మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాల్లో లక్ష్మణ్, దత్తాత్రేయ, పార్టీ శ్రేణులు
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ సమయంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఉదయం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ హవా కనిపించటంతో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో పెద్దగా హడావుడి కనిపించలేదు. కాసేపటికి ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలు కాగానే బీజేపీ పుంజుకుంది. దీంతో కార్యకర్తల సందడి ప్రారంభమైంది. బీజేపీ లీడ్‌లోకి దూసుకెళ్లడంతో కార్యాలయానికి భారీగా నేతలు, కార్యకర్తల రాక మొదలైంది.
11 గంటలు దాటేసరికి కాంగ్రెస్‌కు అందనంత ముందుకు బీజేపీ వెళ్లిపోవటంతో గెలుపు తథ్యమంటూ టపాసుల పేలుళ్లు ప్రారంభమయ్యాయి. డప్పు శబ్దాలు మారుమోగాయి. పెద్ద నేతల ఆగమనం.. ప్రధాని మోదీకి జయజయధ్వానాల తో ప్రాంతం హోరెత్తింది. బీజేపీ 119 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి సహా పలువురు నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కర్ణాటకలో మోదీ హవా వీచిందని, ఎవరెన్ని కుట్రలు చేసినా కన్నడ ఓటర్లు బీజేపీకే పట్టం కట్టారని అన్నారు. మధ్యాహ్నానికి పరి స్థితి మారిపోవటంతో అంతా డీలా పడ్డారు. హంగ్ తథ్యమని తేలటంతో కార్యకర్తలు సంబరాలు ఆపేసి వెనుదిరిగారు.
తెలుగు రాష్ట్రాల సీఎంల ఆశలు గల్లంతు
బీజేపీని ఓడించి.. తద్వారా ప్రధాని మోదీ చరిష్మాను తగ్గిందనే సంకేతాలు పంపేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కర్ణాటకలో హడావుడి చేయబోయి భంగపడ్డారని లక్ష్మణ్, దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర సీఎం జేడీఎస్‌కు మద్దతు ఇచ్చి ఆ పార్టీ గెలుపు కోసం యత్నించారని, ఏపీ సీఎం నేరుగా కాంగ్రెస్‌కు మద్దతిచ్చి అక్కడి తెలుగు ఓటర్లను ప్రభావితం చేయబోయి బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment