ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార జోరు పెంచాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. బీజాపూర్ జిల్లాలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ముఖ్యమంత్రి సిద్దరామయ్య పాలన, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. సిద్దరామయ్య కేబినెట్‌లో అవినీతి ఆరోపణలు లేని మంత్రి ఒక్కరైనా ఉన్నారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ విభజించు- పాలించు విధానాన్ని పాటిస్తుందని, కులం, మత భేదాలు సృష్టించి సోదరుల మధ్య చిచ్చు పెడుతుందని మోదీ విమర్శించారు. అయితే బసవేశ్వర వంటి మహానుభావుని జన్మస్థలమైన కర్ణాటకలోని ప్రజలు కాంగ్రెస్ ఎత్తుగడలను పారనీయరంటూ వ్యాఖ్యానించారు. 12వ శతాబ్దానికి చెందిన సంస్కర్త బసవేశ్వర పేరును పదే పదే ప్రస్తావిస్తూ మోదీ లింగాయత్‌లను ఆకర్షించే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై విశ్వాసం కోల్పోయారని, ఆయనను నమ్ముకుంటే గెలుపు సాధ్యం కాదనే ఉద్దేశంతోనే సోనియా గాంధీని ప్రచారం చేయాల్సిందిగా కోరారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు కాకుండా కాపాడుకునే ప్రయత్నం వారు చేస్తున్నారని మోదీ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment