ఇక తెలంగాణపై నజర్‌!     | BJP Focus on Telangana State | Sakshi
Sakshi News home page

ఇక తెలంగాణపై నజర్‌!    

May 16 2018 1:10 AM | Updated on May 16 2018 9:09 AM

BJP Focus on Telangana State - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి ఊపు మీద ఉన్న బీజేపీ.. ఇక తెలంగాణపై పూర్తిస్థాయి లో దృష్టి సారించాలని భావిస్తోంది. బిహార్‌ ఓటమి తర్వాత వ్యూహాలు మార్చుకున్న బీజేపీ... అనంతరం ఆయా రాష్ట్రాల స్థానిక పరిస్థితులను ఆకళింపు చేసుకుని, ప్రత్యేక వ్యూహాలతో వరుస విజయాలు సాధిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ సీఎం సిద్ధరామయ్యపై పెద్దగా వ్యతిరేకత లేకున్నా కూడా.. ఆ పార్టీ ని చావుదెబ్బతీయడంలో సఫలమైంది. ఇక తాజాగా తెలంగాణపై దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో బలంగా ఉన్న టీఆర్‌ఎస్‌ను ఢీకొనేందుకు స్థానిక పరిస్థితుల ఆధారంగా వ్యూహం అవసరమని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయానికి వచ్చింది. 

జాతీయ స్థాయిలో వ్యూహాలు.. 
2014 ఎన్నికల్లో అమిత్‌షా ఎన్నికలకు చాలా ముందు 3 రోజులపాటు హైదరాబాద్‌లో తిష్ట వేసి ప్రణాళికలు రూపొందించి నా.. అవి ఏమాత్రం పనిచేయలేదు. అప్పటికీ ఇప్పటికీ బీజేపీ ఆలోచనలో మార్పు వచ్చింది. అప్పట్లో స్థానిక నేతలపై ఆధారపడి ముందుకెళ్లడంతో దెబ్బతిన్నామని.. ఈసారి తామే వ్యూహాలు ఖరారు చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రాంమాధవ్‌; పార్టీ సీనియర్‌ నేతలు మంగళ్‌పాండే, నరేంద్రసింగ్‌ తోమర్‌లను రంగంలోకి దింపుతున్నట్టు సమాచారం. రాంమాధవ్‌కు రాష్ట్రంలో 5 పార్లమెంటు స్థానాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతను అప్పగించబోతోంది. మిగతా ఇద్దరికి 4 చొప్పున పార్లమెంటు, వాటి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను అప్పగించనున్నారు. 

అన్ని అంశాలను పరిశీలించి: ఆయా ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం, ఆర్థిక, సామాజిక స్థితిగతులు, గత ఎన్నికల్లో గెలిచిన పార్టీ, అందుకు కారణాలు, బీజేపీకి వచ్చిన ఓట్లు, అప్పటి అభ్యర్థి శక్తిసామర్థ్యాలు, ఇప్పుడు అభ్యర్థిగా ఎవరికి అవకాశం ఇవ్వొచ్చు, ఇలా అన్ని రకాల అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని అమిత్‌షా రాష్ట్ర బీజేపీని కోరారు. ఈ నెల 18, 19ల్లో పార్టీ ప్రతినిధి సతీశ్‌జీ నగరానికి వచ్చి ఆయా అం శాలపై చర్చించనున్నారు. అనంతరం ఆ వివరాలను అమిత్‌షాకు అందజేస్తారు. ఆ నివేదిక ఆధారంగా జూన్‌లో అమిత్‌షా తెలంగాణ పర్యటన ఖరారుకానుంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీలపైనా అమిత్‌షా దృష్టి సారించినందున.. వీలు చూసుకుని తెలంగాణకు సమయం కేటాయించనున్నారు.

50 అసెంబ్లీ సీట్లపై టార్గెట్‌ 
ప్రస్తుతం రాష్ట్రంలోని 50 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ కేడర్‌ బలంగా ఉందని కేంద్ర నాయకత్వం అంచనాకు వచ్చింది. బీజేపీ సభ్యత్వ నమోదు, బూత్‌ కమిటీల ఏర్పాటుతో ఆ నియోజకవర్గాలు బలంగా ఉన్నాయని గుర్తించింది. వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించబోతున్నారు. అసెంబ్లీ స్థానాల్లో పార్టీ బలంగా ఉంటే తప్ప పార్లమెంటు స్థానా ల్లో గెలుపు సాధ్యం కాదనేది అమిత్‌షా 2 రోజుల క్రితం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు చెప్పిన మాట. ఏవో 4 కార్యక్రమాలు నిర్వహించి, ఎవరినో ఒకరిని అభ్యర్థిగా నిలబెడితే గెలుపు సాధ్యం కాదని స్పష్టం చేసినట్టు తెలిసింది. సంస్థాగతంగా పార్టీపై దృష్టి సారిస్తే గెలుపు సాధ్యమన్న అభిప్రాయం తీసుకురావాలని.. ఇందుకు చాలా విషయాలు అవసరమని, వాటికి కోసం ప్రత్యేక నివేదిక రూపొందించాలని అమిత్‌షా ఆదేశించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement