొప్పున పెరిగాయి. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంకేతాలు వెళ్తాయనే కారణంతో దాదాపు 19 రోజుల పాటు ఈ ధరలు పెంచకుండా స్తబ్ధుగా ఉంచాయి. అయితే కర్ణాటక ఎన్నికలు అలా అయిపోగానే.. ఇలా పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు వాత పెట్టడం ప్రారంభించాయి. ఇక అప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాయి. కర్నాటక ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఇప్పటివరకు పెట్రోల్ ధర 11 రూపాయల మేర పెరగగా... డీజిల్ ధర రూ.7.27 ఎగిసింది. దీంతో నేడు లీటరు పెట్రోల్ ధర మెట్రోపాలిటన్ నగరాల్లో.. ఢిల్లీలో రూ.77.83గా ఉండగా.. ముంబైలో రూ.85.65గా, కోల్‌కతాలో రూ.80.47గా, చెన్నైలో రూ.80.80గా ఉంది. సమీక్షించిన ధరల ప్రకారం లీటరు డీజిల్ ధర.. ఢిల్లీలో రూ.68.75గా, ముంబైలో రూ.73.2గా, చెన్నైలో రూ.72.58గా, కోల్‌కతాలో రూ.71.30గా ఉన్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసనను చేపట్టాయి. పెట్రో ధరలు దిగివచ్చేలా చర్యలు చేపడతామని కేంద్రం సంకేతాలు పంపినప్పటికీ, భారీగా ఆందోళనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ ధరల ప్రభావంతో దేశీయంగా ఈ ధరలు పెరుగుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం గ్లోబల్‌గా క్రూడ్ ఆయిల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. రష్యా నుంచి సరఫరా పెరగనుందనే సంకేతాలతో ఈ ధరలు తగ్గాయి. ఈ ప్రభావంతో దేశీయంగా ఏమైనా ధరలు తగ్గే అవకాశముందో లేదో చూడాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంధన ధరలపై పన్నులు తగ్గించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. వీటి పన్నులు తగ్గిస్తే, దాని ప్రభావం సబ్సిడీలపై పడనుందని కేంద్రం చెబుతోంది. అయినప్పటికీ, ధరల పెంపును తగ్గించడానికి దీర్ఘకాలిక పరిష్కారం కనుగొంటామని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని ఒక్క రూపాయి మేర తగ్గించినా.. ప్రభుత్వానికి 130 బిలియన్ రూపాయిలు నష్టం చేకూరే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ కోతలో కాస్త వెనుకంజ వేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ కిందకి తీసుకురావాలని కూడా నితిన్ గడ్కారీ అన్నారు. -
కేజ్రీవాల్‌కు ఆప్ ఎమ్మెల్యే హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ చేరితే పార్టీకి రాజీనామా చేస్తానని ఆప్ ఎమ్మెల్యే, సీనియర్ న్యాయవాది హెచ్ ఎస్ పుల్కా తెలిపారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను బహిరంగంగానే హెచ్చరించారు. కాంగ్రెస్‌కు తాను వ్యతిరేకమని తేల్చి చెప్పారు. 1984లో సిక్కులపై కాంగ్రెస్ జరిపిన దాడులు త్రీవమైన విషయమన్నారు. ఆ కేసు తనకు చాలా ముఖ్యమైనదని చెప్పారు. ఆప్ కనుక కాంగ్రెస్ కూటమిలో చేరితే తాను పార్టీకి రాజీనామా చేస్తానని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి అరవింద్ కేజ్రివాల్ హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో కలిసి కేజ్రీవాల్ వేదిక పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పుల్కా ఈ హెచ్చరిక చేశారు. 1984లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్య అనంతరం సిక్కులపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో వేలాదిమంది సిక్కులు బాధితులయ్యారు. వారికి న్యాయం చేయడానికి పుల్కా పోరాటం చేశారు. ఆయన గత ఏడాది పంజాబ్‌లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. -
బొప్పి కట్టిన తెలుగు పెద్దతలలు
మొత్తానికి ఓడి గెలిచామా, గెలిచి ఓడామా అర్థం కాని స్థితిలో ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులూ తలలు పట్టుకున్న పరిస్థితి. చంద్రబాబు అవసరం కోసం మాట మార్చడంలో దిట్ట. అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి అక్కడి గవర్నర్ మహా నేరం చేశాడని ఆయన అంటున్నారు. మరి 1995లో అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కృష్ణకాంత్ అడ్డగోలుగా తనను ప్రభుత్వం ఏర్పాటు చేయనిచ్చిన విషయం ఆయనకు గుర్తురాదు. 23 మంది ప్రతిపక్ష శాసనసభ్యులను అడ్డంగా కొని అందులో నుండి నలుగురిని మంత్రులను చేస్తే వారితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించిన విషయం కూడా గుర్తుకు రాదు. కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ తల దూర్చారు. ఇద్దరి తలలూ బొప్పి కట్టాయి. పైకి నొప్పి లేనట్టు నటిస్తున్నా ఇద్దరూ ఎవరూ చూడకుండా అద్దం ముందు నిలబడి బొప్పి తడుముకుని బావురుమంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పబ్లిగ్గానే ‘బీజేపీని ఓడించండి!’ అని కర్ణాటకలో స్థిరపడిన తెలుగువారికి పిలుపు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి కర్ణాటకలో స్థిరపడ్డ తెలుగువారు ఎక్కువగా ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరులో లేదా హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో స్థిరపడ్డారు. బెంగళూరులో స్థిరపడ్డ తెలుగువారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల వారు. చంద్రబాబు పిలుపును వాళ్లెవరూ లెక్క చెయ్యలేదు. ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తి బీజేపీకి ఓట్లు పడకుండా చేయాలన్న ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. కర్ణాటకలో బీజేపీ సీట్లు 2013 కంటే ఈసారి గణనీ యంగా పెరిగాయి. ఎవరి ప్రయోజనాలు వారివి! చంద్రబాబునాయుడు తిరుపతి నుంచే ‘బీజేపీని ఓడించండి!’ అని కర్ణాటక తెలుగు వారికి పిలుపు ఇస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాత్రం ఒక ప్రత్యేక విమానంలో మందీమార్బలంతో వెళ్లి మాజీ ప్రధానమంత్రి, జనతాదళ్ (ఎస్) అధ్యక్షుడు దేవెగౌడను ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని కలసి మద్దతు ప్రకటించి వచ్చారు. ఆయన ఆలోచన అక్కడ కాంగ్రెస్ గెలవకూడదని! అయితే ఇటీవలే జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయాలు నడుపుతానని బయలుదేరిన చంద్రశేఖరరావు బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలను దుయ్యబడుతున్న కారణంగా కర్ణాటకలో బీజేపీని గెలిపించాలని బహిరంగంగా ప్రకటించలేకపోయారు. అయితే ఆయన రహస్య ఎజెండా మాత్రం బీజేపీకి మేలు చేయడమే అని రాజకీయ పండితుల వాదన. అందుకు కారణం కర్ణాటకలో ఈసారి కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో తన ప్రథమ శత్రువుగా ఉన్న కాంగ్రెస్‌లో కొత్త ఊపు వస్తుంది. ఎన్నికల నాటికి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉంటుంది, జేడీ(ఎస్) పేరుకు జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ అస్తిత్వంతోనే కొనసాగుతున్నందున ఎక్కువ స్థానాలు వచ్చేటట్టు చేస్తే అది బీజేపీకి లాభించి అధికారంలోకి రావడానికి పనికొస్తుందన్నది కేసీఆర్ రహస్య ఎజెండా. అయితే ఆయన పిలుపును అందుకోవాల్సిన తెలుగువారు హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో స్థిరపడ్డ తెలుగువారు. వాళ్లలో ఎక్కువ మంది పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం, అంటే తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్లి స్థిరపడ్డవారు. బెంగళూరులో స్థిరపడ్డ ఆంధ్ర ప్రాంతపు తెలుగువారు చంద్రబాబు పిలుపును లెక్క చేయనట్టే, హైదరాబాద్ కర్ణాటక ప్రాంత తెలుగువారు చంద్రశేఖరరావు పిలుపును పట్టించుకోలేదు. అక్కడ జేడీ (ఎస్) కన్నా బీజేపీకే ఎక్కువ స్థానాలు లభించాయి. పైగా కేసీఆర్ బహిరంగంగా మద్దతు తెలిపిన జేడీ(ఎస్)కు మొన్నటి ఎన్నికలలో 2013 ఎన్నికల కంటే తక్కువ స్థానాలు లభిం చాయి. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కర్ణాటక ఎన్నికల ఫలితాల మీద బహిరంగ ప్రకటన చేయలేదు. అయితే ఆయన అనుకున్నదొకటి, అయింది మరొకటి. జేడీ (ఎస్) తెలంగాణలో తన ప్రథమ శత్రువు కాంగ్రెస్ గూట్లో చేరిపోయింది. మింగలేక కక్కలేక అన్నట్టు తయారయింది ఆయన పరిస్థితి. దానికి తోడు బీజేపీ నుంచి తమ ఎంఎల్ఏలను రక్షించుకోవడం కోసం శిబిరం ఏర్పాటుకు కేరళ వెళ్లాల్సిన కాంగ్రెస్, జేడీ(ఎస్) శాసనసభ్యులు హైదరాబాద్ బయలుదేరి రావడం కూడా కేసీఆర్‌కు మింగుడుపడని విషయమే. సుప్రీంకోర్టు ఆదేశాల పుణ్యమా అని హైదరాబాద్ శిబిరం ఒక్కరోజుతో ముగిసిపోయింది కానీ, ఏ పదిహేను రోజులో కొనసాగి ఉంటే జేడీ (ఎస్) బహిరంగ మిత్రుడిగా తన ఇలాఖాలో ఉన్నారు కాబట్టి కాపాడే చర్యలు గట్టిగా చేయవలసి వచ్చేది. అట్లా చేస్తే తన రహస్యమిత్రులు అమిత్ షా, మోదీల ఆగ్రహం చవిచూడాల్సి వచ్చేది. ఆంధ్రప్రదేశ్ సీఎం వ్యూహం వేరు ఎన్డీఏను వీడి వచ్చాక తన మీద కేసులు పెడతారని చంద్రబాబునాయుడు చాలా భయపడుతున్నారు. అది బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. అందుకే బీజేపీ బలహీనపడాలనీ, కర్ణాటకలో ఓడిపోతే బీజేపీ ముఖ్యంగా షా, మోదీ ద్వయం దూకుడుకు కళ్లెం పడుతుందనీ, దానితో తన జోలికి రాకుండా ఉంటారనీ చంద్రబాబు ఆశించారు. కానీ ఆయన ఆశ నెరవేరలేదు. కర్ణాటకలో బీజేపీ అధిక స్థానాలు పొందిన ఏకైక పార్టీగా అవతరించింది. చంద్రబాబు ఆశల మీద కర్ణాటక ప్రజలు ఆ విధంగా నీళ్లు జల్లి, చంద్రశేఖరరావుకు కూడా నిరాశే మిగిల్చారు. కాంగ్రెస్ స్థానాలు తగ్గాయి కానీ, అక్కడ అధికారంలో భాగస్వామిగా ఉండబోతున్నది. కాంగ్రెస్ అధినేత్రి సోని యాగాంధీ అత్యంత వేగంగా పావులు కదిపి జేడీ (ఎస్)ను బీజేపీ వైపు పోకుండా నిలువరించగలిగారు. తగిన సంఖ్యలో ఎంఎల్ఏలు లేకపోయినా ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యడంలో దిట్టలని పేరుగాంచిన అమిత్ షా, మోదీలకే చెక్ పెట్టిన సోనియా రాజకీయ చతురతను అందరూ పొగుడుతున్నారు. చంద్రబాబు గవర్నర్‌ను విమర్శించడమా!? మొత్తానికి ఓడి గెలిచామా, గెలిచి ఓడామా అర్థం కాని స్థితిలో ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులూ తలలు పట్టుకున్న పరిస్థితి. చంద్రబాబునాయుడు అవసరం కోసం మాట మార్చడంలో దిట్ట. కర్ణాటక తాజా పరిస్థితి మీద ఆయన అక్కడి గవర్నర్ పాత్రను తీవ్రంగా విమర్శించారు. అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి అక్కడి గవర్నర్ మహా నేరం చేశాడని ఆయన అంటున్నారు. మరి 1995లో అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కృష్ణకాంత్ అడ్డగోలుగా తనను ప్రభుత్వం ఏర్పాటు చేయనిచ్చిన విషయం ఆయనకు గుర్తురాదు. 23 మంది ప్రతిపక్ష శాసనసభ్యులను అడ్డంగా కొని అందులో నుండి నలుగురిని మంత్రులను చేస్తే వారితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించిన విషయం కూడా గుర్తుకు రాదు. వజూ భాయ్ వాలా రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకుంటే కృష్ణకాంత్, నరసింహన్‌ల చేత తాను చేయించింది ఏమిటి? రాజ్యాంగ పరిరక్షణా? రాజ కీయాల్లో అధికారమే పరమావధి అయినప్పుడు మర్యాద, హుందాతనం వంటివి లుప్తమయిపోతుంటాయి. ఒకప్పుడు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినందుకు దేవత అని ప్రస్తుతించిన చంద్రశేఖరరావు ఈ రోజు బెంగళూరులో జరగనున్న కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరు కాకపోవడానికి కారణం అక్కడికి సోనియా, రాహుల్ తదితర కాంగ్రెస్ పెద్దలు వస్తున్నందునే. జేడీ (ఎస్), కాంగ్రెస్ మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటులో తానూ పాల్గొంటే తెలంగాణలో కాంగ్రెస్ నైతిక స్థయిర్యం పెరుగుతుందనే దుగ్ధతో బాటు సోనియాగాంధీని ముఖాముఖి ఎదుర్కోలేక పోవడమూ, బీజేపీ పెద్దలకు ఆగ్రహం తెప్పించకూడదన్న వెరపూ కారణం కావచ్చు. అందుకే ఆయన మంగళవారం సాయంత్రమే బెంగళూరు వెళ్లి కుమారస్వామికి అభినందనలు తెలిపి వచ్చేశారు. అవతలి వైపు సోనియాగాంధీని దెయ్యం అనీ, ఇటలీ దేశీయురాలనీ నానా తిట్లూ తిట్టిన చంద్రబాబునాయుడుకుమారస్వామి ప్రమాణ స్వీకారానికి బెంగళూరు బయలుదేరారు. సోనియా గాంధీ సరసన కూర్చోడానికి, కాంగ్రెస్ నాయకత్వంలో కొత్త కూటమి గూట్లో చేరిపోవడానికి తెగ ఆరాట పడిపోతున్నారాయన. భూమి గుండ్రంగా ఉంటుందన్నట్టు కాంగ్రెస్ నుంచి బయలుదేరిన చంద్రబాబు చివరికి అదే కాంగ్రెస్ పంచన చేరక తప్పని పరిస్థితి. తెలంగాణ కాంగ్రెస్‌లో మథనం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కాడి కింద పారేసింది కానీ తెలంగాణలో 2019లో కచ్చితంగా అధికారంలోకి వస్తామని ఆశ పడుతున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు మాత్రం కొత్త గుబులు పట్టుకున్నది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కర్ణాటక ఫలితం పునరావృతం అయితే ఎట్లా అన్న సందేహం వాళ్లనువెంటాడుతున్నది.తెలంగాణలో కర్ణాటక మాదిరిగానే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని స్థానాలు కాంగ్రెస్‌కు లభించకపోతే, జేడీ (ఎస్) లాగా కోదండరాం నాయకత్వంలోని టీజేఎస్కో, టీటీడీపీకో ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందేమో అన్నది వాళ్ల ఆందోళన. బీజేపీని నిలువరించడానికి కర్ణాటక మోడల్‌ను 2019 దాకా కొనసాగిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం వల్ల చంద్రశేఖరరావు రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం తెస్తానని చెపుతున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నం అటకెక్కినట్టే. కొత్త, పాత మిత్రులతో మరో యూపీఏ ఏర్పాటయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అదే జరిగితే కేసీఆర్ ఎన్డీఏలో చేరడమో, ఒంటరిగా మిగిలిపోవడమో జరుగుతుంది. దేవులపల్లి అమర్, datelinehyderabad@gmail.com -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ
సంగారెడ్డి రూరల్ : కర్ణాటకలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని బీజేపీ అడ్డదారులు తొక్కుతూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు.అధికార దాహంతో గవర్నర్ అధికారాలను దుర్వినియోగం చేస్తూ.. సంఖ్యా బలం తక్కువగా ఉన్న బీజేపీ చేత ప్రభుత్వం ఏర్పాటు చేయించడం సమంజసం కాదన్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోతిరెడ్డిపల్లిలోని జాతీయ రహదారి చౌరస్తాపై భైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో మేఘాలయా, గోవా, మణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్యా బలం లేకున్నా గవర్నర్ తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ బీజేపీచేత ప్రమాణ స్వీకారం చేయించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు 15 రోజుల్లో మెజారిటీ నిరూపించుకోకుండా ఒకే రోజులో బల నిరూపణ చేపట్టాలని ఆదేశించడం వారికి చెంప పెట్టులాంటిదన్నారు. కాంగ్రెస్, జేడీఎస్పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ నాయకులు డబ్బులను ఎరవేస్తూ తమవైపు లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలను హెలిక్యాప్టర్‌లో తరలిస్తుంటే ఏటీసీ నుంచి సిగ్నల్స్ ఇవ్వకపోవడం బీజేపీ కుట్రే అన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని, అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ ఆందోళనతో రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేసి ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మహిళ కాంగ్రెస్‌జిల్లా అధ్యక్షురాలు నిర్మల జయప్రకాశ్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శశికళ యాదవ్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అనంతకిషన్, జిన్నారం జెడ్పీటీసీ ప్రభాకర్, పటాన్చెరు కార్పొరేటర్ శంకర్‌యాదవ్, నాయకులు మునిపల్లి సత్యనారాయణ, ఆంజనేయులు, శంకర్‌రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
వీరు కూడా ఓటు వేశారు...
కర్ణాటక రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. రాత్రికి రాత్రి ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఇవి పక్కన పెడితే, ఈసారి ఓటింగులో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంతకుముందు వరకు ఓటరు గుర్తింపు కార్డులో ఆడ, మగ రెండే ఉండేది. ట్రాన్స్జెండర్ల పోరాట ఫలితంగా వీరిని కూడా ఓటర్లలో చేర్చారు. వారికి కూడా ఓటరు గుర్తింపు కార్డులు ఇచ్చారు. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,000 మంది ట్రాన్స్జెండర్లు ఈసారి ఎంతో సంబరంగా ఉన్నారు. 2013 ఎలక్షన్ల కంటే ఈ సారి వీరి సంఖ్య రెట్టింపుగా ఉంది. వీరి సంఖ్య బెంగళూరులో బాగా ఎక్కువగా ఉంది. మొత్తం 28 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను వీరు 1,629 మంది ఉన్నారు. వీరిలో మొట్టమొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారిలో లావణ్య కూడా ఉన్నారు.ఎవరు గెలిచినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ‘మాకు మాత్రం రక్షణ కల్పించాలి’ అంటున్నారు వీరంతా ముక్తకంఠంతో. ఓటు వేయడమనేది హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా అని తెలుసుకున్నారు వీరు. ‘‘ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఎంతోమంది రాజకీయ నాయకులు మా ఓట్లను కూడా అర్థించడానికి మా ఇళ్లకు వచ్చారు. మమ్మల్ని ఎంతో గౌరవంగా పలకరించారు. ముందుముందు కూడా అందరూ మా పట్ల ఎంతో గౌరవంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాం’’ అంటున్నారు లావణ్య. ట్రాన్స్జెండర్లు కూడా మనుషులేనని గుర్తించి, వారిని గౌరవంగా చూస్తే, ముందుముందు కూడా వీళ్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపించే అవకాశం ఉందంటున్నారు విద్య దినకర్ అనే సామాజికవేత్త. ‘‘ట్రాన్స్జెండర్లను చాలామంది అవమానకరంగా చూస్తున్నారు. వారికి కూడా మనసు ఉంటుందని అర్థం చేసుకోవాలి. అయితే ఈ ఎన్నికలలో మొదటిసారిగా ఓట్లు వేస్తున్న వీరంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. తాము కూడా ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో భాగస్వాములవుతున్నందుకు ఆనందిస్తున్నారు’’ అంటున్నారు దివ్య. కర్వార్ జిల్లా దండేలి గ్రామానికి చెందిన సంజన దక్షిణ కర్ణాటకలో మొట్టమొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ‘‘నా పేరు మీద నాకు గుర్తింపు కార్డు ఇచ్చారు ‘సంజన’ అని. నేనంటే ఏమిటో నాకు ఇప్పుడు తెలుస్తోంది. నా కల నిజమవుతున్నందుకు నాకు ఆనందంగా ఉంది’’ అంటున్నారు. 2017లో రాష్ట్ర ప్రభుత్వం వీరి గురించి ఒక విధానం రూపొందించింది. వీరిని సంరక్షించేందుకు, ఉద్యోగం చేసేందుకు వీలుగాను, సమాజంలో ఎవ్వరూ వీరిని ఎగతాళి చేయకుండా మర్యాదగా చూసేందుకు అనుగుణంగా విధివిధానాలు రూపొందించింది. వారిని కూడా సాటివారిగా చూస్తూ, వారి పట్ల బాధ్యతగా ఉండాలని చెబుతున్నారు విద్య. – రోహిణి -
కర్ణాటక రాజకీయం..ప్రమాణస్వీకారం ఆపాలంటూ పిటిషన్
ఢిల్లీ: హస్తినలో అర్ధరాత్రి హైడ్రామా నడుస్తోంది. కర్ణాటక రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. బీజేపీ శాసనసభాపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఆపాలని కోరుతూ కాంగ్రెస్-జేడీఎస్‌లు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. కాసేపట్లో ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ భూషణ్, జస్టిస్ బోబ్డేలతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. కాంగ్రెస్-జేడీఎస్‌ల తరపును కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. బీజేపీ తరపున ఏఎస్జీ తుషార్ మెహతా వాదనలు వినిపించనున్నారు. గురువారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు సీఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేయడానికి గవర్నర్ ఆయనను ఆహ్వానించిన సంగతి తెల్సిందే. గురువారం కేవలం యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారు. బల నిరూపణకు గవర్నర్ వాజూభాయ్ 15 రోజుల గడువు కూడా ఇచ్చిన సంగతి తెల్సిందే. బల నిరూపణ తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తారు. -
సంబరాలు.. అంతలోనే నిట్టూర్పు
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ సమయంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఉదయం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ హవా కనిపించటంతో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో పెద్దగా హడావుడి కనిపించలేదు. కాసేపటికి ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలు కాగానే బీజేపీ పుంజుకుంది. దీంతో కార్యకర్తల సందడి ప్రారంభమైంది. బీజేపీ లీడ్‌లోకి దూసుకెళ్లడంతో కార్యాలయానికి భారీగా నేతలు, కార్యకర్తల రాక మొదలైంది. 11 గంటలు దాటేసరికి కాంగ్రెస్‌కు అందనంత ముందుకు బీజేపీ వెళ్లిపోవటంతో గెలుపు తథ్యమంటూ టపాసుల పేలుళ్లు ప్రారంభమయ్యాయి. డప్పు శబ్దాలు మారుమోగాయి. పెద్ద నేతల ఆగమనం.. ప్రధాని మోదీకి జయజయధ్వానాల తో ప్రాంతం హోరెత్తింది. బీజేపీ 119 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి సహా పలువురు నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కర్ణాటకలో మోదీ హవా వీచిందని, ఎవరెన్ని కుట్రలు చేసినా కన్నడ ఓటర్లు బీజేపీకే పట్టం కట్టారని అన్నారు. మధ్యాహ్నానికి పరి స్థితి మారిపోవటంతో అంతా డీలా పడ్డారు. హంగ్ తథ్యమని తేలటంతో కార్యకర్తలు సంబరాలు ఆపేసి వెనుదిరిగారు. తెలుగు రాష్ట్రాల సీఎంల ఆశలు గల్లంతు బీజేపీని ఓడించి.. తద్వారా ప్రధాని మోదీ చరిష్మాను తగ్గిందనే సంకేతాలు పంపేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కర్ణాటకలో హడావుడి చేయబోయి భంగపడ్డారని లక్ష్మణ్, దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర సీఎం జేడీఎస్‌కు మద్దతు ఇచ్చి ఆ పార్టీ గెలుపు కోసం యత్నించారని, ఏపీ సీఎం నేరుగా కాంగ్రెస్‌కు మద్దతిచ్చి అక్కడి తెలుగు ఓటర్లను ప్రభావితం చేయబోయి బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు. -
ఇక తెలంగాణపై నజర్!
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి ఊపు మీద ఉన్న బీజేపీ.. ఇక తెలంగాణపై పూర్తిస్థాయి లో దృష్టి సారించాలని భావిస్తోంది. బిహార్ ఓటమి తర్వాత వ్యూహాలు మార్చుకున్న బీజేపీ... అనంతరం ఆయా రాష్ట్రాల స్థానిక పరిస్థితులను ఆకళింపు చేసుకుని, ప్రత్యేక వ్యూహాలతో వరుస విజయాలు సాధిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్యపై పెద్దగా వ్యతిరేకత లేకున్నా కూడా.. ఆ పార్టీ ని చావుదెబ్బతీయడంలో సఫలమైంది. ఇక తాజాగా తెలంగాణపై దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో బలంగా ఉన్న టీఆర్ఎస్ను ఢీకొనేందుకు స్థానిక పరిస్థితుల ఆధారంగా వ్యూహం అవసరమని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయానికి వచ్చింది. జాతీయ స్థాయిలో వ్యూహాలు.. 2014 ఎన్నికల్లో అమిత్‌షా ఎన్నికలకు చాలా ముందు 3 రోజులపాటు హైదరాబాద్‌లో తిష్ట వేసి ప్రణాళికలు రూపొందించి నా.. అవి ఏమాత్రం పనిచేయలేదు. అప్పటికీ ఇప్పటికీ బీజేపీ ఆలోచనలో మార్పు వచ్చింది. అప్పట్లో స్థానిక నేతలపై ఆధారపడి ముందుకెళ్లడంతో దెబ్బతిన్నామని.. ఈసారి తామే వ్యూహాలు ఖరారు చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రాంమాధవ్; పార్టీ సీనియర్ నేతలు మంగళ్‌పాండే, నరేంద్రసింగ్ తోమర్‌లను రంగంలోకి దింపుతున్నట్టు సమాచారం. రాంమాధవ్‌కు రాష్ట్రంలో 5 పార్లమెంటు స్థానాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతను అప్పగించబోతోంది. మిగతా ఇద్దరికి 4 చొప్పున పార్లమెంటు, వాటి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను అప్పగించనున్నారు. అన్ని అంశాలను పరిశీలించి: ఆయా ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం, ఆర్థిక, సామాజిక స్థితిగతులు, గత ఎన్నికల్లో గెలిచిన పార్టీ, అందుకు కారణాలు, బీజేపీకి వచ్చిన ఓట్లు, అప్పటి అభ్యర్థి శక్తిసామర్థ్యాలు, ఇప్పుడు అభ్యర్థిగా ఎవరికి అవకాశం ఇవ్వొచ్చు, ఇలా అన్ని రకాల అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని అమిత్‌షా రాష్ట్ర బీజేపీని కోరారు. ఈ నెల 18, 19ల్లో పార్టీ ప్రతినిధి సతీశ్‌జీ నగరానికి వచ్చి ఆయా అం శాలపై చర్చించనున్నారు. అనంతరం ఆ వివరాలను అమిత్‌షాకు అందజేస్తారు. ఆ నివేదిక ఆధారంగా జూన్‌లో అమిత్‌షా తెలంగాణ పర్యటన ఖరారుకానుంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీలపైనా అమిత్‌షా దృష్టి సారించినందున.. వీలు చూసుకుని తెలంగాణకు సమయం కేటాయించనున్నారు. 50 అసెంబ్లీ సీట్లపై టార్గెట్ ప్రస్తుతం రాష్ట్రంలోని 50 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ కేడర్ బలంగా ఉందని కేంద్ర నాయకత్వం అంచనాకు వచ్చింది. బీజేపీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాటుతో ఆ నియోజకవర్గాలు బలంగా ఉన్నాయని గుర్తించింది. వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించబోతున్నారు. అసెంబ్లీ స్థానాల్లో పార్టీ బలంగా ఉంటే తప్ప పార్లమెంటు స్థానా ల్లో గెలుపు సాధ్యం కాదనేది అమిత్‌షా 2 రోజుల క్రితం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు చెప్పిన మాట. ఏవో 4 కార్యక్రమాలు నిర్వహించి, ఎవరినో ఒకరిని అభ్యర్థిగా నిలబెడితే గెలుపు సాధ్యం కాదని స్పష్టం చేసినట్టు తెలిసింది. సంస్థాగతంగా పార్టీపై దృష్టి సారిస్తే గెలుపు సాధ్యమన్న అభిప్రాయం తీసుకురావాలని.. ఇందుకు చాలా విషయాలు అవసరమని, వాటికి కోసం ప్రత్యేక నివేదిక రూపొందించాలని అమిత్‌షా ఆదేశించినట్టు సమాచారం. -
మోదీ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా?
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించడంతో మరోసారి లోక్‌సభ ముందస్తు ఎన్నికలపై చర్చ మొదలైంది. మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది సీట్ల దూరంలో బీజేపీ నిలిచిపోయినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మ్యాజిక్ చెక్కు చెదరలేదని ఈ ఎన్నికలు రుజువు చేశాయి. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాం«ధీ నైతిక స్థైర్యాన్ని ఈ ఎన్నికలు బాగా దెబ్బతీశాయనే చెప్పాలి. గుజరాత్ ఎన్నికల్లో మోదీని దీటుగా ఎదుర్కొని సత్తా చాటిన రాహుల్ గాంధీ, కర్ణాటక విషయానికొచ్చేసరికి చతికిలపడిపోయారు. మోదీలా ఒంటి చేత్తో ఎన్నికల భారాన్ని మోసే సామర్థ్యం రాహుల్‌కి లేదని తేలిపోయింది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పొత్తులే శరణ్యమని, ఇతర పార్టీలతో చేతులు కలపకుండా లోక్ సభ ఎన్నికలను ఎదుర్కోవడం ఆ పార్టీకి సులభం కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేకాదు సైద్ధాంతిక విభేదాలను పక్కన పెట్టి పార్టీలు చేతులు కలిపితే బీజేపీ దూకుడుని అడ్డుకోగలరని ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తేటతెల్లమైంది. అందుకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలో ఫ్రంట్, లేదంటే థర్డ్ ఫ్రంట్‌కు ఒక రూపు రేఖలు రావడానికి గడువు ఇవ్వకుండా బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళుతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు ఎన్నికలు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే యోచన బీజేపీ చేస్తుందనే చర్చ జరుగుతోంది. ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బీజేపీకి గడ్డు పరిస్థితులు ఈ ఏడాది నవంబర్, డిసెంబర్లలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలకు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాలి. ఇందులో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికార పార్టీగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 2003 నుంచి ఆ పార్టీ అధికారంలో ఉంది. దీంతో అక్కడ బీజేపీ గెలుపు సులభంకాదనే అంటున్నారు. ఇక రాజస్థాన్‌లో కూడా బీజేపీకి పరిస్థితులు అనుకూలంగా లేవు. పైగా కర్ణాటక మాదిరి ప్రతీ ఎన్నికల్లో పాలకపక్షాన్ని ఓడించే సంస్కృతి రాజస్థాన్‌ది. ఆ మూడు రాష్ట్రాల్లో మోదీ మ్యాజిక్, అమిత్ షా చాణక్య వ్యూహాలు పనిచేయవనే అంచనాలు ఉన్నాయి. అందుకే ఆ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్ని నిర్వహిస్తే బీజేపీకి ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే సా«ధారణ పరిస్థితుల్లో 77 శాతం మంది ఒకే పార్టీకి ఓటు వేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. రాష్ట్రాలను కొల్లగొడుతున్నా తగ్గుతున్న బీజేపీ ప్రభ 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ తనకున్న ఇమేజ్‌తో ఒంటిచేత్తో పార్టీని అత్యధిక రాష్ట్రాల్లో విజయతీరాలకు చేర్చినప్పటికీ, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందిన సీట్లను, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పరిశీలించి చూస్తే తగ్గుతూ వస్తున్నాయి. బీజేపీ హవా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలను లోక్‌సభ స్థానాలుగా మార్చి చూసినప్పుడు, 2014 ఎన్నికలతో పోల్చిచూస్తే ఇప్పటివరకు బీజేపీ 45 లోక్‌సభ స్థానాలను కోల్పోయినట్టు ఎన్నికల విశ్లేషకుల అంచనా. అంతేకాదు బీజేపీ అధికారంలోకి వచ్చిన 15 రాష్ట్రాల్లో 2014 ఎన్నికలతో పోల్చి చూస్తే బీజేపీ ఓట్ల శాతం తగ్గిపోతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో ఆ 15 రాష్ట్రాల్లో బీజేపీకి 39 శాతం ఓట్లు వస్తే, ఆ తర్వాత అదే రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 29 శాతానికి ఆ పార్టీ ఓటు షేరు పడిపోయింది. ఇక ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీకి వచ్చే ఓట్ల శాతం మరింత పడిపోవచ్చునని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే వీటితో పాటు లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు బీజేపీ సై అంటుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే లోక్‌సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించడంలో సాధకబాధకాలను బీజేపీ చర్చిస్తోంది. ఈ ఏడాది చివర్లో లోక్‌సభను రద్దు చేసి తమతో కలిసొచ్చే రాష్ట్రాలతో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న చర్చ అయితే మొదలైంది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు మోదీ ఇమేజ్ను కొంత డ్యామేజ్ చేసినప్పటికీ ఆయన అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా సగానికి పైగా మంది ఆయన పరిపాలనపై సంతృప్తిగా ఉన్నారని ఇటీవల సర్వేల్లో వెల్లడి కావడం కమలనాథుల్లో హుషారు నింపింది. ఇప్పుడు కర్ణాటకలో అధికారానికి కొన్ని అడుగుల దూరంలో నిలిచిపోయినా ఈ ఫలితాలు దక్షిణాదిలోనూ సత్తా చాటగలమన్న ఆత్మవిశ్వాసాన్ని బీజేపీ శ్రేణుల్లో నింపాయి. ఇలాంటి సమయంలోనే లోక్‌సభ ఎన్నికల్ని ముందస్తుగా నిర్వహించి మరోసారి అధికార అందలాన్ని అందుకోవాలన్న వ్యూహంలో బీజేపీ ఉందనే అభిప్రాయం అయితే వినిపిస్తోంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
‘ఏపీ సీఎంను డిసైడ్ చేసేది బీజేపీనే’
సాక్షి, విశాఖపట్నం : కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) గెలుపును అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కుటిల యత్నాలను ప్రజలు తిప్పికొట్టారని ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యానించారు. కన్నడ ప్రజాతీర్పుపై ఆయన స్పందిస్తూ.. బీజేపీకి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చిన తెలుగువారికి, కన్నడిగులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సాక్షాత్తు ఎన్జీవో సంఘంతో తమ పార్టీకి ఓటేయద్దని టీడీపీ ప్రచారం చేయించినా మోదీ నాయకత్వంలోని బీజేపీకి బ్రహ్మరథం పట్టారని సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే 2019 ఎన్నికల్లో చంద్రబాబు చెప్పే కల్లబొల్లి మాటలు ప్రజలు వినరని స్పష్టమైందని, సీఎంను ఎన్నుకునే ప్రక్రియలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని విష్ణు కుమార్రాజు జోస్యం చెప్పారు. టీడీపీ నీచ రాజకీయాలకు చరమగీతం టీడీపీ నీచ, నికృష్ట రాజకీయాలకు కన్నడ తెలుగువారు చరమగీతం పాడారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయించాలనుకున్న టీడీపీ తమ్ముళ్ల పప్పులు ఉడకలేదని ఆరోపించారు. కర్ణాటక ప్రజలు తీర్పు ఏకపక్షంగా బీజేపీ వైపు ఉందని మాధవ్ తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు విభజన రాజకీయాలు మానుకుని, నిర్మాణాత్మక ధోరణిలో వెళ్లాలని సూచించారు. కన్నడనాట విజయం బీజేపీ కార్యకర్తల్లో నైతిక స్థైర్యాన్ని నింపిందని వివరించారు. -
చంద్రబాబును తిప్పికొట్టిన కన్నడ ప్రజలు
-
చంద్రబాబుపై ట్వీట్ చేసిన రాంమాధవ్
సాక్షి,న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసంపై బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ కర్ణాటకలో బీజేపీ ప్రభంజనంపైస్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తన విమర్శలను ఎక్కుపెట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పన్నిన రాజకీయ వ్యూహాలను, కుట్రల్ని కన్నడ ప్రజలు పటాపంచలు చేశారన్నారు. బీజేపీకి ఓటు వేయొద్దని ప్రచారం చేయించినా ఆయన ఎత్తుగడలను కర్ణాటక తెలుగు ప్రజలు తిరస్కరించారన్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో బీజేపీకి గత ఎన్నికలతోపోలిస్తే 6నుంచి 20కిపైగా సీట్లు పెరిగాయన్నారు. అంతేకాదు దక్షిణాదిలో తమ విజయ దుందుభి మొదలైందంటూ ట్వీట్ చేశారు. కన్నడ నాట బీజేపీ విజయానికి ప్రధాని మోదీ, అమిత్‌షాతో పాటు స్థానిక నాయకత్వం చేసిన కృషి ఫలించిందన్నారు. ముఖ్యంగా మోదీ చరిష్మా, అమిత్ షా వ్యూహాలు బీజేపీని గెలిపించాయన్నారు. సిద్దరామయ్య ప్రభుత్వం పై వ్యతిరేకతకు తోడు నిర్ణయాత్మక తీర్పు ఇవ్వాలన్న తమ విజ్ఞప్తిని ప్రజలు అంగీకరించారన్నారు. కర్ణాటక బీజేపీ నాయకులు ఐకమత్యంతో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇకనైనా తన పరిస్థితి ఏమిటో ఆత్మపరిశీలన చేసుకోవాలి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా రాదనీ, చంద్రబాబు వాదాన్ని కర్ణాటక తెలుగు ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. కులం, వారసత్వం, డబ్బు రాజకీయాలకు భిన్నంగా ఏపిలో నూతన రాజకీయాలను తీసుకొస్తామని రాం మాధవ్ స్పష్టం చేశారు. రైతులు, దళితులకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదనీ, ఇది కేవలం విపక్షాల దుష్ప్రచారమేనని ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్లు, టెంట్లతో ఒరిగేదేమీ లేదనీ, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమదే విజయమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, మరో సీనియర్ నేత పురందేశ్వరి కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో సిద్ధరామయ్య మహిళా వ్యతిరేక విధానాలను ప్రజలు తిరస్కరించారని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. కర్ణాటకలో తమ పార్టీ ఎలా పని చేసిందో తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాగే ముందుకు వెళతామని ఆమె తెలిపారు. In Karnataka, TDP n Chandrababu Naidu have used all tactics to dissuade Telugu voters from supporting BJP. But in Hyderabad Karnataka where most Telugus live, BJP has increased its tally from 6 to 20+. People have rejected CBN’s politics. Our Southward March has begun. — Ram Madhav (@rammadhavbjp) May 15, 2018 -
అసెంబ్లీ ఎన్నికల్లో మేం కచ్చితంగా గెలుస్తాం
-
‘రాహుల్ గాంధీపై నమ్మకం లేదు కాబట్టే..’
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార జోరు పెంచాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. బీజాపూర్ జిల్లాలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ముఖ్యమంత్రి సిద్దరామయ్య పాలన, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. సిద్దరామయ్య కేబినెట్లో అవినీతి ఆరోపణలు లేని మంత్రి ఒక్కరైనా ఉన్నారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ విభజించు- పాలించు విధానాన్ని పాటిస్తుందని, కులం, మత భేదాలు సృష్టించి సోదరుల మధ్య చిచ్చు పెడుతుందని మోదీ విమర్శించారు. అయితే బసవేశ్వర వంటి మహానుభావుని జన్మస్థలమైన కర్ణాటకలోని ప్రజలు కాంగ్రెస్ ఎత్తుగడలను పారనీయరంటూ వ్యాఖ్యానించారు. 12వ శతాబ్దానికి చెందిన సంస్కర్త బసవేశ్వర పేరును పదే పదే ప్రస్తావిస్తూ మోదీ లింగాయత్‌లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై విశ్వాసం కోల్పోయారని, ఆయనను నమ్ముకుంటే గెలుపు సాధ్యం కాదనే ఉద్దేశంతోనే సోనియా గాంధీని ప్రచారం చేయాల్సిందిగా కోరారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు కాకుండా కాపాడుకునే ప్రయత్నం వారు చేస్తున్నారని మోదీ వ్యాఖ్యానించారు. -
కర్ణాటక బరిలో నేరస్థులు, కోటీశ్వరులు..!
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,560 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వారిలో 15 శాతం అంటే, 391 మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వారు ఉన్నారని, పది శాతం మందిలో అంటే, 254 మందిపై మరీ తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ తాజాగా ఓ నివేదికలో వెల్లడించింది. మొత్తం క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వారిలో నలుగురిపై హత్య కేసులు, 25 మందిపై హత్యాయత్నం కేసులు, 23 మందిపై మహిళలకు వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన కేసులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ తరఫున మొత్తం 224 మంది పోటీ చేస్తుండగా, వారిలో 26 శాతం, అంటే 58 మంది క్రిమినల్ కేసులున్నవారు ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున 220 మంది పోటీ చేస్తుండగా, వారిలో 15 శాతం మంది అంటే, 32 మంది క్రిమినల్ కేసులున్నవారు ఉన్నారు. జనతాదళ్ సెక్యులర్ పార్టీ నుంచి 119 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వారిలో 15 శాతం లేదా 29 మంది క్రిమినల్ కేసులున్న వారే ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 27 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వారిలో ఒక్కరే ఒకరిపై క్రిమినల్ కేసు నడుస్తోంది. 1,090 మంది స్వతంత్య్ర అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వారిలో 70 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాప్‌లు లాంటివి తీవ్రమైన క్రిమినల్ కేసులు. ఎక్కువ క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు పోటీ పడుతున్న అసెంబ్లీ నియోజకవర్గాలను ‘రెడ్ అలర్ట్’ నియోజకవర్గాలుగా ఏడీఆర్ సంస్థ గుర్తించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న 2,560 మంది అభ్యర్థుల్లో 35 శాతం మంది కరోడ్‌పతులు. వారిలో కాంగ్రెస్ పార్టీ తరఫున 94 శాతం మంది, బీజేపీ తరఫున 93 శాతం మంది పోటీ చేస్తుండగా, జేడీఎస్ తరఫున 77 శాతం మంది పోటీ చేస్తున్నారు. జేడీయూ తరఫున 52 శాతం, ఆప్ తరఫున 33 శాతం మంది కోటీశ్వరులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సరాసరి సగటు ఆస్తులు 38 కోట్ల రూపాయలు కాగా, బీజేపీ అభ్యర్థి సగటు ఆస్తులు 17.86 కోట్ల రూపాయలు.